close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

ఎ.పి. ఎక్స్‌ప్రెస్‌ రద్దు

 ప్రయాణికులకు తప్పని పాట్లు

 
ఎ.పి ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి క్షణంలో రద్దు కావడంతో

అధికారుల్ని నిలదీస్తున్న ప్రయాణికులు 

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే : విశాఖ నుంచి న్యూదిల్లీ వెళ్లాల్సిన ఎ.పి. ఎ.సి. ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి నిమిషంలో రద్దు చేయడంతో విశాఖ రైల్వేస్టేషన్‌లో పలువురు ప్రయాణికులు శుక్రవారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్లాట్‌ఫాంపై రైలు కోసం ఎదురుచూస్తున్న వారికి ఎ.పి. ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు ప్రకటన వినిపించడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ స్టేషన్‌ మాస్టర్‌ వద్దకు పరుగులు తీశారు. రెండు జనరేటర్‌ పవర్‌ కార్‌ బోగీలు విఫలమవడంతో ఎ.సి. సరఫరా నిలిచిపోతున్నట్లు అధికారులు ప్రయాణికులకు వివరించారు. కొందరు తమ ప్రయాణాల్ని విరమించుకోగా.. మరికొందరు ప్రత్యామ్నాయమార్గాలు చూసుకున్నారు. కౌంటర్‌ టిక్కెట్లు ఉన్న వారికి టిక్కెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేశారు. చివరి క్షణంలో రద్దు చేస్తే ఎలా అంటూ కొందరు అధికారులను నిలదీశారు. సాంకేతిక సమస్య వల్ల తప్పలేదని అధికారులు బదులిచ్చారు. డి.ఆర్‌.ఎం. చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ రైలు రద్దుపై ఆరాతీశారు. ఇకపై ఇటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నట్లు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


వారం రోజుల సమయం ఇవ్వండి

 ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ సమస్యలే లేకుండా చేస్తాం

 ఇప్పటికే పరిష్కార చర్యలు మొదలుపెట్టాం

 తీవ్ర ఉష్ణోగ్రతలు, పవర్‌కార్ల వల్లే ఇబ్బందులు

 జులై 1 నుంచి రైలు ప్రయాణం.. 2 రాత్రులు 1 పగలు

 కోచ్‌ల మార్పిడికీ ప్రతిపాదనలు పంపించాం

 ‘ఈనాడు’ వరస కథనాలపై స్పందించిన డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ

 ‘ఈనాడు-ఈటీవీ’తో ముఖాముఖి

గతేడాది ఇదే రైలులో విద్యుదాఘాతానికి 3 బోగీలు కాలిపోయాయి. ఇందులో ఉన్న ఏసీ యూనిట్లలో చాలా లోపాలున్నాయి. వీటికి తోడు ఇంకా ఏమేం ఉన్నాయో ఇప్పటికీ అధికారులు తెలుసుకోలేకపోతున్నారు.

డీఆర్‌ఎం: గత కొన్నిరోజులుగా నిపుణులు, అధికారులు ఇదే పనిలో ఉన్నారు. మేం కొన్ని లోపాల్ని గమనించాం. వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాం.

- విశాఖ నుంచి దిల్లీకి వెళ్లే మార్గంలో 48 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రతీ 15, 20 నిమిషాలకోసారి డోర్లు తీయడం వల్ల లోపలున్న ఆటోమేటిక్‌ టెంపరేచర్‌ వ్యవస్థ బయట ఉన్న వేడిని, లోపలున్న చల్లదనాన్ని సమతుల్యం చేయలేక పాడైపోతోంది. ఒక్కసారిగా వేడి లోపలికి రావడమూ ఈ సమస్యలకు ఒక కారణం.

- పవర్‌కార్లలో సమస్యలొస్తున్నాయి. శుక్రవారం ఏకంగా రెండు పవర్‌కార్లు ఫెయిలయ్యాయి. అందుకే రైలును రద్దు చేశాం. ఇప్పుడున్న 4 రేక్‌ల్లోనూ ఈ సమస్యలపై ఆరా తీస్తున్నాం.

- ఎలుకల వల్ల కొంత నష్టం వాటిల్లుతోంది. బయో టాయ్‌లెట్లూ ఇబ్బందికరంగా ఉన్నాయి.

- ఇలా అన్ని సమస్యలూ మా దృష్టికి వచ్చాయి. వాటిమీద పరిశీలనలు చేస్తున్నాం.

ఆ రైలులో రెండేళ్లుగా సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా అధికారులు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఏసీల్లో లోపాల్ని అధిగమించలేకపోయారు.

