close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ప్రధానాంశాలు

రుణాల సద్వినియోగంపై అవగాహన కల్పించాలి

ఖలీల్‌వాడి, న్యూస్‌టుడే: రైతులు, ప్రజలు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొన్నప్పుడు రుణ లక్ష్యాలు, వాటిని సద్వినియోగం చేసుకొనే విధానంపై అవగాహన కల్పించాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు పేర్కొన్నారు. ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వాలు పేదల కోసం మంజూరు చేసే రాయితీ మొత్తాలు రుణ బకాయిల కింద తీసుకోవడం సరికాదన్నారు. రైతులు, పేద ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి పథకాల ద్వారా రాయితీ అందిస్తున్నారని తెలిపారు. ఈ మొత్తాలను రుణ బకాయిల కింద తీసుకొంటున్నారని పలు సందర్భాల్లో తమకు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. గత మార్చి వరకు బ్యాంకు ద్వారా అందజేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్‌ రంగ బ్యాంకులు లక్ష్యాలను మించిపోయాయని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ విషయమై ఆలోచించాలన్నారు. జీవనోపాధి రుణాల కోసం చేసుకొన్న దరఖాస్తులు చాలావరకు అపరిష్కృతంగా ఉన్నాయని, ఈ రుణాల మంజూరు విషయమై పరిశీలించాలన్నారు. అర్హులైన రైతులు బీమా ఉపయోగించుకొనేలా అవగాహన కల్పించాలని చెప్పారు. రుణ ప్రణాళిక ప్రకారం 2019-20 సంవత్సరానికి ప్రాధాన్య రంగాల కింద 2,74,341 మందికి రూ.5454.18 కోట్లు, ఇతర రంగాల వారికి రూ.150 కోట్లు మంజూరు చేయాడానికి ఆమోదం తెలిపారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సురేష్‌రెడ్డి, ఆర్‌బీఐ ఏజీఎం వెంకటేషం, ఎస్‌బీఐ ఏజీఎం నాయక్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

22న నీటి సంరక్షణపై గ్రామ సభ 
నీటి సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఈ నెల 22న ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీసీలోఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులపై సర్పంచులు, ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రధానమంత్రి సర్పంచుల పేరు మీద లేఖలు పంపించారని తెలిపారు. అవి ఈ నెల 20వ తేదీలోగా వారికి అందేలా చూడాలని, 22న ప్రతీ గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని తెలిపారు. గ్రామసభలో ప్రధానమంత్రి లేఖను ప్రజలకు చదివి వినిపించాలని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడుకొని విధానాలపై చర్చించాలని చెప్పారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణం చేసుకొనే విధంగా చూడాలని తెలిపారు. వీసీలో డీఆర్‌డీవో రమేష్‌, డీపీవో జయసుధ, ప్రసాద్‌, వినయ్‌కుమార్‌, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

మలిసంధ్యలో మహోదయం

