close

ఆదివారం, జూన్ 16, 2019

ప్రధానాంశాలు

ఎందుకిలా జరిగింది?
కంచుకోటలు సైతం ఇలానా!
పట్టణాలు, గ్రామాలు ఏకపక్షంగా ఫ్యాన్‌ వైపే

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ అంటేనే భూమా గడ్డగా పేరు, రాష్ట్ర మంత్రిగా భూమా అఖిలప్రియ వేల కోట్లతో అభివృద్ధి చేశామన్న ప్రచారం, అధికార పక్షంగా ఉండడం, అంగబలం, అర్థబలం ఇలా అన్నీ అనుకూలించినా ఆళ్లగడ్డలో తెదేపాకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. ఎప్పటికైనా సాధారణ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో పోరు హోరాహోరీగానే సాగుతుంది. అలాంటిది ఎన్నడూలేని రీతిలో గెలుపు గంగుల కుటుంబం వైపు ఏకపక్షంగా రావడం విశేషం. ఎవరూ ఊహించని రీతిలో భారీ ఆధిక్యతతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గంగుల బ్రిజేంద్రరెడ్డి విజయం సాధించారు.

విజయాన్నందించే ఊర్లే ఇలాగైతే ఎలా?

ఆళ్లగడ్డలో ఎన్నికల చరిత్ర మొదలైప్పటి నుంచి భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ పట్టణం, చాగలమర్రి, నియోజకవర్గాల పునర్విభజన జరిగాక దొర్నిపాడు పూర్తిగా అండగా ఉండేవి. మరోవైపు గంగుల కుటుంబానికి గోస్పాడు, రుద్రవరం, శిరువెళ్ల, ఆళ్లగడ్డ మండలాల్లో గ్రామాలు అండగా ఉండేవి. ఆ ప్రాంతాల్లో వచ్చే ఆధిక్యతతోనే ఆయా కుటుంబాలు నెగ్గేవి. నియోజకవర్గ పునర్విభజన తర్వాత దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలో కలవడం, గంగులకు బలమైన గోస్పాడు నంద్యాల కలవడంతో భూమా వారి విజయం సులభమైంది. మరీ ముఖ్యంగా ఆళ్లగడ్డ పట్టణం, దొర్నిపాడు మండలాలు ఏకపక్షంగా భూమా కుటుంబానికి అండగా ఉండేది. మొదటి సారిగా ఈ ఎన్నికల్లో ఈ రెండు మండలాలు గంగుల కుటుంబం వైపునకు మొగ్గాయి.

అతి విశ్వాసం.. నాయకుల అవినీతే కొంప ముంచాయా?

అధికారంలో ఉన్నాం, మంత్రి హోదాలో అభివృద్ధి నినాదం, ఎక్కడా అడ్డులేదు, భారీ ఆధిక్యతతోనే విజయం సాధిస్తామన్న ధీమానే తెదేపా ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి భూమా అఖిలప్రియ కూడా తాను ఎదురుచూస్తున్నది గెలుపు కోసం కాదని.. భారీ ఆధిక్యతపైనే తన చూపని సభలో చెప్పేవారు. కార్యకర్తల్లో సైతం కొంత నిర్లిప్తత కన్పించింది. ఇక మండల, గ్రామ స్థాయి నాయకుల అవినీతి భాగోతం భూమా అఖిల విజయాన్ని అడ్డుకుందని చెప్పవచ్ఛు ముఖ్యంగా హౌసింగులో ప్రతి ఇంటికి రూ.10 వేల నుంచి 15వేల నాయకులు వసూలు చేసేవారు. బిల్లు చేసేందుకు అధికారులు సైతం మామూళ్లు డిమాండు చేసేవారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఆ విషయం మంత్రి వరకు వెళ్లేది కాదు. ఇలా ప్రభుత్వం ఇస్తున్న లక్షల రూపాయల కన్నా ఇందుకోసం తాము ఇవ్వాల్సి వస్తున్న మామూళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ అవినీతిలో కింది నుంచి పైస్థాయి వరకు అనుచరులకు వాటా ఉందని గుసగుసలు విన్పించాయి. నాయకుల అవినీతి కారణంగానే శిరువెళ్ల మండల కేంద్రంలో వైకాపాకు ఓట్లు తెచ్చాయి.

ఎస్వీ జగన్‌ వైకాపాకు బలం

మంత్రి బంధువు ఎస్వీ జగన్‌ ఎన్నికలకు ముందు వైపాకాలో చేరారు. పట్టణంలో గట్టి పట్టున్న ఈయన వైకాపాలో చేరడంతో గంగుల బలం అమాంతం పెరిగింది. ప్రతి వార్డులోనూ అనుచరగణం పెంచుకున్నారు. గతంలో ఎన్నడూరాని రీతిలో ఆళ్లగడ్డలో గంగుల కుటుంబానికి ఆధిక్యత లభించింది. సాధారణంగా పట్టణంలో భూమా కుటుంబానికి కనీసం 5 నుంచి 6 వేల వరకు ఆధిక్యత వస్తుంటుంది. ఎస్వీ జగన్‌ చేరిక ప్రభావం ఒక పట్టణంపైనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పడింది. ఎస్వీ బంధువర్గం కూడా వైకాపాకు మద్దతుగా నిలిచారు. ఆళ్లగడ్డ, శిరువెళ్ల, చాగలమర్రి పట్టణాల్లో మైనార్టీలే ఎక్కువ. ఈ మూడు చోట్ల వైకాపాకు భారీ ఆధిక్యత లభించింది. వైకాపాకు ఓటేస్లే భాజపాకు ఓటేసినట్లేనన్న తెదేపా ప్రచారం తోసిరాజని మైనార్టీలు వైకాపాకు ఓటేశారు. ఈ మూడు చోట్ల వైకాపా 7,767 ఓట్ల ఆధిక్యం లభించింది. వీరితో పాటు ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో ఆర్యవైశ్యులు కూడా వైకాపానే ఆదరించినట్లు తెలుస్తోంది.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.