close

ఆదివారం, జూన్ 16, 2019

ప్రధానాంశాలు

హరితహారం లక్ష్యం 1.71కోట్ల మొక్కలు

గత ఏడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్య
నర్సరీల్లో సిద్ధమవుతున్న మొక్కలు
ఈనాడు-హైదరాబాద్‌

హరితహారంలో భాగంగా నగర శివారులుసహా రంగారెడ్డి జిల్లా పరిధిలో 1.71 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాదితో పోల్చితే ఈ విడత దాదాపు రెట్టింపు స్థాయిలో మొక్కలు నాటేలా వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. గత ఏడాది మొత్తం 86 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు. దాదాపు 53 లక్షల మొక్కలు నాటారు. ఈ ఏడాది వర్షాలు మొదలుకాగానే ప్రతి పంచాయతీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని భావిస్తున్నారు. పైగా ఈ ఏడాది ప్రభుత్వం 560 గ్రామ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. వారి విధుల్లో మొక్కల పెంపకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. దీంతో ఈ ఏడాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యం మేరకు చేపట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా నూతన పంచాయతీల పాలకవర్గాలకూ మొక్కలు నాటే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వమని కోరుతున్నారు.

వర్షాలు పడ్డ తర్వాత..
ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటే వారికి మామిడికి మొక్కకు రూ.90, టేకుకు రూ.17, జామకు రూ.60 చొప్పున చెల్లిస్తారు. డీఆర్డీఏ ద్వారా మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే గుంతలు తీసే పనులు మొదలయ్యాయి. వర్షాలు పడ్డ తరవాత జూన్‌ నెలాఖరుకు లేదా జులై తొలి రెండు వారాల్లో హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. గతం కంటే రెట్టింపు మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఏ మేరకు సఫలీకృతులవుతారో చూడాల్సి ఉంది.

వివిధ శాఖల వారీగా..
ఈ విడతా నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకునేలా ముందు నుంచే ప్రణాళిక సిద్ధమైంది. గత ఏడాది ప్రతి పంచాయతీ పరిధిలో ఒక నర్సరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాదాపు 468 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి.. 2.04కోట్ల మొక్కలు పెంచారు. ఇప్పుడు ఇవన్నీ నాటేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం లక్ష్యంలో దాదాపు 50లక్షల మొక్కలను డీఆర్డీఏ శాఖ ద్వారా ఉపాధిహామీ పథకం నిధులు ఉపయోగించుకుని నాటాలని భావిస్తున్నారు. అటవీశాఖ ద్వారా 15లక్షలు, వ్యవసాయశాఖ ద్వారా 20లక్షలు, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 20లక్షలు, ఉద్యానశాఖ ద్వారా మరో 10లక్షలు మొక్కలు నాటించాలని లక్ష్యం పెట్టుకున్నారు. మిగిలిన మొక్కలు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నాటుతారు. సామాజిక అటవీ పెంపకం కింద మరో 40లక్షల మొక్కలు నాటేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ శ్రీగంధం మొక్కలు పెంచనున్నారు

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.