విశ్రాంత జీవితంలో సరికొత్తగా ప్రణాళిక నచ్చిన రంగంలో ప్రవేశిస్తూ విజయాలు కుటుంబ బాధ్యతలు తీరిన తర్వాత.. ఉద్యోగ విరమణ అనంతరం మిగతా జీవితాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా గడిపేయాలని గతంలో భావించేవారు. 60 ఏళ్లు అంటే ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటూ ఏ చింతా లేకుండా విశ్రాంతి తీసుకోవాల్సిన దశ అనే భావన అందరిలో ఉంది. ఇలాంటి సమయంలో  ఒంటరితనంతో మానసికంగా బలహీనంగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది.  దీనిపై ప్రస్తుతం అందరినీ అవగాహన పెరిగింది. జీవితంలో ఒకప్పుడు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు బాటలు వేసుకుంటున్న వారు పెరుగుతున్నారు. ప్రధానంగా ఉన్నత చదువులపై దృష్టిపెట్టి పీహెచ్‌డీలను పూర్తి చేయడం, మనసుకు నచ్చిన వ్యాపారాలను ఆరంభించి.. విజయంతంగా నిర్వహించడం, స్వచ్ఛంద సంస్థల్లో వాలంటీర్లుగా చేరి సమాజం కోసం పూర్తి సమయం కేటాయించడం, యోగా వంటివి నేర్చుకుని శిక్షకులుగా మారడం, కళా రంగంలోకి ప్రవేశించడం.. ఇలా రకరకాల వ్యాపకాలను వెతుక్కుంటూ తమ జీవితాన్ని మరింత పరిపూర్ణం చేసుకుంటున్నారు. తమ మనసుకు నచ్చినవి.. సాంత్వన చేకూర్చే వాటిపై అధికశాతం మంది దృష్టిపెడుతున్నారు. వయసు 81.. పతకాలు 160 మనసు ప్రశాంతతత కోసం  25 ఏళ్ల కిందట చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నడక ప్రారంభించారు ఆమె.  అక్కడకు నడకకు వచ్చేవారు తమతో పాటు వెటరన్‌ పోటీలకు రమ్మనమని   పిలిచారు. వాళ్లతో విశాఖతో వెళ్లి 800 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రస్తుతం 81 ఏళ్ల వయసులోనూ పోటీలకు సిద్ధమయ్యారు విశాఖ జిల్లా చోడవరానికి చెందిన ముత్యం లక్ష్మి. దేశంలోని 11 రాష్ట్రాలలో జరిగిన జాతీయ వెటరన్‌ పోటీల్లో లక్ష్మి పాల్గొన్నారు.  2010లో కౌలాలంపూర్‌ వెళ్లి పరుగులో బంగారు, వెండి పతకాలు సాధించారు. 2011లో తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్‌ ఆథ్లెటిక్‌ పోటీలలో పాల్గొని తృతీయ స్థానంలో నిలిచారు.  ఇప్పటివరకు దాదాపు 160 పతకాలు సాధించారు. అందులో ఎక్కువ బంగారు పతకాలు కావడం విశేషం. ఇంట్లో పడిపోవడంతో లక్ష్మి మోకాలికి దెబ్బ తగిలింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆపరేషన్‌ చేశారు.  పరుగు పెడితే కాస్త నొప్పి వస్తుండడంతో వైద్యులు పరుగు తీయవద్దంటూ చెప్పారు. దీంతో డిస్కస్‌త్రో, జావెలిన్‌, షాట్‌పుట్‌ వంటివి ప్రాక్టీస్‌ చేస్తున్నారు.  చివరి వరకు పోటీల్లో పాల్గొనాలన్నది తన కోరికని,  ఓపిక ఉన్నంత వరక పోటీలకు వెళ్తుంటాను అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ముత్యం లక్ష్మి. -చోడవరం, న్యూస్‌టుడే యువతతో పోటీ - వి.శ్రీరాములు విశాఖ నగరానికి చెందిన నౌకాదళ విశ్రాంత ఉద్యోగి వి.శ్రీరాములు 97 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యానికి ప్రతిరోజూ రెండుగంటల సమయం కేటాయిస్తున్నారు. క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయడం, సెలవురోజుల్లో యాటింగ్‌కు వెళ్లడం ఆయనకు అలవాటు. ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లోనే ఒక గదిని చిన్నపాటి వ్యాయామశాలగా మార్చుకున్నారు. కనీసం పది కి.మీ.ల నుంచి 15కి.మీ.ల వరకు దూరం నడుస్తారు. నడకలో యువతతో వేగంలో పోటీపడుతున్నారు. 