close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

ప్రేమమూర్తి... వెన్నంటే స్ఫూర్తి

నేడు తండ్రుల దినోత్సవం
- ఈనాడు, హైదరాబాద్‌

బిడ్డల కోసం జీవితాంతం కష్టించే మనస్తత్వం
భావోద్వేగాలకు అతీతంగా కనిపించే గంభీరత్వం
నాన్నే పిల్లల పాలిట హీరో
కన్నా ఏం చేస్తున్నావ్‌?  చిట్టి తండ్రీ ఎక్కడున్నావ్‌?..
అని ఇల్లంతా కలియతిరుగుతూ కడుపున పుట్టిన బిడ్డలోనూ తన తండ్రిని వెతుక్కుని మురిసిపోయే ఆ వ్యక్తి ‘నాన్న’ కాక ఇంకెవరు.
ఇంత అందంగా, అంతకుమించి ఆత్మీయంగా ఎవరు పిలవగలరు ఒక్క నాన్న తప్ప.
బిడ్డలకు ఆయన ఓ హీరో.
ప్రతీ వయసులోనూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడే ఆత్మబంధువు.
తన కష్టాలను బయటకు తెలియనివ్వని గంభీరశాలి.
తన కళ్లతో ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. ఆపద వేళ భుజంతట్టి నేనున్నానంటూ ధైర్యాన్ని నింపుతాడు. తప్పటడుగులు సరిచేస్తాడు. తప్పుదారిన పయనిస్తే దండిస్తాడు.
నాన్న అంటే ఉండే ఆ భయమే తమను నడిపించిందంటారు విజేతలు. తమపై ఆయన ఉంచిన నమ్మకమే నలుగురిలోనూ ప్రత్యేకంగా మెరిసేలా చేసిందంటారు ఇంకొందరు.
హైదరాబాద్‌ నగరంలో ఓనమాలు దిద్ది.. అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్ఠలు సాధించిన సైనానెహ్వాల్‌, పి.వి.సింధు, మిథాలీరాజ్‌ వంటి క్రీడాకారిణుల వెనుక తండ్రుల కష్టమే కాదు.. తమ బిడ్డలపై ఉన్న ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. తమ గెలుపోటముల్లో వెన్నంటి ఉన్న తండ్రితో అనుబంధాన్ని వెల్లడించే దిగ్గజాలెందరో. నాన్న అప్పుడప్పుడు కోపగించినా, ఒక్కోసారి కళ్లెర్ర చేసి విలన్‌లా కనిపించినా ఆయన మనసు వెన్న అంటారు బిడ్డలు. నేడు ‘తండ్రుల దినోత్సవం’. ఈ సందర్భంగా నాన్నతో అనుబంధాన్ని వివిధ రంగాలకు చెందినవారు ‘ఈనాడు’తో పంచుకున్నారు. అవేమిటో వారి మాటల్లోనే..

తాను కష్టాలు భరించి.. మాకు భరోసా పంచి
- బి.వెంకటనర్సమ్మ, జిల్లా విద్యాశాఖాధికారిణి, హైదరాబాద్‌

ఆనాడు పల్లెల్లో ఒక్క ఆడపిల్లకు చదువు చెప్పించేందుకే వెనుకంజ వేస్తున్న సమయంలో మా నాన్న ఐదుగురు కుమార్తెలకు ఉన్నత విద్య చెప్పించారు. ఎందుకీ చదువులంటూ ఎవరెన్ని అన్నా మా వరకూ రానివ్వకుండా భరిస్తూ వచ్చారు. మేమంతా ఉన్నతంగా స్థిరపడేందుకు కారణమయ్యారు. అమలాపురం వద్ద గాదిలంక మా స్వస్థలం. నాన్న ఓం శివాజీ, అమ్మ అన్నపూర్ణ. నాన్నకు చదువంటే చాలా ఇష్టం. ఆయనకు ఎనిమిదోతరగతిలో కంటి సమస్య తలెత్తి ఇంట్లో సరిగా పట్టించుకోకపోవడంతో చదువుకు దూరమయ్యారు. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. తరువాత నలుగురు చెల్లెళ్లు. పాఠశాల స్థాయి నుంచి టాపర్‌గానే ఉండేదాన్ని. నాన్న ఏ రోజూ మీరెలా చదువుతున్నారని అడిగేవారు కాదు. నా స్నేహితులను అడిగి నా గురించి తెలుసుకునేవారు. ఒకరోజు మా అందర్నీ కూర్చోబెట్టి మీరంతా ఉన్నత చదువుల వైపు వెళతారా! వివాహాలు చేయమంటారా! అంటూ ప్రశ్నించారు. మేము చదువుకునేందుకే మొగ్గుచూపాం. జీవితంలో స్థిరపడేంత వరకు కష్టపడాలని నిర్ణయించుకున్నాం. ఊరి నుంచి కళాశాలకు చాలా దూరం. రోజూ ఇల్లు చేరేసరికి రాత్రి 8 గంటలయ్యేది. అప్పటివరకు బస్టాప్‌లో మా కోసం ఎదురుచూసేవారు. కొన్నిసార్లు మా చదువులకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించేవి కావు. ఇవేమీ మావరకు రాకుండా తాను భరిస్తూ వచ్చారు. ముగ్గురు చెల్లెళ్లు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సంపాదించారు. మరో సోదరి బీడీఎల్‌ మేనేజర్‌. సమయపాలన, ఉత్సాహం ఆయన నుంచి నేర్చుకున్నా.

