close

శనివారం, జులై 20, 2019

ప్రధానాంశాలు

పర్యాటక వాహనం.. సందర్శన సునాయాసం

నగరంలో సమకూరుతున్న ప్రత్యేక సదుపాయం
యాత్రికులకు తీరుతున్న రవాణా కష్టం

ఈనాడు - హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర సందర్శనకు వచ్చే వారికోసం తెలంగాణ పర్యాటకాబివృద్ధి సంస్థ వివిధ రకాల వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. నగరంలోనే కాకుండా.. నగరం నుంచి బయట సందర్శనా స్థలాలకూ వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా వాహనాలను సిద్ధం చేసింది. వృద్ధులు కూడా సునాయాసంగా ప్రయాణం చేసేలా పడక సౌకర్యం ఉండే కేరవాన్‌ వాహనాన్ని అద్దెకిస్తోంది. దేశీయ, ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులు వాహనాలకోసం ఇబ్బందులు పడకుండా.. అనుభవజ్ఞులైన డ్రైవర్లతో సమకూరుస్తోంది. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ ద్వారా లేదా నేరుగా టిక్కెట్‌ బుకింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి సంప్రదిస్తే మీకు వాహనం సమకూరుతుంది.
నగర సందర్శనకూ ఏర్పాట్లు..
ఎక్కువ మంది కుటుంబ సభ్యులుంటే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకునే సౌకర్యం కల్పించిన తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ.. ఒకరిద్దరు నగరాన్ని చూడాలనుకున్నా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 వరకూ సాగే నగర సందర్శనకు నాన్‌ ఏసీ బస్సులో అయితే రూ.250 చెల్లించాలి. అదే పిల్లలకు అయితే రూ.200 టిక్కెట్‌ ధరను నిర్ణయించింది. ఏసీ బస్సులో ప్రయాణించాలంటే పెద్దలకు రూ.350, చిన్నారులకు రూ.280 టిక్కెట్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది. సందర్శనా స్థలాల్లోకి ప్రవేశ టిక్కెట్లు ఎవరికి వారు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ రామోజీ ఫిల్మ్‌సిటీకి కూడా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తోంది. ఏసీ వాహనంలో నగరం నుంచి వెళ్లేందుకు పెద్దలకు రూ.1650, చిన్నారులకు రూ. 1320 వసూలు చేస్తారు. అదే నాన్‌ ఏసీ బస్సులో ప్రయాణించాలనుకుంటే పెద్దలకు రూ.1550, చిన్నారులకు రూ.1240 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులోనే రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రవేశ టిక్కెట్‌ కూడా ఇమిడి ఉంటుంది. వీటికి తోడు నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ‘హాప్‌ ఆన్‌ హాప్‌ ఆఫ్‌’ పేరిట ప్రత్యేక మినీ బస్సులు తిరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇందుకు పెద్దవారికి రూ.200, చిన్నారులకు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి రోజు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న నగర సందర్శన యాత్రలో బిర్లామందిర్‌, చార్మినార్‌, చౌమొహల్లా ప్యాలెస్‌, నిజాం మ్యూజియం, గోల్కొండ కోట, సాలార్‌జంగ్‌ మ్యూజియం, కుతుబ్‌షాహీ టూంబ్స్‌, లుంబినీ పార్కు సందర్శన ఉంటుంది.

అందుబాటులో ఉన్నవి ఇవే..
15 మంది కూర్చునేందుకు వీలుగా ఏసీ మినీ లగ్జరీ బస్సు, 18 మంది కూర్చునేందుకు సరిపడే మినీ ఏసీ బస్సు, 26 మంది కూర్చునేందుకు వీలుగా ఉండే నాన్‌ ఏసీ మినీ బస్సు, 26 మంది కూర్చుని వెళ్లేందుకు వీలుగా మినీ ఏసీ బస్సు, 36 మంది కూర్చొని వెళ్లేందుకు వీలుగా నాన్‌ ఏసీ హైటెక్‌, 40 సీట్లున్న ఏసీ హైటెక్‌, 45 సీట్లుఉన్న ఏసీ వోల్వో, 47 సీట్ల సామర్థ్యం ఉన్న ఏసీ మల్టీ యాక్సిల్‌ ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు సోఫాతో పాటు బెడ్‌ సౌకర్యం కూడా ఉన్న కేరవాన్‌ ఏసీ 7 సీటర్‌ వాహనం, ఇన్నోవా వాహనాలను పర్యాటకులు వినియోగించుకోవచ్చని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎం.డి. బి.మనోహర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.