2016లో జరిగిన ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 5కి.మీ.ల రేస్‌వాక్‌ విభాగంలో బంగారుపతకం, 400మీటర్లు, 800మీటర్లు, 1500మీటర్ల పరుగు విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. 2011వ సంవత్సరంలో అమెరికాలో జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ పోటీల్లో 5కి.మీ.లు, 10కి.మీ.ల రేస్‌వాక్‌ విభాగంలో కాంస్యపతకాలు, 20కి.మీ.ల విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2016వ సంవత్సరంలో సింగపూర్‌లో జరిగిని ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 5కి.మీ.ల రేస్‌వాక్‌ విభాగంలో బంగారుపతకం సాధించారు. అదే సంవత్సరం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 5కి.మీ.లు, 10కి.మీ.లు, 20కి.మీ.ల విభాగాల్లో పాల్గొని మూడింటిలోనూ బంగారు పతకాల్ని దక్కించుకుని ‘అథ్లెట్‌ ఆఫ్‌ ఆసియా-2016’గా కూడా నిలిచారు. - ఈనాడు, విశాఖపట్నం పీజీ ప్రవేశపరీక్షకు ఉచిత శిక్షణ పోటీ పరీక్షల శిక్షణపేరుతో వేలాది రూపాయలు ఫీజులు తీసుకుంటున్న ఈ రోజుల్లో డా.అక్కెనపల్లి మీనయ్య అనే డిగ్రీ అధ్యాపకుడు వేసవిలో జవాబు పత్రాల మూల్యాంకణానికి కూడా వెళ్లకుండా పేద విద్యార్థులకు ఎంఏ ఎకనామిక్స్‌ పీజీ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ అందించి తోడ్పాటు అందించారు. 2012లో ఉద్యోగ విరమణ పొందిన ఆయన 2007 నుంచే నల్గొండలో ఉచిత శిక్షణ ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఏటా వందలాది మంది విద్యార్థులకు శిక్షణతో విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించేలా కృషిచేశారు. మూడేళ్లుగా ఎంఏ ఎకనామిక్స్‌ పీజీ ప్రవేశపరీక్షతో పాటు స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌లోనూ ఉచిత శిక్షణ అందిస్తున్నారు. 2013లో నల్గొండ ఎకనామిక్స్‌ ఫోరం పేరిట సంస్థను రిజిస్ట్రేషన్‌ చేసి దాని ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఆయన వద్ద ఎంట్రన్స్‌లో శిక్షణ పొందిన వారిలో ఇప్పటి వరకు సుమారు 570 మంది వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీలో సీట్లు పొందారు. మీనయ్య 2018లో డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఉద్యోగ విరమణ పొందినా నిత్యం పేద విద్యార్థులకు ఏదో విధంగా సహాయపడాలని, జ్ఞానాన్ని పంచి పెట్టాలని ఉచిత శిక్షణ అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. - నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే సమయమంతా  సాగుకే... హైదరాబాద్‌ నగరంలోని అమీర్‌పేటకు చెందిన వ్యాపారి కె.వెంకటపతిరాజు(66)కు చిన్నతనం నుంచి మొక్కల పెంపకంపై అమితమైన ఆసక్తి. మొక్కల సాగుకు నగరు శివారులోని దుండిగల్‌లో 30 సంవత్సరాల కింటే నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సదరు వ్యవసాయక్షేత్రంలో మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం వ్యాపారాలను తన కుమారుడు చూస్తుండటంతో ఆరు సంవత్సరాల నుంచి పూర్తి సమయం ఆయన మొక్కలు పెంపకానికే కేటాయిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో దాదాపు అన్నిరకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. 