close

బుధవారం, జులై 17, 2019

ప్రధానాంశాలు

ప్రాణాలు లాగేస్తున్నాయ్‌

మృతి చెందిన పశువులు (పాత చిత్రం)
మేతకు వెళ్లుతున్న పశువులు

వికారాబాద్‌, గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యుత్తు తీగలు మనుషులకే కాదు మూగ జీవాల పాలిట కూడా యమపాశాలుగా మారుతున్నాయి. జిల్లా ప్రతి రోజు ఎక్కడో ఓ చోట పశువులు విద్యుదాఘాతానికి గురై మరణిస్తున్నాయి. జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే 10కిపైగా పశువులు మృతి చెందాయి. దీనివల్ల సంబంధిత రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. విద్యుత్తు సిబ్బంది ఎన్నిసార్లు మరమ్మతులు చేపడుతున్నామని చెబుతున్నా విద్యుత్తు తీగలు తెగడం, వేలాడుతున్న, ఎర్త్‌ తీగల వద్ద విద్యుత్తు సరఫరాతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా వర్షాకాలం ప్రారంభంలోనే పశువులు ఎక్కువగా మరణిస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ఉరుములు, మెరుపులతో గాలులు రావడం వీటి ధాటికి తీగలు తెగిపడటం వంటి కారణాలతో గత నెల రోజుల్లో పశువులు ఎక్కువగా మరణించాయి. రైతులు ఎంతో కష్టపడి కుటుంబానికి, వ్యవసాయానికి ఆసరగా ఉంటాయనుకుని పశువులను కొనుగోలు చేస్తే తీరా తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడటంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది.

మేతకు వెళ్లి మృత్యువాత
పశువులు మందగా మేతకు వెళ్లిన సందర్భంలోనే ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయి. స్తంభాలకు ఉన్న ప్రధాన విద్యుత్తు తీగలు తెగిపడగా పశువులు వాటికి తగిలి విద్యుదాఘాతంతో చనిపోతున్నాయి. పలు సందర్భాల్లో పంట పొలాల్లో కిందకి ఉన్న నియంత్రికలకు విద్యుత్తు తీగలకు తగిలి చనిపోతున్నాయి. కొన్నిసార్లు స్తంభాల కింద ఎర్త్‌ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోతున్నాయి. పశువులు చనిపోతే విద్యుత్తుశాఖ సంబంధిత రైతులకు ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే ఈ మొత్తం సరిపోవడంలేదని, దీన్ని మరింత పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు.

పరిహారం ఇలా పొందవచ్చు
విద్యుత్తు తీగలు, నియంత్రికలు ఎర్త్‌ తీగలు తగిలి పశువులు మరణిస్తే విద్యుత్తు శాఖ పరిహారం అందిస్తుంది.గేదె, ఎద్దు, ఆవు, చనిపోతే రూ.40వేలు, మేక లాంటి చిన్న జంతువులు చనిపోతే రూ.4వేలు ఇస్తుంది. పశువు చనిపోయిన వెంటనే స్థానిక పశువైద్యుడికి విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం అందించాలి. చనిపోయిన పశువుకు పశు వైద్యుడి చేత పోస్ట్‌మార్టం చేయించి, వారు ఇచ్చిన ధ్రువపత్రంతో పాటు గ్రామ పంచాయతీ ఇచ్చే యజమాని ధ్రువపత్రం యజమాని ఆధార్‌ కార్డు నకలు ప్రతిని సంబంధిత మండలానికి చెందిన విద్యుత్తు ఏఈకి అందించాలి.

క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి
- నాగిరెడ్డి, వికారాబాద్‌
విద్యుత్తు తీగలు తెగి కింద పడటంతో బంగారం లాంటి పాడి పశువులను కోల్పోతున్నాం. రైతులకు మూగజీవాలతో ఉన్న అనుబంధం వెలకట్టలేనిది. గేదెల పాలమీద అనేక కుంటుబాలు ఆధారపడుతున్నాయి. వర్షాకాలం దృష్యా విద్యుత్తు సిబ్బంది. తెగిపడ్డ తీగలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. విద్యుత్తుశాఖ ఇచ్చే పరిహారం త్వరితగతిన ఇస్తే రైతు మరో పశువును కొనుక్కునే అవకాశం ఉంటుంది.

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ
- సంతోష్‌, ఏఈ, వికారాబాద్‌
ఉరుములు, మెరుపుల వల్ల ఇన్సులేటర్లు పగిలి విద్యుత్తు తీగలు కింద పడతాయి. పశువులు గుర్తించలేక వాటికి తగిలి మృతి చెందుతున్నాయి. ఎక్కడ విద్యుత్తు తీగలు కింద కనబడినా విద్యుత్తు అధికారులకు లేదా సిబ్బందికి సమాచారం అందించాలి. ప్రధానంగా అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చు. పశువులు మరణిస్తే పరిహారం పొందే వీలుంది. పశువులు మరణించిన వెంటనే స్థానికంగా ఉన్న పశు వైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.