close

మంగళవారం, జూన్ 18, 2019

ప్రధానాంశాలు

8 నెలల కోడ్‌...10 రోజుల్లో తొలగు 

త్వరలో సాధారణ పాలన 
ప్రగతి పనులు ఇక వేగిరం

ఎన్నికలు.. ఎన్నికలు... ఎన్నికలు.. ఇలా గత సంవత్సరం అక్టోబరు నుంచి దాదాపు 240 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. శాసనసభ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, పరిషత్తు ముగియగా... శాసనమండలి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలా ఒకదాని వెనుక మరొకటి పోటీ పడి ఎన్నికల ప్రకటనలు వచ్చాయి. దీంతో సుమారు ఎనిమిది నెలలుగా కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు అంతా క్షణం తీరిక లేకుండా గడిపారు. మరోవైపు పర్యవేక్షణ కాస్త తగ్గడంతో సాధారణ పాలన కొంత గాడితప్పింది. కోడ్‌ కారణంగా అభివృద్ధి పనులు సైతం జరగలేదు. ఎట్టకేలకు ఊపిరి పీల్చుకునే రోజులు రానున్నాయి. ఈ తీరుపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం...

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

వరుస ఎన్నికల పనులు అధికార యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారాయి. ఫలితంగా పరిపాలనా వ్యవహారాలు మరుగున పడ్డాయి. కొత్త పనులు అటుంచి.... పాత పనులు నడిపించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు సిబ్బందికి సమయం దొరకడం లేదు. ఎన్నికల విధుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారులు దెబ్బతిని ఉన్నారు. దీంతో జిల్లా ప్రభుత్వ అధికారులు అత్యంత జాగ్రత్తగా పనులు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదటి విడత ముగిసింది. కొత్త పాసుపుస్తకాలు అందించారు. రెండో విడత (పార్ట్‌-బి) సర్వే ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తొలి విడతలో తప్పులు దొర్లిన పుస్తకాలు తీసుకున్నారు. వాటిని సరిచేసి ఇవ్వడానికి సైతం సమయం దొరకడం లేదు. వ్యవసాయ శాఖకు ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తోంది. ఈ సమయంలో జిల్లాలో రైతులు, సాగు భూములు, పంటల వివరాలు సేకరించే సర్వే నడుస్తోంది. మే 15 నాటికే ఆ సర్వే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల విధులు, అధికారుల పర్యవేక్షణ లేక నేటికీ కొనసాగుతోంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతుబంధు పంపిణీకి సమయం ఆసన్నమవుతోంది. ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్‌ కాంపొనెంట్‌ గ్రాంటుతో ఏటా గ్రామ పంచాయతీల్లో చేపట్టే అంతర్గత సిమెంటు రహదారులు ఈ ఏడాది కనుమరుగయ్యాయి. ఒక్క ప్రతిపాదన చేయడానికి వీలు లేకుండా పంచాయతీ   ఎన్నికల కోడ్‌ అడ్డు పడింది. దీంతో కోట్లాది రూపాయల నిధులు ఇతర పనులకు వేరే పనులకు ఉపయోగించారు. నీటిపారుదల శాఖకు ఏడాది పొడవునా ఒక ఎత్తు అయితే ఒక్క వేసవి కాలం మరో ఎత్తు. అటువంటి సమయంలో ఎలాంటి కొత్త పనులకు అవకాశం లేకుండా పోయింది. ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితం అవుతున్నాయి. పంచాయతీరాజ్‌, రహదారులు, భవనాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు సైతం కుంటుపడ్డాయి. పాత పనులు తప్ప కొత్త పనులకు అవకాశం లేకపోయింది. పంచాయతీలకు సర్పంచులు ఎన్నికై నెలలు గడుస్తున్నా వారికి ఎలాంటి అధికారాలు అందలేదు. చెక్‌ పవర్‌ ఇస్తే గ్రామంలో చిన్నచిన్న పనులు చేపట్టుకుంటామని వారు వేడుకుంటున్నారు. మరో పది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగుస్తాయి. అనంతరం ఎన్నికల కోడ్‌ ముగియనుంది. అప్పటి నుంచి సాధారణ పరిపాలన పట్టాలెక్కనుందని ప్రభుత్వ ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. కొత్తగా అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నా ఇక్కడి నుంచే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జులైలో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తే మరో నెలకుపైగా పనులన్నీ పెండింగ్‌లో పడతాయంటున్నారు. అయితే జూన్‌ 4వ తేదీ నుంచి జులై వరకు సుమారు నెల రోజులపాటు ఉద్యోగులకు సమయం లభిస్తుందని, ఈ సమయంలో కొంత వరకు ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.