close

మంగళవారం, జులై 16, 2019

ప్రధానాంశాలు

ఆలూరులో భారీ వర్షం

పొంగి పొర్లిన వాగులు, వంకలు

 కురవళ్లి వద్ద తెగిన ప్రధాన రహదారి

 వాహన రాకపోకలకు అంతరాయం

విస్తారంగా వర్షాలు

● 26 మండలాల్లో సగటున 7.3 మి.మీ. వర్షం

 
ఆలూరు : కొట్టుకుపోయిన ఆలూరు-బళ్లారి ప్రధాన రహదారి

ఆలూరు, న్యూస్‌టుడే : జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాదాపు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆలూరు నుంచి మొలగవల్లి, కమ్మరచేడు నుంచి కురుకుందకు వెళ్లే మార్గాల్లోని వాగులపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. ఇదే విధంగా ఆలూరు నుంచి గుంతకల్లు మార్గంలోని కళ్లివంక వాగులో వరద నీరు భారీ ఎత్తున ప్రవహించింది. ఆలూరులోని కార్యాలయాలు, పాఠశాలలు, వీధులు జలమయమయ్యాయి. ప్రధానంగా ఆదర్శ పాఠశాల వద్ద వర్షం నీరు నిలబడటంతో విద్యార్థులు రాకపోకలు కొనసాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. పాఠశాల మైదానంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఆడుకునేందుకు వీలు లేకుండా పోయింది. అగ్నిమాపక శాఖ, సహాయ సాంఘీక సంక్షేమ కార్యాలయాల ఆవరణలో నీరు నిలబడటంతో అధికారులు రాకపోకలు కొనసాగించేందుకు ఇబ్బందులు పడ్డారు.

తెగిపోయిన సంబంధాలు

కురిసిన భారీ వర్షానికి మండలంలోని కురవళ్లి వద్ద బళ్లారి వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురైంది. చెరువులో నుంచి పెద్ద ఎత్తున నీరు బయటికి రావడంతో రహదారి తెగిపోయింది. కురవళ్లి, హాలహర్వి మీదుగా బళ్లారి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. రహదారి తెగిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బళ్లారి నుంచి వచ్చే ప్రయాణికులు కురవళ్లి గ్రామంలో దిగి చెరువు కట్ట మీద నుంచి కొంత దూరం నీళ్లలో నడుచుకుంటూ ఇవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ద్విచక్ర వాహనదారులు కూడా అతి కష్టం మీద నీటిలోనే ఆలూరుకు వెళ్లారు. జాతీయ రహదారిని త్వరగా పూర్తి చేయకుండా వదిలేయడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, పాలకులు స్పందించి రహదారి నిర్మాణం జరిగేలా చూడాలని కోరుతున్నారు.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు 26 మండలాల్లో వర్షం కురిసింది. ఆలూరు మండలంలో అత్యధికంగా 80.8 మిల్లీ మీటర్ల(8 సెంటీమీటర్ల) వర్షం కురిసింది. హాలహర్వి 44.6, ఆదోని 42.6, ప్యాపిలి 27.8, బనగానపల్లె 24.2, నందికొట్కూరు 21, రుద్రవరం 20, కౌతాళం 16.4, హొళగుంద 15.4, మిడుతూరు 15.2, ఓర్వకల్లు 12.2, కోసిగి 10.2, బేతంచర్ల 10, కోడుమూరు 9.8, సంజామల, అవుకు 7.6, మంత్రాలయం 6.2, ఆళ్లగడ్డ 4, కల్లూరు 3.6, శ్రీశైలం 3, పాణ్యం 2.4, వెలుగోడు 2.2, ఆస్పరి, చాగలమర్రి 2, కర్నూలు 1.4, నందవరం 1, మ్తొతం 26 మండలాల్లో 393.2 మి.మీ వర్షం కురవగా జిల్లా సగటున 7.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఈనెల సాధారణ వర్షపాతం 77.2 మి.మీ కాగా ఇప్పటి వరకు 54.2 మి.మీ నమోదైంది. -30 వర్షపాతం లోటు నెలకొంది. ఈ వర్షాల రాకతో అన్నదాతలు పొలంబాట పట్టారు. దుక్కులు దున్నడం, విత్తనాలు విత్తుకోవడం తదితర పనులతో కర్షకులు తీరికలేకుండా ఉన్నారు.

 
ఆలూరు : కురవళ్లి వద్ద తెగిన ప్రధాన రహదారి

 
ఆలూరు : వర్షం నీటిలో వస్తున్న ఆదర్శ పాఠశాల విద్యార్థులు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.