డీఆర్‌ఎం: గతంలో ఎలా ఉందో తెలీదు. ఇప్పుడు ఏపీ ఏసీ రైలులో తలెత్తుతున్న సమస్యలపై చాలా లోతుగా పరిశీలన చేస్తున్నాం. ఒక్కవారం రోజుల్లో ఈ రైలు ఎలాంటి సమస్యల్లేకుండా నడుస్తుందన్న ఆశాభావం నాకుంది. ఈ వారం రోజులు ఆగి చూడండి.

రైలులో ప్రధాన సమస్యంతా ఎల్‌హెచ్‌బీ కోచుల్లోనే ఉంది. వాస్తవంగా డివిజన్‌కు రావాల్సిన కోచుల్ని భువనేశ్వర్‌కు తీసుకెళ్తున్నారు, అంతకుముందు ఉత్తరాది రైల్వే అధికారులు ఈ రైలుకు చెందిన కోచ్‌లన్నిటినీ తీసేసుకున్నారు. ఈ పాత కోచ్‌లవల్లే సమస్య వస్తోంది.

డీఆర్‌ఎం: ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల జీవితకాలం 30 ఏళ్లు ఉంటుంది. దీన్ని నిర్వహించే సత్తా రైల్వే దగ్గర ఉంది. అయినా సమస్యలొస్తున్నాయని గమనించాం. కాబట్టి.. ఏపీఏసీ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 4 రేకుల్లో కొన్నింటిని మార్పు చేయడానికి ప్రతిపాదించాం. అంటే.. ఎల్‌హెచ్‌బీ రేక్‌ స్థానంలో ఐఆర్‌ఎస్‌, సీబీసీ రేకులు వచ్చేలా చూస్తున్నాం. రేక్‌లు వేరుగా ఉన్నా.. ఎల్‌హెచ్‌బీ రేక్‌లు ఎలా కనిపిస్తాయో ఇవి కూడా అలాగే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటాయి. మాకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే.. ఎప్పుడైనా కోచ్‌ల్లో సమస్య వచ్చినప్పుడు ఐఆర్‌ఎస్‌, సీబీసీ ఏసీ కోచ్‌లు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ప్రయాణికులకు ఏ అసౌకర్యమూ కలగకుండా చూడొచ్ఛు దీనిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.

ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌.. ప్రయాణికులనే కాదు.. దేశంలోని రైల్వే అధికారులనూ భయపెట్టే బండిగా పేరుపొందింది. ప్రయాణికుల భాషలో చెప్పాలంటే.. ఏపీ ‘ఏఛీ’ ఎక్స్‌ప్రెస్‌. ఎపుడూ ఏదో ఒక సమస్య. ఇకపై ఇలాంటివేమీ లేకుండా చేస్తామని భరోసా ఇస్తున్నారు నూతన డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ. అన్ని కోచ్‌ల్లోనూ ఉన్న లోపాలను పసిగట్టామని, వారం రోజుల్లో వాటిని పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌పై ‘ఈనాడు’ ఇచ్చిన కథనాలకు స్పందించిన ఆయన శుక్రవారం ‘ఈనాడు-ఈటీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో గత రెండేళ్లుగా ఏసీలు పని చేయడం లేదంటూ నిత్యం ప్రయాణికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. ఈ వేసవిలో వీటి తీవ్రత మరింతగా పెరిగింది. విసిగెత్తిపోయిన ప్రయాణికులు కొన్నిచోట్ల సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. రైలును ఆపేసి ఆందోళన చేస్తున్నారు.

డీఆర్‌ఎం: నిర్వహణ బాధ్యతలను నార్తర్న్‌ రైల్వే నుంచి వాల్తేరు డివిజన్‌కు అప్పగించాక వచ్చిన తొలి వేసవి ఇది. ఈసారి ఇన్ని మరమ్మతులు వస్తాయని సిబ్బంది కూడా ఊహించలేదు. పైగా వారిలో ఎల్‌హెచ్‌బీ ఏసీ బోగీల్లో మరమ్మతులు చేసేంత నైపుణ్యం పూర్తిగా రాలేదు. తాజాగా లాలాగూడ, భువనేశ్వర్‌ నుంచి నిపుణుల్ని పిలిపించాం. గత రెండు మూడు రోజులుగా ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 4 రేక్‌లకు వీరు జాగ్రత్తగా మరమ్మతులు చేస్తున్నారు. ఇలా 15 రోజులపాటు ఇక్కడుంటారు. ఇక్కడి సిబ్బందికీ పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు.

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రతిపాదిత సమయాలు ఇలా ఉన్నాయి..

