close

ఆదివారం, జులై 21, 2019

ప్రధానాంశాలు

వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్‌

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

‘‘ఏటా ఈపాటికే దుక్కులు దున్ని, విత్తులు వేసుకొనేవారు... ఈసారి ఇప్పటికీ కాడి కదలడం లేదు. జూన్‌ మూడో వారం వచ్చినా తొలకరి జల్లుల జాడ లేదు. నైరుతి రుతుపవనాలు జిల్లాకు చేరుకోవడానికి మరో 3-5 రోజులు పట్టొచ్చని భావిస్తున్నారు. ఈసారి కరవు తీరా వర్షాలు కురిస్తేనే ఖరీఫ్‌ సాధ్యమవుతుందని.. లేదంటే సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే ప్రమాదముందని కర్షకులు.. అధికారులు కలవర పడుతున్నారు.

ఈసారి సాధారణ వర్షాలే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఆశించిన మేర సాగవుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన మొదలైంది. అందుకు తగ్గట్టుగానే తొలకరి వర్షాలకే దెబ్బ తగిలింది. జూన్‌ 8న కేరళను తాకిన రుతుపవనాలు మన రాష్ట్రానికి 11 వరకు చేరుతాయని భావించినా.. వాయుగుండం ప్రభావంతో కంటికి కనిపించకుండానే జారుకున్నాయి. మళ్లీ ఈ నెల 20 దాకా వేచి చూడాల్సిందేనని వాతావరణ శాఖ సూచించడంతో రైతులు అరకలన్నీ పక్కన కట్టి పెట్టారు. ఏటా   జూన్‌ రెండో వారంలోపే మనకు తొలకరి జల్లులు కురిసేవి. ఈ నెలాఖరు వరకు సగటున 15 సెంటిమీటర్ల వర్షం పడాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఒక్క సెంటిమీటరు కూడా పడలేదంటే జిల్లాలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆదిలోనే అడ్డంకి..
జిల్లా రైతులు అందరి కంటే ముందే ఖరీఫ్‌ పనులకు శ్రీకారం చుడతారు. వర్ని, కోటగిరి, చందూర్‌, మోస్రా, రుద్రూర్‌, బోధన్‌, ఎడపల్లి మండలాల్లో ఈపాటికే నారుమళ్లు పోసుకునే వారు. కానీ ఈసారి పదో వంతు మంది కూడా ముందుకు రాలేదు. ఆర్మూర్‌, నందిపేట, ముప్కాల్‌, మెండోరా, మోర్తాడ్‌, ఏర్గట్ల, బాల్కొండ, వేల్పూర్‌ తదితర మండలాల్లో సగానికి పైగా మొక్కజొన్న, పసుపు విత్తనం వేసే వారు. కానీ జిల్లావ్యాప్తంగా సాధారణ సాగులో పది శాతం కూడా మొదలవలేదు.

పచ్చిబుట్ట ఎండుతోంది..
వర్షాకాలం చిరుజల్లుల్లో వేడి వేడిగా తినే మొక్కజొన్న కంకులు ఈసారి సరిపోయేంత సాగయ్యే పరిస్థితి లేదు. కొదిమిగా ఉన్న నీటితో వేసిన పంట ఉష్ణోగ్రత తీవ్రతతో ఎండుతోంది. వర్షం పడితేగాని స్వల్పకాలిక పచ్చిబుట్ట వేయరు. అది చేతికందే లోగా వర్షాలు తగ్గిపోయి డిమాండ్‌ పడిపోతుంది. మరోపక్క సాధారణ మక్క పంట వేయాలంటే రైతులు వెనుకడుగు వేస్తున్నారు. జూన్‌ మొదటివారంలోనే వేసే ఈ పంట సెప్టెంబరు రెండో వారానికి చేతికందేది. కానీ ఇప్పుడున్న పరిస్థితికి అక్టోబరు దాకా వేచి చూడక తప్పదు.

ఈ నెలాఖరులో నాట్లు పడేవి..
ఖరీఫ్‌లో సాధారణంగా సన్న రకాలకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఇవన్నీ దాదాపు 110-140 రోజుల్లో చేతికందే పంటలే. ధీర్ఘాకాలిక రకాలేసుకునే రైతులు ఇప్పుడు వర్షాలు ఆలస్యమవుతుండటంతో స్వల్పకాలిక రకాల వైపు చూడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.

పసుపు రైతులు పరేషాన్‌..
ఆర్మూర్‌ ప్రాంతంలోని 12 మండలాల రైతులు దాదాపు 35 వేల ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. ఈ పంట కాలపరిమితి సగటున 8 నెలలు. అయితే కోత ఆలస్యమైతే దిగుబడులు తగ్గుతాయని, మొదట్లోనే మార్కెట్‌లో సరైన ధర ఉంటుందని భావించి మే నెల మూడో వారం నుంచే విత్తడం మొదలుపెడతారు. అయితే ఈసారి తీవ్రమైన ఎండలకు వారం, పది రోజులు వేచి చూసి ఇక మరింత ఆలస్యం చేయకూడదని బోరుబావుల ద్వారా నీరు పెట్టి విత్తు వేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా సాగు మొదలైంది. కానీ ఎండ తీవ్రతకు మొలక శాతం ఆశించిన మేర రావడం లేదనే దిగులు మొదలైంది. తప్పిపోయిన వరుసలు ఇతర పంటల మాదిరి తిరిగి పెట్టుకుందామన్నా పసుపునకు ఆ పరిస్థితి లేదు. మొలక రావాలంటే కనీసం 15 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. అందుకే ఈ వర్షాభావ పరిస్థితులతో పసుపు రైతులు సతమతమవుతున్నారు.

సోయా జోలే లేదు..
జిల్లాలో 1.45 లక్షల ఎకరాల్లో సాగయ్యే సోయాబీన్‌ను ఈసారి వేసేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. ఎక్కువగా వర్షాధారంగా వేస్తారు. మళ్లీ విత్తనానికి భూమిలో అవసరమున్నంత తేమ ఉండి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటేనే విత్తు మొలకెత్తుతుంది. అందుకే కనీసం రెండు, మూడు వర్షాలు పడేదాకా వేచి చూసే దోరణిలోనే ఉన్నారు. ఇప్పటివరకు కనీసం వంద ఎకరాలు కూడా సాగుకు ముందుకు రాలేదు.

జిల్లాలో పడిన వర్షం అర సెంటిమీటరే..
- నరేందర్‌, వాతావరణ శాఖ జిల్లా అధికారి
నైరుతి రుతుపవనాలకు ఆటంకం లేకుంటే ఈపాటికి జిల్లా అంతటా విస్తరించి వానలు కురిసేవి. కానీ అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపానుతో వాటి దిశ మారింది. ఇప్పటివరకు కేవలం అర సెంటిమీటరుకే పరిమితమైంది. ఏటా రుతుపవనాలకు ముందే మే నెలాఖరులో కొన్ని అకాల వర్షాలు వచ్చేవి. భూమి వేడిమి తగ్గేది. కానీ ఈసారి అవి కూడా అంతగా లేవు. మున్ముందు దశల వారీగా అల్పపీడనాలు ఏర్పడతాయి. వర్షాలపై అంతగా ఆందోళన అవసరం లేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.