close

శుక్రవారం, ఆగస్టు 23, 2019

ప్రధానాంశాలు

ఏకరూపం.. బహుదూరం

 రంగు ఎంపికలో ఇంకా రాని స్పష్టత!
 ఏటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇదే తంతు
 సకాలంలో యూనిఫామ్‌లు అందించటం కష్టమే
ఈనాడు, హైదరాబాద్‌

మరో పదిరోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. పలు ప్రయివేటు విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు. హైదరాబాద్‌ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నిధుల లేమిని సాకుగా చూపుతూ మరమ్మతులు చేపట్టాల్సిన బడులను వదిలేశారు. పాఠ్యపుస్తకాలను సమయానికి అందించటం కష్టమనే ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌ రంగు మార్చాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఐదారు నెలల క్రితమే దీనిపై స్పష్టత వచ్చినా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటం వల్ల ఆలస్యమైనట్లుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ కొత్త రంగు ఎంపికలో స్పష్టత రాలేదని తెలుస్తోంది. రంగుదుస్తులు ఎంపికైన తరువాతనే గుత్తేదార్లకు పనులు అప్పగిస్తారు. ఏకరూప దుస్తులు విద్యార్థులకు చేరేందుకు మరో 30-45 రోజుల వరకూ పట్టవచ్చని సమాచారం. జిల్లాలో 1-10వ తరగతి వరకూ 1.15లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. జూన్‌, అక్టోబరు నెలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేయటం ఆనవాయితీ. రాష్ట్రంలో ఇతర జిల్లాలకు సకాలంలో దుస్తులు అందజేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం హైదరాబాద్‌ విషయంలో తాత్సారం చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన చెబుతున్నారు.

హడావిడిగా వస్త్రాల కొనుగోలు.. ఒత్తిడిలో టైలర్లు..
సకాలంలో ఏకరూప దుస్తులు(యూనిఫాం) అందించకపోవటంతో చిరిగిన దుస్తులతో బడిబాటపడుతున్నారు. ఒక్కసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు. కానీ.. ఏటా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. పాఠశాలలు ప్రారంభమైన 10-20 రోజులకు హడావుడిగా వస్త్రాలు కొనుగోలు చేసి గుత్తేదారుల చేతికి ఇస్తున్నారు. అధికారుల ఒత్తిడితో టైలర్లు కూడా వేగంగా పనిపూర్తిచేసి చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా కుట్లు సరిగాలేకపోవటం వల్ల ధరించిన మరుసటిరోజే గుండీలు, హుక్సులు ఊడిపోతున్నాయి. నెలరోజులు ముందుగా తమకు యూనిఫామ్‌ వస్త్రం అందిస్తే మరింత నాణ్యతగా అందించగలమంటున్నారు గుత్తేదారులు.

అడిగేనాథుడెవరు..?
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు కార్పొరేట్‌ ఫీజులు, ఖరీదైన యూనిఫామ్‌ భరించలేక సర్కారు బడుల్లో చేరుతుంటారు. ఇటువంటి పాఠశాలల విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్న నగరంలో ఇటువంటి దుస్థితి తలెత్తడంపై ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తంచేశాయి. గత విద్యాసంవత్సరం కుట్టిన ఏకరూప దుస్తులకు చెల్లించాల్చిన బకాయిలు ఏడాది గడుస్తున్నా ఇవ్వలేదని గుత్తేదార్లు వాపోతున్నారు. మిగిలిన జిల్లాల్లోని వారికి సమయానికి నిధులు మంజూరు చేశారని తమ విషయంలోనే రేపుమాపంటూ తాత్సారం చేస్తున్నారంటూ ఆరోపించారు. సర్కారు పాఠశాలల్లో 1-7 తరగతి వరకూ విద్యార్థులకు నిక్కరు, చొక్కా,  8-10 వరకూ ఫ్యాంటు, చొక్కా అందిస్తారు. విద్యార్థినులకు 8-10 వరకూ పంజాబీడ్రెస్‌ అందజేస్తారు. ఒక్కో జత కుట్టేందుకు గుత్తేదారుకు రూ.50 వరకూ చెల్లిస్తారు. ఏకరూప దుస్తులు కుట్టుగోలుకు బయట టైలర్లు రూ.300-400 వరకూ వసూలు చేస్తారు. నాణ్యమైన గుండీలు, దారం ఉపయోగించటం వల్ల కుట్టు మన్నికగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు అందించే దుస్తులకు కేవలం రూ.50 మాత్రమే ఇవ్వటంతో కొందరు గుత్తేదార్లు నాసిరకం దారం, గుండీలు ఉపయోగిస్తున్నారు. విద్యార్థుల కొలతలు తీసుకోకుండా తరగతుల వారీగా విద్యార్థిని, విద్యార్థుల కొలతలను అంచనా వేసి దుస్తులు కుడుతున్నారు. పంపిణీ అనంతరం విద్యార్థుల్లో కొందరికి బిగుతుగా, వదులుగా మారుతున్నాయి. బిగుతుగా ఉండటం వల్ల కుట్లు ఊడిపోవటం, చిరిగిపోవటం సాధారణంగా మారిందని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరించారు. మూడేళ్లుగా ఇదే తప్పిదం తలెత్తుతుందని తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పారు. సరైన పర్యవేక్షణ లేకపోవటం వల్లనే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.