close

శనివారం, జులై 20, 2019

ప్రధానాంశాలు

నకిలీ.. చలామనీ

జిల్లాలో ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు

  విపణిలో పెద్దఎత్తున అమ్మకాలు 

 తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు

 
పత్తి విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీ చేస్తున్న అధికారులు (పాత చిత్రం)

 

అమాయకులైన రైతులకు అక్రమార్కులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. వీటిని నమ్మి విత్తు వేసిన అన్నదాతలకు కన్నీరే మిగులుతోంది. విత్తనాలు మొలకెత్తక.. ఆశించినస్థాయిలో దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోతున్నారు.

ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు ముంచెత్తుతున్నాయి. విజిలెన్స్‌ అధికారులు మాత్రం దాడులు జరుపుతూ నకిలీల ఆట కట్టిస్తున్నా పూర్తిస్థాయిలో నియంత్రించలేని పరిస్థితి.

నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సిన వ్యవసాయాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విస్తృతంగా దాడులు జరిపి నకిలీ విత్తనాలను అరికట్టాల్సి ఉండగా ఆ దిశగా దృష్టి సారించడం లేదు.

నైరుతి రుతు పవనాలు విస్తరించడంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. మరోవైపు నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా నకిలీ పత్తి విత్తనాలు విపణిని ముంచెత్తుతున్నాయి. జిల్లాలో గతేడాది రైతులు 2.50 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో సైతం పత్తిదే అగ్రభాగమని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో 13.10 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయశాఖ జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలో ఆయా కంపెనీల ద్వారా ఈ పత్తి విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు అనుమతి లేని హెచ్‌టీ (హెర్బిసైడ్‌ టాలరెంట్‌) పత్తి విత్తనాలను బీటీ-2 పేరుతో మార్కెట్‌లోకి తెచ్చి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాపారం పశ్చిమ ప్రాంతంతోపాటు జిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతుండడం గమనార్హం.

- న్యూస్‌టుడే-కర్నూలు సచివాలయం

వ్యవసాయశాఖ నుంచి అనుమతులు పొందిన డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉండగా జిన్నింగ్‌, విడి పత్తి విత్తనాల విక్రయాలు చాపకింద నీరులా అమ్మకాలు సాగుతున్నాయి. అయినప్పటికీ వ్యవసాయాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కోసిగి మండలం పల్లెపాడు, మంత్రాలయం, కౌతాళం, ఆదోని, హాలహర్వి, హొళగుంద తదితర ప్రాంతాల్లో లూజు విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది.

●* పల్లెపాడులో ఈనెల మొదటి వారంలో రూ.కోటికిపైగా విలువ చేసే పత్తి విత్తనాల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా గుజరాత్‌ నుంచి విత్తనాలు దిగుమతి చేస్తున్నారు. అరుణోదయ, శ్రీమంతుడు తదితర పేర్లతో ప్యాకింగ్‌ చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. పల్లెల్లో అక్రమ బీటీ పత్తి విత్తనాల నిల్వలు ఎక్కువగా ఉన్నాయన్న విషయం వ్యవసాయాధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

*● ఈనెల 17న కల్లూరు పారిశ్రామికవాడలో విఘ్నేశ్వర ఆగ్రోటెక్‌ సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో మార్కివ్‌ సీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి చెందిన బీటీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారం విజిలెన్స్‌ దాడుల్లో బయటపడింది. అహ్మదాబాద్‌, గుజరాత్‌ నుంచి బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు తెప్పించి కర్నూలులో విక్రయించినట్లు కంపెనీ వారు చెబుతున్నారు. విత్తన ప్యాకెట్లపై ప్యాకింగ్‌ వివరాలు నమోదు చేయకుండా.. స్టాక్‌ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయకుండా జోరుగా వ్యాపారం చేస్తుండడం గమనార్హం. ఇక్కడ సైతం పెద్దఎత్తున విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

*● ఈనెల 18న కల్లూరు పారిశ్రామికవాడలో విజిలెన్స్‌ బృందాలు సహజ క్రాస్‌ కేర్‌ సెన్సెస్‌, కృష్ణా కావేరీ సీడ్స్‌, ధనలక్ష్మి సీడ్స్‌, గౌతం సీడ్స్‌, ప్రాసెసింగ్‌ యూనిట్లలో తనిఖీలు చేసి పలు లోపాలను గుర్తించి రూ.1.80 కోట్ల విలువ చేసే 24,707 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సీజ్‌ చేశాయి.