56 రకాల మామిడి పండ్లు పండించడం ఆయన ప్రత్యేకత. అంటుకట్టడం ద్వారా ఒకే మామిడి చెట్టుకు అత్యధికంగా 7 రకాల మామిడికాయలను పండిస్తున్నారు. 8 రకాల జామకాయలు, 16 రకాల సీతాఫలాలు, బత్తాయి, కమల, నారింజ, ద్రాక్ష, పంపర పనస, 10 రకాల అరటికాయలు, 5 రకాల పనస, 4 రకాల సపోట, 4 రకాల నిమ్మకాయలు, 2 రకాల వాటర్‌ ఆపిల్‌, నేరేడు, ఆల్‌బకరా, స్టార్‌ఫ్రూట్‌, 5 రకాల ఉసిరి, 4 రకాల మునగను వ్యవసాయక్షేత్రంలో పండిస్తున్నారు. ఇటీవల డురియన్‌, బాదాం మొక్కలను నాటారు. కూరగాయ, పూలమొక్కలను పెంచుతున్నారు. వీటన్నింటిని ఆర్గానిక్‌ పద్ధతిలో పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వెంకటపతిరాజు ప్రతి రోజు 6-8 గంటల పాటు వ్యవసాయక్షేత్రంలో కూలీలతో పాటు పనిచేస్తారు. ఇక్కడ పండే పండ్లు, కూరగాయలు ఎప్పుడూ మార్కెట్‌లో విక్రయించలేదు.  పక్షులు తిన్నాక మిగిలినవి కొంత ఇంటికి, మిగతావి స్నేహితులకు పంచుతున్నారు. తన భార్య, ఇద్దరు పిల్లలంటే ఎంత ఇష్టమో మొక్కలన్నా అంతే ఇష్టమని  ఆయన పేర్కొన్నారు. - దుండిగల్‌(హైదరాబాద్‌), న్యూస్‌టుడే 74 ఏళ్ల వయసులో  ఆరు పలకల దేహం మంచిర్యాల క్రీడావిభాగం, న్యూస్‌టుడే: నేటి యువత ఉదయంలేచి కాస్త వ్యాయామం చేయమంటే బద్ధకిస్తుంటారు. మైదానం వంక చూడని వారు సైతం ఉన్నారు. అటువంటిది ఇక్కడ బార్‌ కొడుతున్న వ్యక్తి పేరు సాంబయ్య.  ఏడు పదుల వయస్సులో కూడా ఆరు పలకల దేహానికి సాధన చేసి సఫలీకృతుడయ్యారు. ప్రస్తుతం ఈయనకు 74 ఏళ్లు. ఈ వయస్సులో కూడా యువకులే తటపటాయిస్తూ చేసే ఆసనాలను ఈయన అవలీలగా వేస్తుంటారు. గత ముప్పై ఏళ్లలో తలనొప్పి కూడా ఎరుగనని, కేవలం వ్యాయామం చేయడంతోనే ఇది సాధ్యమైందని గర్వంగా చెబుతుంటారు. వ్యాయామ అధ్యాపకుడిగా విధులు నిర్వర్తించిన మంచిర్యాల వాస్తవ్యుడు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానానికి అందరికంటే ముందు సాధనకు వచ్చి చివరగా వెళ్తారు. జిల్లా ప్రజలు ఈయనను ఆదర్శంగా చూపిస్తూ ఇతరులకు సూచనలిస్తుంటారు. అలుపెరగని యోధుడు మంచిర్యాల జిల్లా పాతమంచిర్యాలకు చెందిన తూముల వెంకట్రామయ్య  ఏడుపదుల వయస్సు వచ్చాక కూడా యువకుడిలా చలాకీగా ఉంటారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రస్తుతం రైతు అవతారమెత్తారు. ప్రస్తుతం రోజులో సగానికంటే ఎక్కువ సమయం వ్యవసాయ పనులకే కేటాయిస్తున్నారు. దీనికి తోడు ఎడ్లబండి పోటీలు ఎక్కడ జరిగినా పాల్గొనడం.. ఆనవాయితీగా ప్రథమ స్థానంలో నిలవడం ఆయనకు సర్వ సాధారణంగా మారింది. సొంత జిల్లాలోనే కాదు ఇతర జిల్లాలో కూడా పాల్గొంటూ బహుమతులు పొందుతున్నారు. ఇప్పటివరకు 28 సార్లు ప్రథమంలో, 8సార్లు రెండవస్థానం, మరో ఐదుసార్లు ఆ తర్వాత స్థానంలో నిలిచారు. ఈ విజయాలు చూస్తుంటే శారీరకంగా, మానసికంగా ఆయన ఎంత దృఢంగా ఉన్నారో అర్థమవుతుంది. కొన్ని ఏళ్ల కిందట మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ స్థానిక యోగా శిక్షకుడు కృష్ణారెడ్డిని కలిసారు. ఆయన సూచనతో మొక్కవోని దీక్షతో నిరంతరాయంగా సాధన చేయడం మొదలుపెట్టారు. మోకాళ్ల నొప్పులే కాకుండా తనకున్న ఇతర వ్యాధులను సైతం నియంత్రరణలో పెట్టుకోగలిగారు. గత 14 ఏళ్లుగా  కొనసాగిస్తూ నేటి వరకు ఎటువంటి వ్యాధిని దరిచేయనీయకుండా ఉత్సాహంగా ఉంటున్నారు. చదువుపై మక్కువ.. తీరింది కోరిక.. ఒకవైపు భర్త ఇచ్చిన ధైర్యం..  