close

సోమవారం, ఆగస్టు 19, 2019

ప్రధానాంశాలు

నామరూపాల్లేకుండా చేస్తారు

ద్విచక్ర వాహనాల చోరీ కేసులు అధికం
వాహనం దొరకదు.. కేసు ముందుకు సాగదు
వాహనదారుల అప్రమత్తతే కీలకం
న్యూస్‌టుడే - నిజామాబాద్‌ నేరవార్తలు

‘ఇటీవల హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో బస్సు అపహరణకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా సమీపానికి తీసుకెళ్లి అక్కడ విడిభాగాలన్ని తొలగించి బస్సు రూపాన్నే మార్చేశారు. ఇదంతా కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇలాంటి ముఠాలే ద్విచక్ర వాహనాలను సైతం ఎత్తుకెళ్లి ఇదే రీతిన చేస్తున్నట్లు సమాచారం.’

రాష్ట్రం మొత్తంలో పరిశీలిస్తే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులు అధికం. ఇలాంటివి వారంలో 5-6 జరుగుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. రెండు జిల్లాలకు కూడా మహారాష్ట్ర, కర్ణాటక అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. అక్కడి ముఠాలు రాత్రిళ్లు జిల్లాల్లోకి ప్రవేశించి తిరిగి తెల్లవారే సరికి చోరీలు చేసి వెళ్తుంటాయి. వీటిని ఛేదించిన సందర్భాలు కూడా తక్కువే.

చోరీల తీరు ఇలా..
నిజామాబాద్‌ కమిషనరేట్‌లో నగరంలోనే ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ప్రధానంగా బస్టాండు, రైల్వేస్టేషను, ఖలీల్‌వాడి ప్రాంతాలతో పాటు శివారు కాలనీల్లో వరుస దొంగతనం కేసులు నమోదవుతున్నాయి. ఆర్మూర్‌, బోధన్‌, కామారెడ్డిలోను ఘటనలు ఉన్నాయి. వాహనాన్ని నిలిపి ఉంచిన.. కొద్దిక్షణాల్లోనే మాయమవుతుండటంతో పక్కా ఫ్రొఫెషనల్‌ ముఠాల పనే అయి ఉంటుందని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముఠాలే అని అర్థమవుతోంది.
* నిజామాబాద్‌ నగరంలో ఓ వాహనం చోరీకి గురైన ఘటన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాళం వేసి ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని క్షణాల్లోనే ఓ దొంగ అపహరించుకెళ్లాడు. ఈ వీడియోను చూసిన అనంతరం పోలీసులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
* వాహనాలు ఎత్తుకెళ్లాక నంబరు ప్లేట్లను ఊడదీస్తున్నారు. అనంతరం వాటిని ఇతర వాహనాల్లో ఎక్కించి సరిహద్దులు దాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వాటి భాగాలన్ని వేరు చేసి మార్కెట్లోకి తరలించి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక ముఠాలు సైతం..
స్థానికంగా పలు ముఠాల సభ్యులు సైతం ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారు. అయితే వీరు దొంగిలించిన వాహనాల్లో పలు భాగాలను మార్చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కొందరు విజయవాడలోని ఆటోనగర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముప్కాల్‌ ఠాణా పరిధిలో సుమారు 28 ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా కేవలం బజాజ్‌ కంపెనీకి చెందిన పల్సర్‌ వాహనాలను మాత్రమే చోరీ చేస్తున్నట్లు విచారణలో తేలింది.

నేరాల కోసం అపహరణ
మరికొన్ని ముఠాలు దొంగతనాలు, ఇతర నేరాల్లో వినియోగించుకొనేందుకే ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నాయి. అయితే ఈ కేసుల సంఖ్య చాలా తక్కువ. ఉభయ జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు ఇలా ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేసి వెళ్తున్న ఘటనలు ఉంటున్నాయి.

రికవరీ అంతంతే..
ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో కేవలం 20-30 శాతం మాత్రమే రికవరీ అవుతున్నాయి. మరికొన్నింటిలో ఇతర రాష్ట్రాల ముఠాలకు సంబంధించి ఆధారాలు దొరికినా పక్కా సమాచారం ఏమీ ఉండట్లేదు. దీంతో చాలా కేసుల్లో బాధితులకు న్యాయం జరగని పరిస్థితి.

సులువుగా తీసుకుంటున్నారు
ద్విచక్ర వాహనాల చోరీ కేసులను పోలీసులు చాలా సులువుగా తీసుకుంటున్నారు. వాహనం ఎత్తుకెళ్లారని ఠాణాకు వెళ్తే తక్షణమే విచారణ చేపట్టకుండా.. రెండ్రోజులు వెతికి రండి ఆ తర్వాత కేసు నమోదు చేస్తామని సలహా ఇస్తున్నారు. ఈలోపు చోరీకి గురైన వాహనాలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతున్నాయి. ఈ విషయంలో పోలీసుల ధోరణి మారాల్సి ఉంది. సత్వరమే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడితే నిందితులను పట్టుకొనే అవకాశాలు ఎక్కువ.

నిర్లక్ష్యం వీడాల్సిందే
ద్విచక్ర వాహనాల విషయంలో వాహనదారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటోంది. వాహనాలకు పూర్తిస్థాయిలో తాళాలు వేయకపోవటం, తాళం చెవిని వాటికే ఉంచటం, పూర్తిగా పాడైనా వాటినే కొనసాగించటం ఎక్కువగా జరుగుతుంటున్నాయి. దీంతో చోరులు సైతం సులువుగా వాటిని అపహరించుకెళ్తున్నారు. ఈ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలుపకూడదని పోలీసులు పదేపదే సూచిస్తున్నా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావట్లేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.