close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ప్రధానాంశాలు

ఆగని అక్రమాలు

ఇష్టారాజ్యంగా తవ్వకాలు

 రహదారుల పక్కనే డంపింగ్‌ 

తరచూ ప్రమాదాలు

 ప్రభుత్వ ఖజానాకు గండి

 

రోడ్డు పక్కనే వొసేిన రాళ్ల మధ్య వొెళుతున్న లారీ

బనగానపల్లి, కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: నాపరాతి గనుల తవ్వకాలు, తరలింపు ఇష్టారాజ్యంగా మారింది. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా వాటి యజమానులు అక్రమార్జనకు తెగబడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరిగే రోడ్ల పక్కనే నిబంధనలకు వ్యతిరేకంగా గనుల తవ్వకాలు చేపట్టడం, వాటి వృథా రాళ్లను రోడ్లపై వేయడం పరిపాటిగా మారింది. జిల్లాలో ప్రధానంగా బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల, గడివేముల, నందికొట్కూరు, డోన్‌ మండలాల్లో నాపరాతి గనులు, తెల్లరాయి గనులు ఉన్నాయి. ఈ మండలాల్లో గనుల యజమానులు ఏంచేసినా, తవ్వకాలు ఎలా జరిపినా, అక్రమంగా ఎంత తరలించినా పట్టించుకొనే దిక్కులేకుండా పోయింది.

లీజులు కొంత.. తొలిచేది కొండంత

జిల్లాలో సుమారు 1,250 హెక్టార్లలో నాపరాతి గనులు ఉన్నాయి. ఒక్క బనగానపల్లి నియోజకవర్గంలోనే 1050 హెక్టార్లలో ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. యజమానులు లీజులు తీసుకున్నది కొంతైతే చుట్టుపక్కల భారీ స్థాయిలో తవ్వకాలు సాగించడం పరిపాటిగా మారింది. ఒక్కో హెక్టారుకు ఏడాదికి డెడ్‌ రెంటు కింద సుమారు రూ.25 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. లీజు లేకుండా తవ్వకాలు సాగించడంతో గుంతలు ప్రమాదకరంగా మారడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అక్రమ తవ్వకాలతో ఏటా సుమారు రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

నిబంధనలకు నీళ్లు

1961 గనుల శాఖ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు, రైల్వేలు, ఇళ్లు, తదితర స్థలాల వద్ద సుమారు 45 మీటర్ల లోపలే గనుల తవ్వకాలు సాగించాల్సి ఉంది. కాలువలు, చెరువులు, ఇతర నీటి వసతి ఉన్నచోట 9 మీటర్లు వదలాల్సి ఉంది. అయితే రహదారుల వరకు తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు.

పెద్దఎత్తున పోగవుతున్న వృథా

గనుల్లో మంచి రాయిని తీశాక పనికిరాకుండా వదిలేసిన రాళ్లు నిత్యం వందల ట్రాక్టర్ల మేర పోగవుతున్నాయి. 23 మండలాల పరిధిలో రోజుకు 50 వేల చదరపు మీటర్ల తవ్వకాలు సాగిస్తుండగా అందులో 40% వరకు వృథా ఉంటున్నట్లు అంచనా. వీటిని అప్పటికే గనులు తవ్వి వదిలేసిన గుంతల్లో వేయాల్సి ఉంది. అయితే యజమానులు రహదారులపైనే వదిలేస్తున్నారు. ఇలా నిత్యం వందల ట్రాక్టర్ల రాయిని వదిలేసిపోతున్నారు. దీంతో అంతంత మాత్రంగానే ఉన్న రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది. ప్రధాన రహదారులు మొదలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులను సైతం వదలకుండా వీటితో నింపేస్తున్నారు. దీంతో ప్రజలకు, వాహనదారులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు.

వృథా రాళ్లు ఎక్కడంటే అక్కడే..

గనుల నుంచి వచ్చే వృథా రాళ్లు ప్రమాదాలకు నిలయంగా మారిపోయాయి. వృథా రాయిని నిత్యం ట్రాక్టర్లలో తెచ్చి రహదారులకు ఇరువైపులా వదిలేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందింగా మారిపోయింది. ఎదురెదురుగా వాహనాలు వస్తే కనీసం పక్కకు వెళ్లే వీలుండటం లేదు. వేగంగా వస్తే వాహనాలు ఢీకొనే పరిస్థితి. పలుకూరు, బనగానపల్లి ప్రాంతాల్లో రహదారి పక్కనే ఉన్న గుంతల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలు బోల్తాపడిన ఘటనలు ఉన్నాయి.