చదువుపై ఉన్న మమకారం.. ఆమెను 60 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా అందుకునేలా చేసింది. ఐపీఎస్‌ మాజీ అధికారి వ్యాస్‌ భార్య అరుణవ్యాస్‌ ఈ ఘనత సాధించారు. వ్యాస్‌ మరణంతో తీవ్ర మనోవేదనకు గురైనా.. ఆయన ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగారు. మద్రాస్‌లో పుట్టి పెరిగిన అరుణావ్యాస్‌.. ఉన్నత విద్య తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఇంగ్లీష్‌లో మాస్టర్స్‌ చేశారు. . అనంతరం వ్యాస్‌తో వివాహం కావడంతో చదువుకు విరామమిచ్చి గృహిణిగా స్థిరపడ్డారు. భర్త వ్యాస్‌ మరణం తర్వాత మనోస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగి కుటుంబాన్ని నడుపుతూ చదువుపై మరోసారి ఆసక్తి చూపారు. 60 ఏళ్ల వయసులో రామాయణంపై పీహెచ్‌డీ చేశారు. రామాయణంలో ఒక్కొక్క పాత్రను మలిచిన తీరుపై ‘రామాయణం.. ఎ టైమ్‌లెస్‌ ఒడిస్సీ ఇన్‌ సైకాలజీ’ పేరిట పరిశోధన పత్రం(పుస్తకం) సమర్పించారు. ఇందుకుగాను ప్రముఖ దర్శకుడు బాపు ప్రత్యేకంగా రామాయణంపై చిత్రాలు వేసి పంపించారు. కుమారుడు శ్రీవాత్సవతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తరగతులకు వెళ్లేవారు. అలాగే  సంస్కృతంలోనూ వివిధ కోర్సులు చేశారు. ప్రముఖ దినపత్రికల్లో ఆధ్యాత్మిక, సాంకేతిక, సామాజిక వ్యాసాలు రాశారు. - ఈనాడు, హైదరాబాద్‌ చదువుకోవాలనే తపన ఉండాలనే గానీ  వయస్సు అడ్డంకికాదని నిరూపించారు విజయవాడకు చెందిన కోనేరు లక్ష్మీప్రమీల. పదో తరగతి  ప్రథమశ్రేణిలో పాసయ్యాక లక్ష్మీప్రమీలకు 18 ఏళ్లకే పెళ్లి చేశారు. భర్త కోనేరు శివ సత్యన్నారాయణ రైల్వేలో పనిచేసేవారు. హైదరాబాద్‌లో ఉద్యోగం. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరూ స్థిరపడ్డారు.  భర్త ఉద్యోగవిరమణ అనంతరం విజయవాడ వెటర్నరీ కాలనీకు వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ నుంచే ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఐదుపదుల వయస్సులో యోగాపై దృష్టి పెట్టారు. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో డిగ్రీ, తర్వాత పీజీ పూర్తి చేశారు. తర్వాత చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రం పీఠం నుంచి ఎం.ఫిల్‌. పూర్తి చేశారు. 2016 డిసెంబరులో పీహెచ్‌డీ చేశారు.  తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు మల్టీ టాలెంటెడ్‌ ఉమన్‌గా ప్రమీలను గుర్తించింది. ఇటీవల రాష్ట్ర సృజన్మాకత, సంస్కృతి సమితి ఆమె రాసి ‘ఆంధ్రప్రదేశ్‌లో పేరంటాళ్లు’ పుస్తకాన్ని ఉత్తమ పరిశోధక గ్రంథంగా ఎంపిక చేసింది. ఇదే స్ఫూర్తితో తన స్వగ్రామం గుంటూరు జిల్లా వేమూరు చరిత్ర వెలికితేసే పుస్తకానికి శ్రీకారం చుట్టారు. అక్కడి స్థితిగతులు, రాజుల పరిపాలన అంశాలను క్రోడీకరిస్తూ దానికి తుదిరూపం ఇస్తున్నారు. ఆమె ఇచ్చిన ప్రోద్బలం, స్ఫూర్తితో ఇంటర్‌ విద్యను అర్ధంతరంగా ఆపేసిన పెద్ద కోడలు డిగ్రీ, పీజీ పూర్తి చేయడం విశేషం. - కరెన్సీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే 74ఏళ్ల వయస్సులో రామా..కృష్ణా అని కూర్చోకుండా పి.హెచ్‌.డి చేసి ‘డాక్టర్‌ ఆత్మకురి మంగళగౌరి’ అనిపించుకున్నారు ఆమె.. భర్త ప్రోత్సాహంతో....! ఎ.ఎస్‌.రాజ ఈ పేరు తెలియని వారు విశాఖపట్నంలో ఎవరూ ఉండరు. అతని సతీమణి మంగళగౌరి మద్రాస్‌ క్వీన్‌ మేరీస్‌ కళాశాలలో బి.ఎస్సీ హోమ్‌ సైన్స్‌ చేశారు. వివాహానంతరం విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖలో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఎ సంస్కృతం, ఎం.ఎ మ్యూజిక్‌ చేశారు. ఇంతచదువు చదివాక ఖాళీగా కూర్చోకుండా నగరంలో పలు కచేరీలు చేసేవారు. ఇందుకు తన భర్త, అత్త ప్రోత్సాహం ఉందని మంగళగౌరి తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ వచ్చిన సమయంలో ప్రార్థనాగీతం పాడి ఆమె ప్రశంసలు అందుకున్నారు. 70ఏళ్ల నిండాక తాను నేర్చుకున్న కళకు, తనకు అమితంగా ఇష్టమైన ప్రముఖ వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలపై పరిశోధన చేయాలనిపించింది. అందుకు కుటుంబ సభ్యులు ప్రోత్సాహాన్ని అందించారు. 2006లో 74ఏళ్ల ప్రాయంలో అరుందతి సర్కార్‌ పర్యవేక్షణలో ‘ది డివైన్‌ మూజికల్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ శ్రీ ముత్తుస్వామి దిక్షితార్‌’ అన్న ఆంగ్ల గ్రంథం రచించడం ద్వారా ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి పి.హెచ్‌.డి డిగ్రీ పొందారు. ప్రస్తుతం 87ఏళ్ల వయస్సులో వార్థిక్యంలో ఉన్నప్పటికి ప్రతిరోజు మూడు గంటలపాటు ఆంగ్ల, తెలుగు పత్రికలతో పాటు పుస్తకాలు చదవడం కాలక్షేపంగా పెట్టుకున్నారు.  అన్ని కళల పరమార్ధం ఒక్కటేనని తన భర్త చెబుతుండేవారని గౌరి పేర్కొన్నారు. ఆయన కాలం చెల్లాక పదేళ్లపాటు కళాభారతిలో ఉత్తరాంధ్ర నాటకపోటీలు నిర్వహించి నాటకాలు సజీవంగా నిలిపారు. ఇప్పటికీ కళాభారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళుతుంటారు. - ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం జనాభా సుమారు 9.10 కోట్లువీరిలో వయోపౌరులు  1.09 కోట్లురెండు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వారు 12%ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఏపీలో  4 లక్షలు తెలంగాణ  3 లక్షలు మిగతా వారిలో ప్రైవేటు ఉద్యోగాలు చేసి పదవీవిమరణ చేసినవారు అధికంగానే ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి వారిలో కొందరు తమ విశ్రాంత దశను ప్రయోగాత్మకంగా.. గతంలో వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా గడుపుతున్నారు. కొందరు తాము ఎప్పుడో యుక్త వయసులో అనుకున్న లక్ష్యాలను.. ఇప్పుడు చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.