close

మంగళవారం, జూన్ 25, 2019

ప్రధానాంశాలు

‘స్వచ్ఛ’ గడువు... జూన్‌ 2

స్వచ్ఛ జిల్లా కల సాకారం... బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు(ఓడీఎఫ్‌)గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2వ తేదీ నాటికి విధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మండలాల వారీగా సమావేశాలు సైతం ఏర్పాటు చేసి, అర్హులకు వివరించారు. ఆశ కార్యకర్తలు మొదలు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై సమయంలోగా లక్ష్యాన్ని పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారిణి ఆదేశించారు. ఈ నేపథ్యంలో గౌరవ గృహాల పురోగతిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం....

న్యూస్టుడే, నవాబ్‌పేట

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ పేరిట ప్రతి ఇంటికీ శౌచాలయం ఉండాలనే లక్ష్యం విధించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి అన్ని గ్రామాలు స్వచ్ఛత సాధించాలనే లక్ష్యం నిర్దేశించి నెరవేర్చాలని ఆదేశించింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు అందజేస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు దగ్గర పడుతుండడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసే బాధ్యతను సర్పంచులు, గ్రామస్థాయి అధికారులకు అప్పగించారు. వీరితో పాటు సంబంధిత శాఖ అధికారులు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్నాళ్లు కార్యదర్శులు లేక పర్యవేక్షణ కరవై గ్రామ పాలన గాడితప్పింది. ప్రస్తుతం జిల్లాలో ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి చొప్పున కొత్త వారు కొలువు దీరడం, కొత్త సర్పంచులు ఎన్నిక కావడంతో కలిసొచ్చింది. ఉన్నతాధికారులు సైతం తరచూ సమీక్షలు చేస్తూ సలహాలు, సూచనలు ఇస్తూ, వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఆశ కార్యకర్తలు మొదలుకొని పంచాయతీ కార్యదర్శి వరకు నిత్యం గ్రామాల్లో పర్యటించి మరుగుదొడ్లు లేని కుటుంబాల వద్దకు చేరుకొని వారికి అవగాహన కల్పిస్తూ పనులు ప్రారంభిస్తున్నారు.

అవగాహన లేక ఆలస్యం 
కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్‌ పేరిట మూడేళ్లుగా మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అంతకు మునుపు ఉపాధిహామీ పథకంలోనూ ఈ పనులు చేపట్టారు. జూన్‌ 2వ తేదీ నాటికి గడువు విధించి పూర్తిచేయాలని నిర్ణయించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. లక్ష్యం చేరేందుకు సమయం తక్కువ ఉండటంతో ఇప్పటికే ప్రారంభించిన వాటితోపాటు అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తిచేయాలని అధికారులు పల్లె ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే... ప్రజల్లో అవగాహన కొరవడడం, నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వంటి కారణాలతో కొత్త వాటిని చేపట్టేందుకు అర్హులు ముందుకు రావడంలేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో నిర్మాణం పెరగడంలేదని అధికారులే పేర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయి. వ్యక్తిగతంగా నిర్మాణాలు చేపట్టడం కష్టంగా మారుతోందనే ఉద్దేశంతో అధికారులు గ్రామాల్లో ఆసక్తి ఉన్న గుత్తేదారులో వీటిని నిర్మింపజేస్తున్నారు. దీంతో పలు గ్రామాల్లో వేగం పుంజుకుంది.

కార్యచరణ ఇలా... 
ఒక గ్రామంలో మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించారు. వాటిని గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు కలిసి తలా కొన్నింటి బాధ్యతలను పంచుకున్నారు. తమకు కేటాయించిన ఇళ్ల వద్దకు చేరుకొని మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అందుతున్న రూ.12 వేల సాయాన్ని, మరుగుదొడ్డి లేకపోవడంతో కలిగే నష్టాలు, సోకే వ్యాధులు, వాటికి అయ్యే ఖర్చు, ఆడపిల్లలకు కలిగే ఇబ్బందులు ఇతరాలను వివరిస్తూ వారికి ప్రేరణ కలిగించి పనులు ప్రారంబÅమయ్యేలా చూస్తున్నారు.

పనులు చురుకుగా సాగుతున్నాయి 
-జాన్సన్‌, డీఆర్‌డీఏ వికారాబాద్‌ జిల్లా 
జిల్లాలోని ఆయా గ్రామాల్లో శౌచాలయాల నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి జిల్లానూ ఓడీఏఫ్‌గా ప్రకటించాలని పాలనాధికారిణి నిర్దేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల అధికారులు, గ్రామస్థాయిలో పనిచేసే వారితో మండలాల వారీగా కార్యచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. పనులు ప్రారంభించి కొనసాగిస్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపూ పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

పురోగతి వివరాలు 
మరుగుదొడ్ల నిర్మాణంలో వికారాబాద్‌, పూడూరు, ధారూర్‌ మండలాలు జిల్లాలో ముందు వరుసలో ఉండగా బషీరాబాద్‌, కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాలు చివరి వరుసలో ఉన్నాయి.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.