మోతాదుకు మించి తరలింపు

ఇదే సమయంలో అక్రమంగా వాహనాల్లో మోతాదుకి మించి తరలిస్తుండటంతో రహదారులు పనికిరాకుండాపోయాయి. ప్రధానంగా రాత్రివేళల్లో అక్రమ రవాణా సాగుతోంది. నాపరాళ్లు ట్రాక్లర్ల నిండా వేసుకున్న వెళ్తుండగా గుంతలు పడిన రహదారుల్లో జారి కింద పడుతున్నాయి. వెనుకవచ్చే వాహనాల ప్రమాదాలకు కారణమవుతోంది.

కొన్ని రహదారులను పరిశీలిస్తే..

బనగానపల్లి నుంచి తాడిపత్రికి వెళ్లే రహదారి రామాపురం నుంచి అంకిరెడ్డిపల్లె వరకు సుమారు 25 కి.మీ. రహదారికి ఇరువైపులా వృథా రాళ్లు కనబడతాయి. నిత్యం ఈ రోడ్డుపై వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అనంతపురం నుంచి అమరావతి వరకు, కాకినాడ, రాజమండ్రి బస్సులు వెళ్తుంటాయి. రాత్రివేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు పలుకూరు, రామకృష్ణాపురం, మీర్జాపురం, రామపురం, చెర్లోపల్లె, కనకాద్రిపల్లె, ఇటికాల గ్రామాలకు వెళ్లే రహదారులను వదిలే పరిస్థితి కనిపించలేదు.

అక్రమ తవ్వకాలు సరేసరి

*● బనగానపల్లి నుంచి పలుకూరు వెళ్లే మార్గంలో రహదారి పక్కన కనీసం పది మీటర్లు కూడా వదలకుండా గనుల తవ్వకాలు సాగించారు. ఇప్పటికీ తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు.

*● పలుకూరు రామకృష్ణారం వెళ్లే రహదారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ కనీసం రెండు మీటర్లు లేకుండా తవ్వకాలు సాగించి వదిలేశారు.

*● పాతపాడు నుంచి కటికవానికుంట, ఫత్తేనగర్‌ వెళ్లే రహదారిలో ఒక మీటరు స్థలం కూడా వదలకుండా తవ్వకాలు సాగించారు.

*● కొలిమిగుండ్ల మండలం బెలుం, అంకిరెడ్డి ప్రాంతాల్లో నంద్యాల, తాడిపత్రి వెళ్లే రహదారిలో ఇదే పరిస్థితి. ఇక్కడ నిత్యం వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అనంతపురం, తాడిపత్రి, బెంగుళూరు వెళ్లే ప్రధాన రహదారి అయినప్పటికీ స్థలం వదలకుండా గుంతలు తవ్వి వదిలేశారు.

ప్రమాదాలు జరిగే అవకాశం

- ఎం.బాలరాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు

తాడిపత్రికి వెళ్లే రహదారుల్లో ఎక్కడ చూసినా వృథా నాపరాళ్లు కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కనే వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. డ్రైవర్లు ఏమ్రాతం ఏమరపాటుకు గురైన పక్కనే ఉన్న రాళ్లపైకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. బస్సుల్లో ఎంతోమంది ప్రయాణికులు వెళ్తుంటారు. ప్రమాదాలు జరిగితే తక్షణమే వైద్యం అందే పరిస్థితి కూడా ఈ మార్గంలో లేదు. అందుకే అధికారులు కనీస చర్యలు తీసుకోవాల్సి ఉంది.

రోడ్డుపై కుప్పలుగా..

- బి.మాధవస్వామి, ఉపాధ్యాయుడు

నాపరాతి ముక్కలను ఎక్కడపడితే అక్కడే వేస్తున్నారు. పలుకూరు, రామాపురం, బెలుం మార్గంలో వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా వేశారు. ఎదురుగా వాహనం వస్తే రోడ్డు దిగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ద్విచక్ర వాహనంపై వెళుతండగా ఎదురుగా బస్సుగాని, లారీగాని వస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చాలామంది వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి.

యజమానులకు తాఖీదులు ఇస్తాం

- వెంకటరెడ్డి, గనుల శాఖ ఏడీ

గనుల్లో వచ్చిన వృథాను పక్కనే గని గుంతల్లో వేయాలనే నిబంధన ఉంది. రహదారులపై వేయకుండా యజమానులకు కొందరికి నోటీసులు పంపాం. ర.భ.శాఖ అధికారులు స్పందించి వారివంతుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా పరిధిలో అక్రమ మైనింగ్‌, తరలింపుపై చర్యలు తీసుకుంటాం. యజమానులు ఇతరులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమతులు ఉన్నవరకే తవ్వకాలు చేపట్టాల్సి ఉంది.

చింతలాయపల్లెకు వెళ్లే రహదారిలో..

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.