close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

వికారాబాద్‌..ఓటర్లు ఏం చేశారో! 

గెలుపుపై ఎవరి ధీమా వారిదే 
న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌తో చేవెళ్ల స్థానం పరిధిలో ఉత్కంఠ పెరిగింది. తెలంగాణలో అత్యధిక స్థానాలు తెరాసకు గెలిచే అవకాశం ఉందని పలు సంస్థలు చెబుతుండటంతో చర్చ మరింత జోరందకుంది. ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో నలుగురు కలిసిన ప్రాంతంలో దీనిపై మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలోనే ప్రజలు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం ఒకటి. తొలుత తెరాస నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. అదేపార్టీ నుంచి అభ్యర్థిగా నిలిచారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో ఆయనకున్న పరిచయాలతో విస్తృంగానే పర్యటించారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం... 
చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలిచారు. అయిదేళ్ల కాలంలో వికారాబాద్‌ నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో సమీకరణాలు మారాయి. మరోవైపు తెరాస తమ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డిని బరిలో నిలిపింది. రంజింత్‌రెడ్డి ఈ ప్రాంతానికి కొత్త వ్యక్తని, ఆయన్ని ఓటర్లు ఆదరించబోరంటూ కాంగ్రెస్‌ నాయకులు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం తమ గెలుపులో వెన్నుదన్నుగా ఉంటుందని ఆశలు పెట్టుకున్న స్థానాల్లో వికారాబాద్‌ కూడా ఒకటి. అయితే... చేవెళ్లకు చెందిన సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరడం వారికి కొంత మింగుడు పడని అంశంగా మారింది.

అనూహ్య విజయంతో ఉత్సాహం 
శాసనసభ ఎన్నికల సమయంలో వికారాబాద్‌ స్థానానికి ఇద్దరు మాజీ మంత్రులు చంద్రశేఖర్‌, గడ్డ ప్రసాద్‌లు పోటీ పడటం, వారిని ఢీకొట్టడానికి వైద్యుడు మెతుకు ఆనంద్‌ను తెరాస ఎంచుకోవడం చర్చనీయాంశమైంది. మాజీ మంత్రులిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా ప్రారంభం నుంచే తమదైన శైలిలో ప్రచారం చేశారు. తెరాస అభ్యర్థి సైతం ఊరూరూ తిరిగి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలను చుట్టివచ్చారు. పోలింగ్‌ నాడు మాజీ మంత్రుల మధ్య ఓట్లు చీలిపోవడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగత చరిష్మా తోడవడంతో తెరాస విజయం సాధించింది. అదే ఊపులో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస మద్దతుదారులు అత్యధిక సర్పంచి స్థానాలను గెలుచుకున్నారు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ దాదాపు శాసనసభ ఎన్నికలను తలపించేలా ప్రచారం చేయించారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా చూస్తే వికారాబాద్‌ నియోజకవర్గంలోనే అత్యధికంగా 61.03 శాతం ఓటింగ్‌ నమోదు కావడం గమనార్హం. ఈ పోలింగ్‌ సరళి తమకే అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్‌, కాదు మాకేనంటూ తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ఓట్లను గణనీయంగా పొందామంటూ భాజపా అభ్యర్థి జనార్దన్‌రెడ్డి సైతం చెబుతున్నారు. ఓటర్లు ఎవరిని ఆదరించారో చూడాలి మరి.

వికారాబాద్‌ నియోజకవర్గం ఓట్ల వివరాలు 
* మొత్తం ఓటర్లు: 2,19,709 
* ఓటేసి వారు: 1,40,918 
* వారిలో పురుషులు: 71,893 
* స్త్రీలు: 68,025

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.