*● నంద్యాల పట్టణంలో ఈనెల 15న మహాలక్ష్మి సీడ్స్‌ ప్రాసెసింగ్‌ ప్లాంటు, న్యూ వెంకటేశ్వర సీడ్స్‌, జగదీష్‌, మహాలక్ష్మి ఆగ్రో సీడ్స్‌, దత్తాత్రేయ సీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి రూ.2.14 కోట్ల విలువైన వరి విత్తనాల అమ్మకాలను ఆపేశారు.

జిల్లాలో ఇప్పటివరకు రూ.19.83 కోట్ల విలువైన 4,879.36 క్వింటాళ్ల పత్తి విత్తనాలు తాత్కాలిక నిలుపుదల (స్టాప్‌ సేల్‌) చేశారు. రూ.87.10 లక్షల విలువ చేసే 37.687 క్వింటాళ్ల విత్తనాలను సీజ్‌ చేశారు. ఆరు విత్తన కంపెనీలపై 6(ఏ) కేసులు నమోదు చేశారు.

తనిఖీలు నామమాత్రమే..

జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత మే నెలలో సబ్‌ డివిజన్లవారీగా స్థానికంగా పనిచేసే ఏడీఏలనుకాక ఇతర డివిజన్ల నుంచి ఏడీఏలను విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్ల తనిఖీలకు నియమించారు. వారిపై పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్లవారీగా డీడీఏలను.. వారితోపాటు ఏడీఏలను తనిఖీలకు నియమించారు. ఎన్నికలకు ముందు ఈ బృందాలు తనిఖీలు చేశాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత మే నుంచి ఇప్పటివరకు విజిలెన్స్‌ అధికారుల దాడుల్లోనే నకిలీ, అనుమతులు లేని విత్తనాలు పట్టుబడుతున్నాయి. నంద్యాల ప్రాంతంలో పత్తి, వరి తదితర విత్తనాల తనిఖీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా తనిఖీలు పూర్తిస్థాయిలో కనిపించడం లేదు.

6(ఏ) కేసులతోనే సరి

గతేడాది బనగానపల్లి మండలంలో నకిలీ వరి విత్తనాలను రైతులకు అంటగట్టిన విత్తన విక్రయ డీలరుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్వయాన బదిలీపై వెళ్లిన కలెక్టర్‌ పలుమార్లు వ్యవసాయాధికారులను మందలించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆ రైతులు నేటికీ తమకు నష్టపరిహారం చెల్లించాలని, విత్తన డీలరుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

*● విత్తన చట్టం 6(ఏ) కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలున్నాయి. సదరు విత్తన కంపెనీలపై కఠినచర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఏటా నష్టపోతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఇచ్చిన రాయితీ వేరుసెనగ విత్తనాలను నాసిరకంగా.. నాణ్యత ప్రమాణాలు లేని వాటిని రైతులకు సరఫరా చేశారు.

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

అనుమతులు లేని, నాణ్యత ప్రమాణాలు లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన డీలర్లపై కఠినచర్యలు తీసుకుంటాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలి. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే సదరు డీలరుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. విత్తన ప్రాసెసింగ్‌ కేంద్రాలు, విత్తన కంపెనీలపై విస్తృతంగా తనిఖీలు చేయిస్తున్నాం. లైసెన్సులు, అనుమతులు లేని విత్తనాలు దొరికితే తక్షణమే స్టాప్‌ సేల్‌ (విత్తన విక్రయాలు నిలుపుదల) చేస్తున్నాం.

- ఠాగూర్‌నాయక్‌, వ్యవసాయశాఖ జేడీ

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.