ఇంకొక్క రోజు - Kamareddy - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ఇంకొక్క రోజు

23న లోక్‌సభ ఓట్ల లెక్కింపు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మధ్యాహ్నం 3 గంటలకు వెలువడనున్న ఫలితం
 మార్చి 18న.. ఎన్నికల ప్రకటనతో ప్రారంభం
 23.. రోజులు హోరాహోరీ ప్రచారం
 ఏప్రిల్‌ 11న.. నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు
 65.. రోజులు అంచనాలతో క్షణక్షణం
 24.. గంటల తరువాత తేలనున్న ఫలితం
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఇలా హోరాహోరీగా సాగిన జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితం ఇంకొక్క రోజులో తెలిసిపోనుంది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈవీఎంలలో దాగున్న ప్రజాతీర్పు తేలనుంది. జిల్లా నాయకులు ఉత్కంఠతతో ‘ఇంకా తెలవారదేమీ.. ఈ ఫలితం తెలిసిపోదేమీ’ అని పాడుకుంటున్నారు.

మొదటి రెండు రౌండ్లకు 30 నిమిషాలు
* మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌లను, తర్వాత సర్వీస్‌ ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపును ఉదయం 8.30 గంటలకు ప్రారంభిస్తారు.
* మొదటి రెండు రౌండ్ల ఫలితాలను వెల్లడించేందుకు సుమారుగా 30 నిమిషాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
* మూడో రౌండ్‌ నుంచి ప్రక్రియ వేగవంతం అయి ప్రతి రౌండ్‌కు సుమారు 25 నిమిషాల సమయం పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఒక్కో అసెంబ్లీకి 14 టేబుళ్లు
* ఓట్లను లెక్కించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌పై ఒక ఈవీఎం ఉంచుతారు. ఇలా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 98 టేబుళ్లపై 98 ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్‌గా భావిస్తారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. సంగారెడ్డి జిల్లా రుద్రూర్‌లోని గీతం విశ్వవిద్యాలయం స్ట్రాంగ్‌రూముల్లో భద్రంగా ఉన్న ఈవీఎంలను గురువారం తెరవనున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగేందుకు ఇప్పటికే అధికారులకు శిక్షణ ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు నమూనా లెక్కింపు(మాక్‌ కౌంటింగ్‌) చేపట్టనున్నారు.

ప్రక్రియ ఇలా
* ఉదయం 5 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులను స్ట్రాంగ్‌ రూం వద్ద సమావేశపరచి, వారికి లెక్కింపు ఏ విధంగా చేపడతారో వివరిస్తారు. అనంతరం ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూం తాళాలు తీస్తారు.
* ఉదయం 8 గంటలకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞను సిబ్బందిచే చేయించి లెక్కింపు మొదలెడతారు.

ప్రతి టేబుల్‌కు పర్యవేక్షకులు
* ప్రతి టేబుల్‌కు ఒక గెజిటెడ్‌ అధికారిని సూపర్‌వైజర్‌గా, గణితం బోధించే ఉపాధ్యాయుడిని అసిస్టెంట్‌గా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని సూక్ష్మపరిశీలకునిగా నియమించారు. ఇలా ఒక్కో టేబుల్‌కు ముగ్గురు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గానికి 42 మంది, మొత్తం లోక్‌సభ సెగ్మెంట్‌కు 294 మందిని నియమించారు. అదనంగా మరికొందరిని రిజర్వులో ఉంచారు.
* అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక రౌండ్‌ లెక్కింపు పూర్తికాగానే ఆయా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి 14 ఈవీఎంలలో ర్యాండమ్‌గా ఏవేని రెండింటి ఫలితాలను మరోమారు సరిచూస్తారు. ఎలాంటి తేడా లేకుంటే ఫలితాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తారు. ఇలా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలను క్రోడీకరించి రౌండ్ల వారీగా ఫలితాలు విడుదల చేస్తారు.

పకడ్బందీగా ఏర్పాట్లు
* కేంద్రంలో అధికారులు, కౌంటింగ్‌ ఏజెంట్లకు మధ్య ఇనుప మెష్‌ అడ్డుగా ఉంటుంది. ఏజెంట్లు ఈవీఎంలను తాకకుండా ఈ ఏర్పాట్లు చేశారు.
* అభ్యర్థులు, వారి ఏజెంట్లు చరవాణులతోపాటు నీళ్ల బాటిళ్లను కూడా లోనికి తీసుకెళ్లొద్దు.

నియోజకవర్గానికి పరిశీలకులు..
జహీరాబాద్‌ స్థానానికి నియమించిన సాధారణ పరిశీలకుడితో పాటు లెక్కింపు ప్రక్రియ పరిశీలనకు జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాలకు మహేంద్రపాల్‌ అరోరా, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఇంద్రజిత్‌ను పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. వీరు లెక్కింపు పూర్తయ్యేంత వరకు కేంద్రంలోనే ఉంటారు.

మూడంచెల భదత్రా వ్యవస్థ
కేంద్రం వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అనుమతి తీసుకున్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. అధికారులు, సిబ్బందికి, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు.

వీవీప్యాట్లకు ప్రత్యేక కేంద్రాలు
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఐదు వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించేందుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో ఏజెంట్ల సమక్షంలో లాటరీ పద్ధతిన ఏవేని ఐదు వీవీప్యాట్లను ఎంపిక చేసి, వాటిల్లోని స్లిప్పులను లెక్కిస్తారు. పార్టీల వారీగా వేరు చేసి 25 చిట్టీలను ఒక కట్టగా కడతారు. స్లిప్పులు, ఈవీఎంల ఓట్లతో సరిపోలితేనే ఫలితాలు వెల్లడిస్తారు. ఇలా మొత్తం 35 వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతే ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు.

పూర్తిగా వీడియో చిత్రీకరణ
లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు స్ట్రాంగ్‌రూం తాళాలు తీసినప్పటి నుంచి వీడియో చిత్రీకరణ చేపట్టనున్నారు. ప్రతి రౌండ్‌ ఫలితాలను న్యూసువిధా యాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.