నాన్నకు ప్రేమతో..

తమ అపురూప మార్గదర్శిని ఆశ్చర్యపరిచేందుకు నగరంలోని పలువురు యువత ప్రణాళిక వేసుకుంటున్నారు. తండ్రికి ఇష్టమైన ప్రదేశాలను ఆయనతో కలిసి చుట్టేసేందుకు ఇప్పటికే కొందరు సిద్ధమయ్యారు. ఇంకొందరు తమ తండ్రితో పాటు ఆయన స్నేహితులంతా కలిసి ఒకేచోట కూర్చొని ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేలా ఎల్‌ఈడీ తెరలను సిద్ధంచేశారు. హోటళ్లు అందిస్తున్న ప్యాకేజీలకూ సై అన్నారు. అలానే ఆయన బాల్యం, విద్యాభ్యాసం, కళాశాల రోజులు, వివాహం, పదవీవిరమణ చేసిన రోజు.. ఇలా ప్రత్యేక సందర్భాలలో తీసుకున్న ఫొటోలన్నింటినీ గుదిగుచ్చి, చక్కటి నేపథ్య సంగీతం జోడించి ఆశ్చర్యపరిచేందుకు పిల్లలు ప్రయత్నిస్తున్నారు.

తాను గురువు.. మార్గదర్శి
- డాక్టర్‌ సింధూర, డైరెక్టర్‌, నారాయణ విద్యాసంస్థలు

లక్షలాదిమంది విద్యార్థులు.. వేలాది ఉద్యోగులు.. అనుకూల, ప్రతికూల వాతావరణం.. ఎవరినీ నొప్పించకుండా పనిచేయడం.. ఇవన్నీ క్లిష్టమైన, సున్నిత అంశాలు. ఒక బాధ్యతను చేపట్టడం బాగానే ఉన్నా సమర్థవంతంగా నిర్వర్తించడం కష్టమైన ప్రక్రియ. వీటన్నింటినీ అధిగమించేంతటి ఆత్మవిశ్వాసం, ఏ సమయంలోనైనా మనోనిబ్బరంగా ఉండగలగడం నాన్న నారాయణ వద్ద నుంచే అలవరచుకున్నా. ఒక పని అప్పగించాక వారిపై పూర్తి భరోసా ఉంచడం ఆయన గొప్పతనం. నెల్లూరు పట్టణంలో చిన్న ఇంట్లోనే ఉమ్మడి కుటుంబం. అక్కడే తరగతులు.. వచ్చిపోయే విద్యార్థులు.. వీటన్నింటి మధ్య నుంచి ఎదిగిన సంస్థ ఇది. ఆరోతరగతిలో నాన్న వద్దనే లెక్కలు నేర్చుకున్నా. చిన్నపుడు ఆర్కిటెక్ట్‌ కావాలని ఉండేది. నేను 9వ తరగతి చదివే సమయంలో వైద్యశాల ఏర్పాటుచేయడంతో క్రమంగా అక్కడకు వెళ్లడం, శస్త్రచికిత్స జరిగే గదులను పరిశీలించడం వంటివి ఆ వృత్తి పట్ల ఆసక్తిని పెంచాయి. బైపీసీ తీసుకుని వైద్య కోర్సు పూర్తిచేశా. ఆ తరువాత విద్యాసంస్థల బాధ్యత చేపట్టమని నాన్న నన్ను కోరారు. కొద్దిరోజులు పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకుంటానని హామీ తీసుకున్నాక బాధ్యతలు చేపట్టాను. ఆ సమయంలో నువ్వు చేయగలవు.. నీలో ప్రతిభ ఉందంటూ వెన్నుతడుతూ ముందుకు నడిపించారు. తాను నాకు జీవితానికి అవసరమైన దిశానిర్దేశం చేసే మార్గదర్శి.