వెళ్లేటప్పుడు

విశాఖ - రాత్రి 10.45 గంటలు

న్యూదిల్లీ - ఉదయం 7 గంటలు

ఈ రైలు రెండు పగళ్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఎండ ప్రభావం వల్లే సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. మరి రాత్రి సమయాల్లో ప్రయాణించేలా ప్రతిపాదన చేస్తామన్నారు. ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

డీఆర్‌ఎం: ప్రతిపాదన పంపించాం. మాకున్న సమాచారం ప్రకారం జులై 1 నుంచి రైలు సమయాలు మారే అవకాశం ఉంది. ఇది ఇంకా అధికారికంగా వెలువడలేదు. 2 రాత్రులు, ఒక పగలు ప్రయాణించేలా నిర్ణయించాం. ఇంకా కొన్ని జోన్లలో క్లియరెన్స్‌ రావాల్సిఉంది. అది రాగానే అధికారిక ప్రకటన ఇస్తాం.

ఈ మధ్యే పవర్‌కార్‌లో సమస్యలొచ్చి రైలునే రద్దు చేయాల్సి వచ్చింది. ఇకముందూ ఇలాంటి సమస్యలు రావని చెప్పలేం. అదనపు జనరేటర్లు కూడా లేవు.

డీఆర్‌ఎం: ఇందులో భాగంగానే రైల్వేబోర్డుతో మాట్లాడాం. రైల్లో తలెత్తుతున్న సమస్యలపై అక్కడి ఉన్నతాధికారులు స్పందించి ఈశాన్య రైల్వే నుంచి 2 పవర్‌కార్లను అదనంగా తెప్పిస్తున్నారు. ఇకపై సమస్యలు రావనే అనుకుంటున్నాం.

ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో నిరంతరం సమస్యలు వస్తున్నప్పుడు లోపాలకు తగ్గట్లు పరిష్కారాలు కూడా చూపాలి కదా. ఎందుకు తీసుకోలేదు.

డీఆర్‌ఎం: మేం తీవ్రతను గుర్తించాం. చర్యలు మొదలుపెట్టాం. ఇక సమస్యలు పూర్తిగా ఆగిపోయేలా మా ప్రాధాన్యాలుంటాయి.

- ఏసీలు తరచూ ఆగిపోవడానికి జనరేటర్‌ విభాగంలో సిబ్బంది సరిగా లేకపోవడం ఓ ప్రధాన కారణం. ఈ పనుల బాధ్యత నుంచి డీపీఎస్‌ ఏజెన్సీని తొలగించాం. వెంటనే జనరేటర్‌ మాతృసంస్థ కుమ్మిన్స్‌కు చెందిన నిపుణులకు 2 నెలల ప్రాతిపదికన పనులు అప్పగించాం. అందులో ఏ విడిభాగం పోయినా వారి సంస్థలో తయారైనవే తెచ్చి వేసేలా ఒప్పందం చేసుకున్నాం. 2 నెలల తర్వాత టెండర్లు పిలుస్తాం.

- పవర్‌కార్ల పనితీరు కూడా సరిగా లేదని నివేదించాం. రైల్వేబోర్డు కొత్త నిబంధనల్ని విడుదల చేస్తామని చెప్పింది. అవి రాగానే దానికి తగ్గట్లు ప్రమాణాల ప్రకారం జనరేటర్ల వినియోగం ఉంటుంది.

- ఏసీ వ్యవస్థపై బయట ఉన్న వేడి ప్రభావం ఎక్కువగా పడకుండా కోచ్‌లకు పైన ఎండవేడిని తగ్గించే పెయింటింగ్‌ను వేస్తున్నాం.ఇది 5 నుంచి 6 డిగ్రీల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

- ఇకపై ప్రతీరోజూ రైలు నిర్వహణ చేస్తున్న సమయంలో పవర్‌యూనిట్లు, ఏసీ యూనిట్లు, గ్యాస్‌ఫిల్లింగ్‌, ఫిల్టర్‌లను కంప్రెషర్లను శుభ్రపరచడం చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం.

- ఇక నుంచి ఇద్దరు ఏసీ విభాగ సూపర్‌వైజర్లు రైలు వెంటే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నాం. రైలులో చల్లదనం అలాగే ఉండేలాగా కాయిల్స్‌ పర్యవేక్షణ కోసం ఐదుగురు సిబ్బందిని నియమించాం.

- రైలులో ప్రతీ కోచ్‌కు సంబంధించి నిర్వహణ జరిగిందా లేదా అని ప్రయాణికులకు తెలిసేలా ఒక చెక్‌లిస్టును పెడతాం.

తిరిగి వచ్చేటప్పుడు

న్యూదిల్లీ - రాత్రి 10.45 గంటలు

విశాఖ - ఉదయం 7గంటలు (రైలు నిర్వహణ విశాఖలో ప్రతీరోజూ ఉదయంపూటే ఉంటుంది) 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.