భూ దస్త్రం... ప్రక్షాళనం - Vikarabad - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

భూ దస్త్రం... ప్రక్షాళనం

 మరో పది రోజుల్లో పార్ట్‌-బీ పూర్తి
 వేగంగా పట్టాదారు పాసు పుస్తకాల జారీ

భూ దస్త్రాల ప్రక్షాళనలో జిల్లాలో భాగంగా రెండో విడత(పార్ట్‌-బీ) విచారణలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో సభలు నిర్వహించి వివాదాస్పద భూములను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో సుమారు 60 శాతం వరకు ఇటువంటి భూ సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మరో పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో 57 వేల ఖాతాలకు సంబంధించి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

వికారాబాద్‌ జిల్లాలో 2,66,474 లక్షల భూముల ఖాతాలు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 2,08,487 ఖాతాలకు సంబంధించి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జిల్లా అధికారులు భూముల యజమానులకు అందించారు. అయితే 2.66 లక్షల ఖాతాల్లో 2.43 లక్షల ఖాతాలకు సంబంధించిన దస్త్రాలు మాత్రమే స్పష్టంగా ఉన్నాయి. మిగతా 23,356 ఖాతాలు వివిధ రకాల వివాదాల్లో నలుగుతున్నాయి. వీటిల్లో వీలైనంత వరకు వివాదాలను పరిష్కరించేందుకు వారం రోజులుగా జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం రెండు గ్రామాల్లో సభలు నిర్వహించి అక్కడ వివాదాస్పద కేసులను పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 60 శాతం భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. ఇందులో కోర్టు కేసుల్లో ఉన్నవి మినహా, ఇతర సమస్యలున్న వాటిని వెంటనే స్థానిక రెవెన్యూ సిబ్బంది, జిల్లా ఉన్నతాధికారులు, గ్రామస్థులతో మాట్లాడి పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో 16 వేల ఖాతాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించినట్లు చెబుతున్నారు. మిగిలిన ఏడు వేలకుపైచిలుకు ఖాతాలను త్వరలోనే విచారణ చేపట్టనున్నారు.

అన్నీ సక్రమంగా ఉన్నా పుస్తకాలు అందడం లేదు
జిల్లాలో భూముల ఖాతాలకు సంబంధించి యజమానికి ఎలాంటి సమస్యలు లేకున్నా ప్రభుత్వం నుంచి జారీ చేసే పట్టాదారు పాసుపుస్తకాలు మాత్రం అందడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2.66 లక్షల ఖాతాలకు ఇప్పటి వరకు కేవలం 2.08 లక్షల మందికి మాత్రమే కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేశారు. అందులోనూ కొన్ని పేర్లు, భూ విస్తీర్ణ,ం సర్వే సంఖ్యలు వంటి పొరపాట్లు దొర్లాయి. అవికాకుండా మరో 57 వేల ఖాతాలకుపైగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పటి వరకు జారీ చేయలేదు. రెవెన్యూ అధికారులు మాత్రం పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తామని చెబుతున్నా... రైతులు మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల్లో పలువురి ఖాతాల్లో తప్పులు దొర్లడం, పార్ట్‌-బీ వివాదాస్పద భూములకు సంబంధించిన పుస్తకాలను అధికారికంగా పంపిణీ కార్యక్రమాన్ని నిలుపుదలతో పాసుపుస్తకాలు రాని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే పాసుపుస్తకాలు జారీ చేయడానికి ముందు రెవెన్యూ అధికారులు ఆయా మండలాల్లోని ఖాతాలకు సంబంధించి డిజిటల్‌ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల్లో 57,965 ఖాతాలకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్లు డిజిటల్‌ సంతకాలు చేయలేదన్నది ఆన్‌లైన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ప్రస్తుతం డిజిటల్‌ సంతకాల కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు.

ఆధార్‌ లేక అడ్డంకులు
రైతులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం తమ ఆధార్‌కార్డును అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే అన్ని దస్త్రాలు సక్రమంగా ఉన్న 22 వేల ఖాతాలకు సంబంధించి ఆధార్‌ వివరాలు లేకపోవడంతో అపరిష్కృతంగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో పార్ట్‌-బీ వివాదాస్పద భూముల్లోనూ 13,182 ఖాతాలకు సంబంధించి ఆధార్‌ వివరాలు లేవని ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. దీంతో 35 వేల ఖాతాలకు సంబంధించి కేవలం ఆధార్‌ అనుసంధానం లేకపోవడంతోనే డిజిటల్‌ సంతకాలు, కొత్త పట్టాదారు పాపుస్తకాల పంపిణీకి సంబంధించి అవరోధాలు ఏర్పడుతున్నాయని స్పష్టమవుతోంది.

అతి త్వరలో పార్ట్‌-బీ ముగిస్తాం
-అరుణ కుమారి, సంయుక్త పాలనాధికారిణి
జిల్లాలో వారం రోజుల నుంచి పార్ట్‌-బీ సర్వే నడుస్తోంది. మరో వారం, పది రోజుల్లో వివాదాస్పద భూములను దాదాపు వంద శాతం విచారణ చేపట్టే అవకాశముంది. ఆ వెంటనే అన్ని దస్త్రాలు సక్రమంగా ఉన్న వారికి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ మధ్యవర్తులను సంప్రదించొద్దు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.