మహానగరం గొంతెండుతోంది - Hyderabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

మహానగరం గొంతెండుతోంది

15 వేలకు దాటిన ట్యాంకర్ల నిరీక్షణ జాబితా
  సరఫరా.. డిమాండ్‌కు కుదరని పొంతన
  బుక్‌ చేసిన 10 రోజులైనా దిక్కులేదాయే
  గ్రేటర్‌లో అడుగంటిన వేలాది బోరుబావులు
  అపార్ట్‌మెంట్లకు చుక్కలు చూపిస్తున్న కొరత
ఈనాడు, హైదరాబాద్‌

* బల్కంపేటకు చెందిన ఓ వినియోగదారుడు (క్యాన్‌ నం:612713653) ఈ నెల 10న మంచి నీటి ట్యాంకర్‌ కోసం జలమండలి వినియోగదారుల కేంద్రం 155313కు ఫోన్‌ చేశారు. ట్యాంకర్‌ బుక్‌ అయినట్లు సదరు వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌కు వచ్చింది. వాస్తవానికి 24 గంటల్లో ట్యాంకర్‌ పంపించాలి. విశేషమేమిటంటే మంగళవారం సాయంత్రానికి కూడా ట్యాంకర్‌ జాడే కనిపించలేదు.
* మధురానగర్‌కు చెందిన మరో వినియోగదారుడు(టోకెన్‌ నం:9742) ఈ నెల 15న ట్యాంకర్‌ కోసం జలమండలికి ఫోన్‌ చేసి బుక్‌ చేసుకున్నారు. 24 గంటలే కాదు...ఇప్పటికి ఆరు రోజులైనా దిక్కుమొక్కు లేదు. మంగళవారం సాయంత్రానికి కూడా ట్యాంకర్‌ డెలివరీ కాకపోవడం విశేషం.

వీరిద్దరు మాత్రమే కాదు.. గ్రేటర్‌లో వేలాది మంది తాగునీటి కోసం అనేక ప్రాంతాల్లో అల్లాడి పోతున్నారు. జలమండలి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నా... డిమాండ్‌ మేరకు సర్దుబాటు చేయలేకపోతోంది.
మహానగరం గొంతెండుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరడంతో అమాంతంగా నీటికి డిమాండ్‌ పెరిగింది. వాస్తవ డిమాండ్‌కు సరఫరాకు పొంతన కుదరడం లేదు. గ్రేటర్‌ నీటి అవసరాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు 40 ఎంజీడీలే సరఫరా అయ్యేవి. నగరం విస్తరించింది.. జనాభా కోటికి పెరిగింది.. నల్లాల సంఖ్య 9.6 లక్షలకు పెరిగింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల మేర జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. గృహ, పారిశ్రామిక ఇతర అన్ని రకాల అవసరాలకు జలమండలి నీళ్లే దిక్కు.వాస్తవ డిమాండ్‌రోజుకు 650 మిలియన్‌ గ్యాలన్ల వరకు ఉంటే.. 467 మిలియన్‌ గ్యాలన్లు మాత్రమే అందిస్తున్నారు. ఈ నీళ్లైనా నగరానికి పూర్తిగా అందుతున్నాయా అంటే ఇందులోనే 40 మిలియన్‌ గ్యాలన్ల నీటిని మిషన్‌ భగీరథకు కేటాయిస్తున్నారు. ఇవి పోను నగరానికి 427 మిలియన్‌ గ్యాలన్లకు మించి అందడం లేదు. సింగూరు, మంజీరా పూర్తిగా అడుగంటి పోవడంతో ఒకేసారి రోజుకు 120 మిలియన్‌ గ్యాలన్లకు కోత పడింది. ఆ నీటిపై ఆధారపడిన ప్రాంతాల్లో కటకట మొదలైంది. గోదావరి, కృష్ణా జలాలను కొంత అటువైపు మళ్లించినా కొరత అధిగమించలేక పోతున్నారు.