ఐదేళ్ల వయస్సు నుంచే
-మాళవిక ఆనంద్‌, గాయని, బర్కత్‌పుర

నాన్న వివేకానంద్‌ ప్రోత్సాహంతో అయిదేళ్ల వయసు నుంచే గాయనిగా సాధన చేసేదానిని. తొమ్మిదో ఏటనే 17 ఆధ్యాత్మిక గీతాలతో ‘శ్రీహరి సంకీర్తన’ పేరిట సీడీ ఆవిష్కరించాను. ఇప్పటివరకు 230 కచేరీలు నిర్వహించా. మైసూరులో ప్రతిష్ఠాత్మక దసరా వేడుకలకు రెండుసార్లు ఆహ్వానం అందుకున్నా. ఆలిండియా రేడియోలో గ్రేడ్‌ ఆర్టిస్టుగా స్థానం సంపాదించా. తెలుగు, హిందీ, కన్నడం, మరాఠీ, తమిళ భాషలలో అనేక పాటలు ఆలపించాను..వివిధ రాష్ట్రాలలో జరిగిన కచేరీలలో పాల్గొంటున్నా. ఎక్కడికి వెళ్లినా సాధన మొదలుకుని ప్రదర్శనల వరకు నాన్న వెన్నంటి ఉండి సూచనలివ్వడం, నేను మరింతగా రాణించాలని తపన పడడం మర్చిపోలేను.

నాన్న నేర్పిన టెన్నిస్‌ ఇది
-భక్తిషా, లాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, భూమన్నగల్లీ

చిన్నప్పటి నుంచి లాన్‌ టెన్నిస్‌ అంటే ఇష్టం. నాన్న విమల్‌ షా ప్రతీరోజు నా సాధన కోసం సమయం కేటాయించాడు. గెలుపోటముల్లో భుజం తడుతూ ప్రోత్సహించేవారు. అండర్‌-16 జాతీయస్థాయి ర్యాంకింగ్‌లో మొన్న ఏప్రిల్‌లో ప్రథమంలో నిలిచా. ఇటీవల థాయ్‌లాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ కప్‌ జూనియర్స్‌ విభాగంలో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించి 11వ స్థానాన్ని తెచ్చుకున్నా. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమయ్యే సాధన ఉదయం 11.30గంటల వరకు కొనసాగుతుంది. మళ్లీ సాయంత్రం నుంచి రాత్రి వరకు సాధనే. నన్ను రోజూ మైదానంలో విడిచిపెట్టేది మొదలు ఏ పోటీలలో పాల్గొన్నా నాన్న మార్గదర్శకత్వంలోనే.

తండ్రుల సాయం ఇలా (శాతాల్లో)పిల్లలూ మీకు సాయం చేస్తా
విద్యాసంబంధ అంశాల్లో నాన్న చేయూత

- ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌

ఉదయం బుద్ధిగా బడికెళ్లిన పిల్లలు ఇంటికి రాగానే అమ్మ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. హోంవర్కు చేసేంతవరకు పోరు పెడుతూనే ఉంటుంది. పరీక్షల సమయంలో దగ్గరుండి చదివిస్తుంది. మరి నాన్న ఏం చేస్తాడు. మార్కుల నివేదికపై సంతకం చేస్తాడు. నెలవారీ ఫీజులు చెల్లించేందుకు పాఠశాలకు వెళతాడు. ఇదీ సామాన్యంగా వినిపించే మాట. కానీ పిల్లల చదువు విషయంలో తండ్రుల శ్రద్ధ పెరుగుతోంది. వారికి సాయం చేస్తూ ఆలస్యంగా నిద్రపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 1000 మందికి పైగా విద్యార్థులపై బ్రెయిన్లీ సంస్థ సర్వే నిర్వహించింది. విద్యాసంబంధ అంశాల్లో నాన్నలు ఎంతవరకూ చేయూతనిస్తున్నారనే సమాచారం రాబట్టింది. 70శాతం మంది తాము సాధించే మార్కులు, ర్యాంకుల విజయంలో కీలకపాత్ర తండ్రులదేనంటూ సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతీ ముగ్గురు తండ్రుల్లో ఒకరు పిల్లల చదువుకు సహాయం చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు.

