close

మంగళవారం, మే 21, 2019

ప్రధానాంశాలు

దారి మాయం.. దగా ఖాయం!   

ఏడాదైనా కాకుండానే దెబ్బతిన్న రహదారి 
నాణ్యత ఊసే లేక రాళ్లు తేలిన దారుణం 
మళ్లీ మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం 
రూ.8 కోట్ల రహదారి విస్తరణలో దారుణం 
ఈనాడు - అనంతపురం 

తాడిపత్రి పట్టణం నుంచి రైల్వేగేట్‌ దాటుకుంటూ యల్లనూరు వెళ్లే మార్గం ఉంది. ఇందులో తాడిపత్రి నుంచి శనగలగూడురు వరకు ఉన్న రహదారిలో 10 కి.మీ. మేర ఉన్న పాత రహదారికి ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టారు. ఇరువైపులా చెరో 1.62 మీటర్లు చొప్పున విస్తరించారు. మొత్తం 3.24 కి.మీ. రహదారిని ఇరువైపులా కలిపి విస్తరించారు. ఇందుకు రూ.8.25 కోట్ల మేర నిధులు వెచ్చించారు. ఈ పనులను తాడిపత్రికే చెందిన ఓ గుత్తేదారు దక్కించుకొని పనులు చేశారు. గత ఏడాది చివర్లో ఈ పనులు ఆరంభించగా, అప్పట్లో మోస్తరు వర్షాలు కురవడంతో కొద్ది రోజులు పనులు ఆపేసి... మళ్లీ చేపట్టారు. మొత్తానికి కొద్ది నెలల కిందటే ఈ పనులు పూర్తయ్యాయి. దీంతో అటువైపు ప్రయాణం సాగించే వారంతా తమకు ఈ రహదారిలో కష్టాలు తీరినట్లే అని భావించారు. గతంలో మాదిరిగా ఇరుకు రహదారిలా కాకుండా, విస్తరించిన పెద్ద రహదారిలో రయ్‌మని పోవచ్చని అనుకున్నారు. అయితే ఇప్పుడా రహదారిలో కొన్ని చోట్ల చూస్తే, అధ్వానంగా మారింది.

విస్తరించిన చోటే దెబ్బతింది... 
తాడిపత్రి పట్టణం దాటాక రైల్వేగేట్‌ వద్ద నుంచి ఈ రహదారి పలు చోట్ల దెబ్బతింది. దాదాపు మూడు కి.మీ. దూరంలో పలు చోట్ల రహదారి ఎక్కువగా దెబ్బతింది. ప్రధానంగా ఇరువైపులా కొత్తగా విస్తరించిన రహదారి భాగమే దెబ్బతినడం విశేషం. నాణ్యత లోపంతో తారు పోయి, రాళ్లన్నీ బయటకు తేలాయి. కొన్నిచోట్ల రహదారి గుంతలమయంగా మారింది. ఆ ప్రాంతంలో ఏదైనా వాహనం వేగంగా వెళితే, రాళ్లు కదలడమే కాకుండా, దుమ్ము కూడా లేస్తోంది. వాస్తవానికి పనులు పూర్తికాకుండా వేసిన రహదారి దెబ్బతినడంతో పలు చోట్ల ప్యాచ్‌లు వేశారు. అయినా సరే... మళ్లీ దెబ్బతినడం ఆగలేదు. మొత్తానికి పలు చోట్ల రహదారి ఘోరంగా తయారైంది. యల్లనూరు రోడ్డులో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలు కూడా ఈ రహదారి దెబ్బతినడంలో తమ వంతు పాత్రపోషించాయి. టిప్పర్లలో అధిక లోడుతో ఇసుకను తీసుకెళ్లడంతో కూడా ఈ రహదారి దెబ్బతింది. మొత్తానికి ఏడాది కూడా పూర్తికాకుండా ఈ రహదారి దెబ్బతినడం విశేషం. మరోవైపు దెబ్బతిన్న ఈ రహదారిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు ఇంజినీర్లు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు.

పూర్తిస్థాయిలో మరమ్మతులు 
ఈ రహదారి ప్రధానంగా దెబ్బతినడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీని విస్తరణ పనులు నాబార్డ్‌ నిబంధనల మేరకే చేశారు. మరోవైపు ఇసుక రీచ్‌ల నుంచి అధిక లోడ్‌తో లారీలు ఎక్కువగా తిరగడంతో రహదారి పలు చోట్ల దెబ్బతింది. అధిక లోడుతో వెళ్లకుండా చూడాలని అధికారులను కూడా కోరా. దెబ్బతిన్న రహదారిని పూర్తిగా మరమ్మతు చేయనున్నాం. ఇందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం.

- మహలింగప్ప, రభశ తాడిపత్రి డివిజన్‌ డీఈ

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.