జలాశయాల్లో ప్రమాద ఘంటికలు..
నగరానికి నీటి సరఫరా చేసే జలాశయాల్లోను జలఘంటికలు మోగుతున్నాయి. ఎప్పుడో సింగూరు, మంజీరా ఎండిపోయాయి. నాగార్జున్‌సాగర్‌లో జలాలు 510.800 అడుగులకు తగ్గింది. మరో అడుగు తగ్గితే అత్యవసర పంపింగ్‌ చేయాలి. నగరానికి కృష్ణా జలాలే జీవన నాడి. మొత్తం 467 ఎంజీడీల్లో 277 ఎంజీడీలు కేవలం కృష్ణా ద్వారానే సేకరిస్తున్నారు. మరో 164 ఎంజీడీలు గోదావరి నుంచి తీసుకుంటున్నారు. ఇవికాక 26 ఎంజీడీలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి సేకరిస్తున్నారు. నాగార్జున్‌సాగర్‌లో అత్యవసర పంపింగ్‌ కోసం దాదాపు రూ.2.8 కోట్లు కేటాయించారు. ఎల్లంపల్లి(గోదావరి)లో ప్రస్తుతం 142 అడుగుల జలాలు ఉన్నాయి. మరో 4 అడుగులు తగ్గితే ఇక్కడా అత్యవసర పంపింగ్‌ తప్పేటట్లు లేదని అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ప్రణాళిక లోపంతోనే...
వాస్తవానికి గతంతో పోల్చితే నీటి సరఫరా పెరిగింది. 20 ఎంజీడీలు అదనంగా అందిస్తున్నారు. అధికారుల్లో ప్రణాళిక లోపం ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాన, చలి కాలంలో సాధారణంగా నీటి డిమాండ్‌ తక్కువగా ఉంటుంది. కొంత సరఫరా తగ్గించినా పెద్దగా నష్టం లేదు. ఆ మేరకు జలాశయాల్లో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కొంత ఆవిరి రూపంలో పోయినా నీటి పొదుపు వల్ల వేసవిలో ఆ నీటిని వాడుకునే వీలు ఉండేది. జంట జలాశయాలను ఆ విధంగానే వాడడం వల్ల ప్రస్తుతం అవి ఆదుకుంటున్నాయి. ఎటొచ్చి కృష్ణా, గోదావరిలో పొదుపు చర్యలు పాటించడంలో విఫలమయ్యారు. మరోవైపు సింగూరు, మంజీరా నీటిని ఇతర అవసరాలకు వాడేయటం వల్ల  నగరానికి నీటి కొరత తప్పడం లేదు. కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు నీటి సరఫరా నిలిపివేయడంతో జలమండలి నెలకు రూ.4.5 కోట్లు ఆదాయాన్ని కోల్పోయింది. అదే మంజీరా, సింగూరులను పొదుపుగా వాడుకొని ఉంటే ఇప్పుడు కటకట తప్పేదని అంటున్నారు.

అధికంగా అక్కడే...
కొన్ని డివిజన్‌లలో కొరత ఎక్కువగా ఉంటోంది. గతంలో మంజీరా, సింగూరు జలాలు అక్కడకు సరఫరా అయ్యేవి. రోజూ 120 ఎంజీడీలు అందుతుండడంతో పుష్కలంగా సర్దుబాటు అయ్యేవి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మేరకు కృష్ణా గోదావరితో నెట్టుకొస్తున్నారు. రోజు విడిచి రోజు...కొన్నిసార్లు మూడు లేదా 5రోజులకోసారి అందిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తాగునీటికి డిమాండ్‌ పెరిగింది. మంగళవారానికి ట్యాంకర్‌ నిరీక్షణ జాబితా 15,700 వరకు దాటింది. ఇందులో కేవలం డివిజన్‌లోనే 4400 వరకు ఉన్నాయి.

గుట్టలపై నివాసితులకు కష్టాలే...
వెంగళ్‌రావునగర్‌(అల్లాపూర్‌): అల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలో పర్వత్‌నగర్‌, శ్రీవివేకానందనగర్‌ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రోజు విడిచి రోజు 40 నిమిషాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. తక్కువ ఒత్తిడి వల్ల పర్వత్‌నగర్‌ గుట్టపైనున్న నివాసాలకు నీరు చేరటం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ట్యాంకర్లు బుక్‌చేసినా రావటానికి వారం నుంచి పదిరోజులు పడుతోంది. గత్యంతరం లేక ప్రైవేటు ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు. శ్రీవివేకానందనగర్‌లో అదే పరిస్థితి. ఓ ప్రాంతంలో కలుషితమవుతున్న కారణంగా 20 రోజులుగా సరఫరా నిలిపివేశారు. తాగటానికి నీళ్లులేక 200 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు.