 

కుటుంబ బంధాల గొప్పతనమిది
- ప్రశాంత్‌రెడ్డి, అన్వయ పేరెంట్స్‌ సంరక్షణ సంస్థ, మాదాపూర్‌

కుటుంబంతో నిత్యం ఆత్మీయ అనుబంధాలను కొనసాగించే గొప్ప సంప్రదాయం మనది. రేపటి తరానికి ఈ విలువలను అందజేసేందుకు ఇప్పటి పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా మెలగాలి. ఉన్నత చదువులు పూర్తిచేసి అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఉద్యోగం చేసేవాడిని. వయసు మీదపడుతున్న నాన్న సత్యనారాయణరెడ్డి కళ్లెదుట కనిపించేవారు. మా పసితనంలో తానెంతగా పరితపించారనేది గుర్తుకొచ్చేవి. అలా భారత్‌కు వచ్చేశాను. హైదరాబాద్‌లోనే ఉంటూ వృద్ధులకు అందించాల్సిన సేవల గురించి ఆలోచించి ‘అన్వయ’ సంస్థకు రూపమిచ్చాం. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్లినవారి తల్లిదండ్రులకు అవసరమైన తోడ్పాటు అందించే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది. వయసు పైబడిన వారికి మేమున్నామనే భరోసానివ్వగలిగే తోడు కావాలి. ఏ అవసరమొచ్చినా పిలిస్తే పలికే దూరంలో మా వాళ్లు ఉన్నారనే ధైర్యాన్నివ్వాలి. మేం అందిస్తున్నది అదే.. అకస్మాత్తుగా విద్యుత్‌ ఆగిపోతుంది. సినిమాకు వెళ్లాలనిపిస్తుంది. కానీ ఎవరితోనూ వీటిని పంచుకోలేరు. మా ద్వారా ఆ చిన్న అవసరాలనూ తీర్చుతున్నాం. నగరంలో సుమారు 700 కుటుంబాలకు నిర్దేశిత రుసుముతో సేవలందిస్తున్నాం. మా నాన్న కోసం ఇక్కడకు వచ్చిన నాకు.. ఇంతమంది తల్లిదండ్రుల ప్రేమను పొందేందుకు కారణమవడం ఆనందంగా అనిపిస్తుంది.

ఆత్మవిశ్వాసం..  సహాయపడే లక్షణం
- డాక్టర్‌ ఆదర్శ్‌ అన్నపరెడ్డి, ఆర్ధోపెడిక్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌


నేను వైద్యవృత్తిలో కాలుమోపాక నాన్న డాక్టర్‌ గురవారెడ్డి పేరును నిలబెట్టడం బాధ్యతగా మారింది. ఎటువంటి సమస్య ఎదురైనా చిరునవ్వుతో పరిష్కరించడం, ఏ ఇబ్బంది మీదపడినా తొణకని మనస్తత్వం ఆయన నుంచి నేర్చుకున్నా. మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలకు తాను ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఎంతమంది రోగులను పరీక్షించినా ఇల్లు చేరినపుడు అదే ఉత్సాహం. ఎక్కడా చికాకు కనిపించదు. చిన్నపుడు సినీ దర్శకుడిని కావాలనుకునేవాడిని. బాలనటుడిగా ‘అమ్మ చెప్పింది’, ‘ఈగ’ ‘అమృతం’ వంటి వాటిలో నటించాను. చెల్లి కావ్య ‘లిటిల్‌సోల్జర్స్‌’లో బాలనటిగా ప్రశంసలు అందుకుంది. రోజూ నాన్నను చూస్తూ పెరగడం వల్ల నాకూ వైద్యవృత్తి పట్ల ఆసక్తి, ఇష్టం పెరిగాయి. అయితే నా కెరీర్‌ను నా ఇష్టానికే నాన్న వదిలేశారు. సన్‌షైన్‌ ఆసుపత్రిలో ఆయనతోపాటు ఆర్ధోపెడిక్‌ సర్జన్‌గా కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిస్తోంది. నేను కేవలం పుస్తక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే.. తను తన అనుభవాన్ని వినియోగిస్తుంటారు. కొన్నిసార్లు తన పనితీరు చూసి ఆశ్చర్యమేస్తుంది. నన్ను నేను మెరుగుపరచుకునేందుకు మార్గం చూపుతున్న సందర్భాలున్నాయి. తన నుంచి నేర్చుకున్న అంశాల్లో ఎవరితో ఎలా మెలగాలనే అంశాలు చాలా ఉన్నాయి. మానవత్వంతో స్పందించడం, సహాయం చేసేగుణం అలా నేర్చుకున్నవే. స్వతహాగా నాలో ఆత్మవిశ్వాసం కాస్త తక్కువ. దాన్ని గమనించిన నాన్న నీపై నీకే ఆత్మవిశ్వాసం లేకపోతే రోగులకు ఎలా నమ్మకం కలిగిస్తావంటూ నమ్మకాన్ని పెంచారు. ఆయన నా గురువు. సమయపాలన, ఒత్తిడిని అధిగమించటం ఇవన్నీ నాన్న ప్రత్యేకతలు. తండ్రి పేరును నిలిపేందుకు నన్ను నేను మరింతగా మార్చుకోవాలనిపిస్తుంది. నాన్న అంటే బిడ్డలకు కనిపించకుండా నిశ్చబ్దంగా వెన్నంటి ఉండే నీడ.

స్వేచ్ఛనిచ్చి..  బాధ్యత నేర్పించారు!
- సుష్మ బొప్పన, అకడమిక్‌ డైరెక్టర్‌, శ్రీ చైతన్య విద్యాసంస్థలు

నాన్నలో ఓపిక చాలా ఎక్కువ. ఎదుటివారి మాటలను ఎంత సమయమైనా వింటూనే ఉంటారు. అన్నీ తనకే తెలుసనే భావన ఉండదు. తన నుంచి ఎంతో నేర్చుకున్నాం. మేమిద్దరం ఆడపిల్లలమే అయినా ఏ రోజూ ఆ అభిప్రాయం రానివ్వలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మా లక్ష్యాన్ని చేరేందుకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడమే గాక బాధ్యతనూ నేర్పించారు. స్వేచ్ఛతో కూడిన బాధ్యత ద్వారా తమను తాము ఎంతగా అభివృద్ధి చేసుకోవచ్చనేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. మేం చేసే పనిలో తప్పొప్పులను విమర్శించేవారు కాదు. పని పట్ల నిబద్ధత ఉండాలని చెప్పేవారు. తప్పులు చేసినా వాటి నుంచి పాఠాలు నేర్చుకోమనేవారు. క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావానికి ప్రాధాన్యమిచ్చేవారు. జీవన నైపుణ్యాలు, భావోద్వేగాలు, నడక, నడత అన్నీ ఆయన నుంచి అలవరచుకున్నాం. ఓపిక విషయంలో తనలో సగం అలవడినా చాలా గొప్ప అనుకుంటాం. విలువలు, నైపుణ్యాలను స్వతహాగా అలవరచుకునేందుకు అద్భుతమైన వాతావరణాన్ని మా చుట్టూ సృష్టించారనే చెప్పాలి. తరాలు మారుతున్న కొద్దీ పిల్లల ఆలోచనల్లో కొత్త మార్పులు వస్తుంటాయి. పెద్దవాళ్లుగా వాటిని ఆహ్వానించాల్సిందే. మనం పెరిగినట్టుగానే మన పిల్లలనూ పెంచాలనుకోవడం పొరపాటు. దానివల్ల మరింత ఒత్తిడికి గురవుతారు. వారు చాలా విషయాలను చూస్తూ నేర్చుకుంటారు. మా పిల్లలిద్దరూ మా అమ్మానాన్నలను గమనిస్తూ పెరుగుతున్నారు. విలువలను అలవరచేందుకు ఇదో మంచి మార్గం.

