close

మంగళవారం, జులై 16, 2019

ప్రధానాంశాలు

అసైన్డు అక్రమ రిజిస్ట్రేషన్లకు కళ్లెం

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రెవెన్యూశాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. భూదస్త్రాల ప్రక్షాళన తుదిదశకు చేరుకొన్న నేపథ్యంలో ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను గుర్తించి ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ చేపడుతోంది.

అక్రమ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు ధరణీ వెబ్‌సైట్‌తో పాటు ఎస్సార్వో(సబ్‌ రిజిస్ట్రార్‌ భూదస్త్రాల నిధి)లో ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను నిషేధిత భూముల జాబితాలో చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో వారం రోజుల నుంచి తహసీల్దార్లు నవీకరించిన దస్త్రాల ఆధారంగా ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను గుర్తిస్తున్నారు. ఇదివరకే భూదస్త్రాల శుద్ధీకరణ సందర్భంగా వీటిని గుర్తించి ప్రత్యేకంగా రిజిస్టర్‌లో నమోదు చేశారు. తప్పిదాలకు తావివ్వొద్దని వాటితో నవీకరణ దస్త్రాలను సరిపోల్చుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, దేవాదాయ, వక్ఫ్‌ బోర్డులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలతో పాటు అసైన్డు, నాన్‌ అసైన్డు, కాల్వల తవ్వకాల కోసం సేకరించిన భూముల విస్తీర్ణాల ఆధారంగా  సర్వేనంబర్లను గుర్తిస్తూ ఆన్‌లైన్‌లో మ్యాపింగ్‌ చేస్తున్నారు.

అక్రమాలకు తావులేకుండా గుర్తింపు చేపడితేనే
* జుక్కల్‌, గాంధారి, మాచారెడ్డి, మద్నూర్‌ తదితర మండలాల్లో అటవీశాఖ అధికారులు అన్నదాతలకు చెందిన భూములను సైతం అటవీ భూములుగా గుర్తిస్తూ భూదస్త్రాల ప్రక్షాళన సమయంలో నివేదించారు. దీంతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కాక ఏడాదిన్నర కాలం నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. ఇటీవల చేపట్టిన రెవెన్యూ, అటవీశాఖల సంయుక్త సర్వేలో శాఖల వారీగా భూముల వివరాలు వెల్లడయ్యాయి. పట్టా భూములైనప్పటికీ ప్రభుత్వానికి చెందినవిగా మ్యాపింగ్‌ చేపడితే భవిష్యత్తులో పట్టాదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
* ప్రస్తుతం కొన్ని మండలాల్లో ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ భూములతో పాటు పట్టాదారుల భూములు సైతం ఉన్నాయి. దీంతో ఆ సర్వే నంబరును మ్యాపింగ్‌ చేపడితే అందులోని పట్టాదారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. వీటన్నింటిని పరిశీలించి విస్తీర్ణం ఆధారంగానే బై సర్వేనంబర్ల ఆధారంగా మ్యాపింగ్‌ చేపడితేనే అన్నదాతలతో పాటు ప్రభుత్వానికి ప్రయోజనం కలగనుంది.
* పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థిరాస్తి వ్యాపారులు విచ్చలవిడిగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఓ స్థిరాస్తి వ్యాపారి ఏకంగా చెరువు శిఖానికి చెందిన 32 గుంటల భూమిని ఆక్రమించుకొని వెంచరు ఏర్పాటు చేయగా.. గ్రామస్థుల ఫిర్యాదుతో సర్వేలో బహిర్గతం అయింది.
* ఎల్లారెడ్డి పట్ణణంలో పోచారం కాల్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకొని స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు చేశారు. అన్నదాతలు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే వారే కరవయ్యారు.
* అక్రమాలకు అలవాటు పడిన క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మ్యాపింగ్‌ చేపడితే అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కయి తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* జిల్లాలో ఇదివరకే కోట్లాది రూపాయల విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పటికీ ఏదో ఒకచోట రిజిస్ట్రేషన్లు అవుతూనే ఉన్నాయి. వీటి విషయంలో స్పష్టమైన నిర్ణయానికి రావల్సి ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.