ప్లాస్టిక్‌ సంచీ.. అనారోగ్యంలో ముంచి.. - Hyderabad - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ప్లాస్టిక్‌ సంచీ.. అనారోగ్యంలో ముంచి..

 టీ స్టాళ్లు, హోటళ్లలో యథేచ్ఛగా వినియోగం
 వాటిలోనే వేడి పదార్థాల సరఫరా
  ప్రజారోగ్యానికి ముప్పంటున్న వైద్య నిపుణులు
న్యూస్‌టుడే, కేపీహెచ్‌బీ కాలనీ

జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం నగర పరిధిలో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. కానీ ఇదే సమయంలో అధికారులు ప్రజారోగ్యం విషయంలో వెనకపడ్డారు. నగరంలోని టీ స్టాళ్లలో, హోటళ్లలో తక్కువ రకం పాలిథిన్‌ సంచుల్లో యథేచ్ఛగా తేనీరు, వేడివేడి ఆహార పదార్థాలు పోసి విక్రయిస్తున్నారు. గతంలో ఇలాంటి దుకాణాలు, ఆహారశాలలపై దాడులు చేసి జరిమానాలు విధించారు. ఆ తర్వాత ఈ ప్రకియను అటకెక్కించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ ప్రక్రియలో భాగంగా అత్యధికంగా తామే 11 మెట్రిక్‌ టన్నులు సేకరించామని ముసాపేట సర్కిల్‌ అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిషేధిత తక్కువ రకం పాలిథిన్‌ సంచుల నిరోధానికి చర్యలు తీసుకోవడం మాటే మరిచారు. దీంతో ఎవరికి వారు వీటిని ఎడాపెడా వినియోగించేస్తున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ప్రజారోగ్యానికి కచ్చితంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేడి పదార్థాలు వీటిలో పోస్తే..
ఎవరైనా నలుగురు కలిస్తే టీ తాగేందుకు స్టాళ్లకి వెళ్లలేక.. తామున్న వద్దకే పొగలు కక్కే వేడి చాయ్‌ని ప్లాస్టిక్‌ సంచిలో పార్సిల్‌ చేయించి తెప్పించుకుంటున్నారు. ఇలా తీసుకెళ్లిన టీని కప్పుల్లో పోసుకొని తాగుతున్నారు. ఈలోపు వేడికి ప్లాస్టిక్‌ కరిగి చాయ్‌ లేదా ఆహార పదార్థాలలో కలిసిపోతోంది. ఈ క్రమంలో పాలీ వినైల్‌ క్లోరైడ్‌ అనే ప్రమాదకరమైన రసాయనం కడుపులోకి వెళుతోంది. కాలేయంలోకి చేరుతుంది. ఈ పరిస్థితి కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. తేలికగా పనవుతోంది కదా అని వినియోగదారులు, డబ్బు తీసుకున్నాం.. టీ ఇచ్చాం కదా అని స్టాళ్ల నిర్వాహకులు భావిస్తున్నారు. కాని ఇది ఆరోగ్యానికి ఎంత హానికరమో గ్రహించలేకపోతున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ సంచుల వినియోగంపై చర్యలే తీసుకోని అధికారులు ప్రమాద తీవ్రతపై అవగాహన ఎలా కల్పిస్తారంటూ విమర్శలు వస్తున్నాయి.

వ్యర్థాలకు నిప్పు.. పొగతో ముప్పు..
ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ ప్రక్రియ మొదలెట్టినా.. మరోవైపు వాటికి రోడ్ల పక్కన నిప్పు పెట్టడం కొనసాగుతోంది. దీనిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా కాలుతున్నాయి. మంటల్లో ప్లాస్టిక్‌ గంటలకొద్దీ తగలబడటం తద్వారా దట్టమైన పొగ వ్యాపిస్తోంది. అటుగా వెళ్లే వాహనదారులో, చుట్టుపక్కల వారో దానిని పీల్చక తప్పని పరిస్థితి ఉంటోంది. అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ప్లాస్టిక్‌ మంటల్లో కరిగితే డయాక్సిన్‌ అనే ప్రమాదకరమైన వాయువు వెలువడుతుంది. దీనికి క్యాన్సర్‌ను ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. చిన్న ప్లాస్టిక్‌ ముక్కే కదా ఏమవుతుందిలే అనుకుంటే పొరపడినట్లే. అందరూ ఇదే పనిగా ఉంటే..  క్లోరోఫ్లోరో కార్బన్‌ అనే అతి ప్రమాదకరమైన వాయవు విడుదలవుతుంది. ఇది గాలిలో కలిసి ఓజోన్‌ పొరను దెబ్బ తీస్తుంది. ఫలితంగా అతి నీలలోహిత కిరణాలు శరీరంలోకి చేరి క్యాన్సర్‌కి దారితీస్తుంది.

తక్కువ రకం ప్లాస్టిక్‌ సంచులపై ప్రజల్లో చైతన్యం పెరగాలి
- జి.సూర్యనారాయణరాజు, సర్జికల్‌ అంకాలజీ విభాగాధిపతి, నిమ్స్‌
సులువుగా పని అయిపోతుందని తక్కువ రకం ప్లాస్టిక్‌ సంచుల్లో తీసుకొచ్చిన టీ తాగడం.. వాటిల్లో వేడి ఆహార పదార్థాలు పార్సిల్‌ చేయడం.. ప్లాస్టిక్‌ను కాల్చితే వచ్చే పొగను పీల్చడం..వంటివి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయి. ప్లాస్టిక్‌ కాలే క్రమంలో గాలిలోకి కలిసే క్లోరోఫ్లోరో కార్బన్స్‌ క్యాన్సర్‌కి కారణమవుతాయి. ఈ ప్రక్రియల ద్వారా ఆయా ప్రమాదకర రసాయనాలు మనిషి శరీరంలోకి చేరడంతో అప్పటి వరకు బలంగా ఉన్న మంచి కణాలు క్యాన్సర్‌ కణాలుగా మారుతాయి. క్రమేణా అవి శరీరమంతా వ్యాపిస్తాయి. ప్లాస్టిక్‌ వాడితే కలిగే దుష్ప్రయోజనాలపై ప్రజల్లో చైతన్యం పెరగాలి. తక్కువ ధరతో పాటు పనులు తేలిగ్గా అయిపోవాలని ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు తప్ప ఇది ఆరోగ్యానికి ఎంత ముప్పు కలిగిస్తుందో ఎవరూ గ్రహించకపోవడం ఆందోళన కలిగించే విషయం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.