అయిదు రోజులకు ఒకసారి ...
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో  నీటి సరఫరాకు మూడు నుంచి ఐదురోజుల సమయం పడుతోంది. బోర్లు ఎండిపోవడంతో పూర్తిగా ట్యాంకర్లపై ఆధారపడుతన్న ప్రాంతాలు అనేకం. ప్రజలకు సరిపడా నీరు.. నిర్దేశిత వేళల్లో ఇవ్వలేకపోతున్నారు. లింగంపల్లి నుంచి అరకొరగా సరఫరా చేస్తున్నారు. కేపీహెచ్‌బీకాలనీ నాలుగు, ఐదు, ఏడో ఫేజులు, మూసాపేట, భరత్‌నగర్‌ ప్రాంతాల్లో తాగునీటి సమస్య జటిలంగా మారింది. కూకట్‌పల్లి డివిజన్‌లో 2వేలకు పైగా ట్యాంకర్ల పెండింగు జాబితా ఉంది. బుక్‌ చేస్తే పదిరోజుల లోపు రావడం గగనమైంది. ఇటీవల కొన్ని రోజులుగా 2వారాలు పడుతోందనివాపోతున్నారు. దీంతో ట్యాంకర్‌ రాగానే వెంటనే మరోటి బుక్‌చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది.

సరఫరాలో భారీ కోత...
రాజధాని నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్‌్్స తదితర ప్రాంతాల్లో నెల కిందటి వరకు రోజు విడిచి రోజు వేగంగా గంటన్నర పాటు జలాలు సరఫరా అయ్యేవి. ఇప్పుడు అరగంట మించి ఇవ్వడమే గగనం. మంగళవారం కొన్ని కాలనీల్లో ఉదయం సరఫరా చేయాల్సి ఉండగా నీటి నిల్వలు లేకపోవడంతో సాయంత్రం అరగంటే వదిలారు. అందుబాటులో ఉన్న నీటినే అన్ని ప్రాంతాలకు సర్దుబాటు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం 50వేల బోర్లు ఎండిపోయాయి.కృష్ణా, గోదావరిలో తరచూ విద్యుత్తు కోతలు తప్పడం లేదు. కృష్ణాలో ఒక్కో పంపు సామర్థ్యం 11.5 ఎంజీడీలు కాగా...అదే గోదావరిలో ఒక పంపు సామర్థ్యం 28.5 ఎంజీడీలు. ఒక పంపు సరఫరాకు ఆటంకం ఏర్పడినా ఆ మేరకు నీటికి కోత తప్పదు.

ప్రత్యామ్నాయ చర్యలు: జలమండలి
ప్రజలకుసమస్య లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు జలమండలి తెలిపింది. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ విద్యుత్తు అంతరాయం వల్ల నీటి సరఫరా తగ్గుతోందని పేర్కొంది. కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఇప్పటికే 120 ట్యాంకర్లను అదనంగా పెంచిన సంగతి తెలిసిందే. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరో వంద ట్యాంకర్లను పెంచాలని ఎండీ దానకిషోర్‌ ఆదేశించారు. తక్షణం నిరీక్షణ జాబితాను తగ్గించి..బుక్‌ చేసుకున్న వెంటనే ట్యాంకర్‌ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

డ్రమ్ముల్లో నీళ్లు... వాటికి తాళాలు
జూబ్లిహిల్స్‌: జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌.. సకల సౌకర్యాలకు ఇవి నిలయాలని భావిస్తారు. కాని బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాలతోపాటు జూబ్లీహిల్స్‌లోని బస్తీలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి.బంజారాహిల్స్‌ రోడ్‌ నం: 4లోని గాంధీపుర, దేవరకొండ బస్తీలు, నందినగర్‌, వెంకటేశ్వరనగర్‌, ఎన్బీటీనగర్‌, ఇందిరానగర్‌, జవహార్‌నగర్‌లలో కొద్ది రోజులుగా నీరు తక్కువ ఒత్తిడితో రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు కేవలం 30 నుంచి 45 నిమిషాలే వస్తున్నాయి. దీంతో మూడు రోజుల క్రితం గాంధీపుర బస్తీ వాసులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 5లోని దుర్గాభవానీ నగర్‌ బస్తీలో పరిస్థితి మరోలా ఉంది. జూబ్లీహిల్స్‌ లాంటి సంపన్న ప్రాంతంలోని బస్తీల్లో నీరు నింపిన డ్రమ్ములకు తాళాలు వేసుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్‌, అంబేడ్కర్‌నగర్‌ బస్తీలలో సైతం ఇలాంటి సమస్యే ఉంది.