చిన్నప్పటి నుంచే ఆదర్శం
-అవినాష్‌ మహంతి, సంయుక్త కమిషనర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌

మా నాన్న (ఎ.కె.మహంతి) చిన్నప్పటి నుంచి మాకు హీరోనే...మా అన్నదమ్ములిద్దరికీ ఊహ తెలిసేటప్పటికే ఇంటికి పదుల సంఖ్యలో పోలీస్‌ అధికారులు వచ్చేవారు. అందరితోనూ ఆయన మాట్లాడేవారు. కొందరిపై కోప్పడితే, మరికొందరితో నవ్వుతూ మాట్లాడేవారు. కోప్పడిన వారిని మళ్లీ పిలిపించి ‘మీరు మరోసారి తప్పు చేయకుండా ఉండాలనే అలా మాట్లాడాను’ అనేవారు. పోలీస్‌ అధికారిగా ఆయన ఆహార్యం, ప్రవర్తన, తప్పు చేసినవారిపై చట్టపరంగా తీసుకునే చర్యలు మాకు ఆశ్చర్యం అనిపించేవి. భవిష్యత్తులో మేమూ అలా కావాలన్న భావన మాలో క్రమంగా పెరిగింది. నేను బీటెక్‌ పూర్తి చేశాక ఐపీఎస్‌ కావాలని నిర్ణయం తీసుకున్నాను. దరఖాస్తు చేసుకునేటప్పుడే ఐచ్ఛికంగా నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని నాన్నకు చెబితే ‘మంచిది... శుభాభినందనలు’ అన్నారు. పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో సూచనలిచ్చారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యాక చాలా సంతోషించారు. మా తమ్ముడు అభిషేక్‌ మహంతి నాలాగే బీటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా చేరాడు. ఆ ఉద్యోగం బాగోలేదని నాన్నతో అన్నాడు. ఏం చేస్తావ్‌... అని ప్రశ్నిస్తే... ఐపీఎస్‌ అవుతానని సమాధానమిచ్చి.. పట్టుదలతో చదివి ఎంపికయ్యాడు.
అన్నదమ్ములిద్దరం ఐపీఎస్‌లమైనా.. మూడు దశాబ్దాలు ఐపీఎస్‌గా విధులు నిర్వహించిన ఎ.కె.మహంతి కుమారులమన్న గుర్తింపే మాకు చాలా సంతోషాన్నిస్తుంది. విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లొచ్చినా, బదిలీలు చేసినా ఒకేలా ఉండాలని ఆయన నుంచి నేర్చుకున్నాం. ఆ విధానాన్నే పాటిస్తున్నాం.

లక్ష్యాన్ని విస్మరించొద్దని చెప్పారు
- అభిమానిక యాదవ్‌, మిసెస్‌ యూనివర్స్‌ ఇంటిలిజెన్స్‌-2017

మా నాన్న ప్రముఖ బుల్లితెర నటుడు విజయ్‌యాదవ్‌. ప్రస్తుతం టీవీ కళాకారుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నాన్నకు మేమే సర్వస్వం. నా ప్రతి అడుగులోనూ తన ముద్ర ఉంటుంది. విలువలు నేర్పారు. నీవేం సాధించాలన్నా లక్ష్యాన్ని విస్మరించకుండా ముందుకు సాగమని ప్రోత్సహించారు. మిసెస్‌ ఏసియా పసిఫిక్‌ టైటిల్‌ సాధించిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను ‘మిసెస్‌ యూనివర్స్‌ ఇంటిలిజెన్స్‌-2017’ సాధించడానికి కారణం నాన్నే. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదనే రీతిలో నన్ను పెంచారు. దక్షిణాఫ్రికాలో జరిగిన మిసెస్‌ యూనివర్స్‌ పోటీలకు వెళ్లానంటే తాను ప్రోత్సహించడంతోనే సాధ్యమైంది. ఫిట్‌నెస్‌ శిక్షకురాలిగా, మోడల్‌గా, వ్యాఖ్యాతగా, ఈవెంట్ ప్లానర్‌గా నేను నిలదొక్కుకోవడం వెనుక ఉంది నాన్న ఇచ్చిన ధైర్యమే.

                   -ఫిల్మ్‌నగర్‌, న్యూస్‌టుడే


  
 
 
  

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.