పేదబస్తీలో ట్యాంకర్ల గోల్‌మాల్‌
కాప్రా, ఉప్పల్‌: ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో నల్లాలున్న కాలనీల్లో రెండు మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. కేటీఆర్‌నగర్‌, కేజీనగర్‌, బాలకృష్ణనగర్‌, హబ్సీగూడ పరిధిలోని ఓయూ నాలుగైదు క్యాంపు బస్తీల్లో ఐదారు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా  సరఫరా చేస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాప్రా సర్కిల సాయిరాంనగర్‌, సాయిబాబానగర్‌, న్యూ ఇందిరానగర్‌, చర్లపల్లిలోని ఇందిరమ్మ గృహసముదాయం, పుక్కట్‌నగర్‌, భరత్‌నగర్‌, మీర్‌పేట్‌ తదితర మురికివాడల్లో నేటికీ ట్యాంకర్ల ద్వారానే నీళ్లందుతున్నాయి. చాలా చోట్ల వారం నుంచి పది రోజులకు ఒకసారి మాత్రమే. దీంతో ట్యాంకరు రాగానే పానీపట్టు యుద్ధాలు తప్పడం లేదు. భూగర్భజలాలు అడుగంటడంతో  పవర్‌ బోర్లు పనిచేయడం లేదు.

హైటెక్‌ సిటీలో అరకొర
మాదాపూర్‌: మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇళ్లల్లో బోర్లు పూర్తిగా వట్టిపోయాయి.  రోజు వారీ అవసరాల కోసం సైతం జలమండలి నీటి మీద ఆధారపడాల్సి వచ్చింది. ట్యాంకర్‌ బుక్‌ చేసిన వారం తరువాత గానీ  రావడం లేదు. స్థానికులు ప్రైవేటు ట్యాంకర్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వీరు 5వేల లీటర్ల ట్యాంకర్‌కి రూ.2500-3000 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. పదివేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.5-6వేల వరకు వసూలు చేస్తున్నారు. అయినా వీరు సరఫరా చేసే నీరు కలుషితంగా ఉంటున్నాయి. మురుగునీటితో నిండిన చెరువుల వద్ద బోర్లు వేసి అక్కడి నుంచి నీటిని తెస్తున్నారు.

ఎప్పుడు వస్తాయో.. తెలియదు
యూసుఫ్‌గూడ: యూసుఫ్‌గూడ డివిజన్‌లో మంచినీటి సమస్య తీవ్రతరం అవుతోంది. రెండు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. అదీ ఎప్పుడు  ఎంతసేపు ఇస్తారో తెలియదు. కొన్నిసార్లు మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు సక్రమంగా సరఫరా చేయక పోవడంతో వారం క్రితం ఎల్లారెడ్డిగూడలోని జలమండలి సెక్షన్‌ కార్యాలయం వద్ద ట్యాంకర్‌ల టైర్లలో గాలి తీసివేసి ఆందోళన చేశారు. నీటిని బస్తీలలో సరఫరా చేయకుండా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గతవారం స్థానికులు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ సమీపంలోని బూస్టర్‌ వద్ద  నిరసనను తెలిపారు. నీటి సరఫరా చేసే వరకు కదిలేది లేదని బైఠాయించారు.

సికింద్రాబాద్‌లో పెరుగుతున్న ఇక్కట్లు
సికింద్రాబాద్‌: నీటి ఇక్కట్లు రోజురోజుకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నప్పటికీ ఇతర అవసరాలకు కావాల్సిన నీరు సరిపోవడంలేదు. పవర్‌బోర్లు చాలా ప్రాంతాల్లో పనిచేయడం లేదు. వాటికి మరమ్మతులు చేయకపోవడం, చేతిపంపులను యంత్రాంగం పట్టించుకోక పోవడంతో పరిస్థితి దిగజారుతోంది. సమీపంలోని సెక్షన్‌ కార్యాలయంవద్ద ఉన్న కుళాయి చెంతకు జనం వరుసలు కడుతున్నారు. డివిజన్‌లోని పది సెక్షన్‌కార్యాలయాల పరిధిలో ఏప్రిల్‌లో ఏకంగా ఆరువేల ట్యాంకర్ల నీటిని వాడుకున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.