close

బుధవారం, అక్టోబర్ 16, 2019

ప్రధానాంశాలు

బీమా... చేయిద్దామా వద్దా!

 పంట పోయినా ఆదరణ లేకపోవడంతో వెనుకంజ
 అన్నదాతలకు స్పష్టత ఇవ్వలేకపోతున్న అధికారులు
 పరిహారం కోసం మూడేళ్లుగా ఎదురుచూపు
న్యూస్‌టుడే, బషీరాబాద్‌

* బషీరాబాద్‌ మండలం జీవన్గీకి చెందిన రైతు నర్సింహులు నిరుడు ఎనిమిది ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. బ్యాంకులో రుణం తీసుకోవడంతో బీమా కోసం సుమారు రూ.13 వేలు చెల్లించారు. మరో నాలుగు ఎకరాల్లో కంది పంటకు బీమా సైతం చేయించారు. వర్షాభావం కారణంగా పత్తి యాభై శాతమే దిగుబడి రాగా కంది కాత దశలోనే నిలువునా ఎండిపోయింది. బీమా వర్తింపజేయాలని పలుమార్లు వ్యవసాయశాఖ, బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా ప్రయోజనం దక్కలేదు.
* యాలాల మండలానికి చెందిన మరో రైతుకు చెందిన నాలుగు ఎకరాల వరి పైరుకు రెండేళ్ల క్రితం కోత దశలో సుడిదోమ సోకింది. దాంతో పంటంతా ఎండిపోుంది. బీమా ప్రీమియం చెల్లించడంతో బ్యాంకు అధికారులు, కంపెనీ ప్రతినిధులను సంప్రదించి పరిహారం అందించాలని కోరారు. రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు నష్ట పరిహారం అందలేదు.

ప్రస్తుతం వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. జూన్‌ మొదటి వారంలో కురిసిన అడపాదడపా వర్షాలకు నాలుగు మండలాల రైతులు విత్తనాలు వేసుకున్నారు. మిగిలిన వారు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. వర్షాభావ సమస్య ఒకెత్తయితే, పంట చేతికొచ్చే వరకు చీడపీడల నివారణ, వాతావరణ ప్రతికూలతతో పంట చేతికొచ్చే ధీమా తగ్గింది. పంటలకు నష్టం జరిగితే మేమున్నామంటూ మాటల్లో భరోసా ఇచ్చే బీమా కంపెనీల ప్రతినిధులు చివరికి చేతులెత్తేస్తున్నారు. పంటలు పాడవుతున్నా... తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రతి ఏడాది ప్రీమియం చెల్లిస్తున్నా పరిహారమే మాత్రం అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఈసారి పంట బీమా చేయించుకోవాలా.. వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు.

బాధ్యత ఎవరు తీసుకుంటారు...!
పంట ప్రీమియం చెల్లించాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పంట పాడైతే మాత్రం తమకు సంబంధం లేదని బీమా కంపెనీలను సంప్రదించాలని సూచిస్తున్నారు. విత్తనాలు వేసే సమయంలోనే బీమా సంస్థల ప్రతినిధులను సంప్రదిస్తే బ్యాంకు రుణం ద్వారా ప్రీమియం చెల్లించాలని, లేదంటే ఆన్‌లైన్‌లో సొమ్ము జమ చేయాలని చెబుతున్నారు. ప్రీమియంను ఆన్‌లైన్‌లో పంపిస్తే... పంట పోయిన తర్వాత ఎవరిని అడగాలి.. పరిహారం ఎలా పొందాలనే విషయాలపైన అటు వ్యవసాయశాఖ, ఇటు కంపెనీ ప్రతినిధులు ఇద్దరూ రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఏళ్ల తరబడి ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ ఒక్క ఏడాదైనా తమకు పరిహారం అందలేదని పెదవి విరుస్తున్నారు.

అవగాహన లేకపోవడం సమస్య
ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకం అని రెండు రకాల పంట బీమాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కంది, మినుము, పెసర, సోయా, మొక్కజొన్నలకు ఫసల్‌ బీమా వర్తింపజేస్తుండగా, పత్తి, వరి పంటలకు వాతావరణ ఆధారిత బీమాను వర్తింపజేస్తున్నారు. మొక్కజొన్న పంటకు గ్రామ యూనిట్‌గా, మిగిలిన పంటలకు మండల యూనిట్‌గా పరిహారం చెల్లిస్తారు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదు ప్రకారం తక్కువ వర్షపాతం నమోదైతే పత్తి, వరికి పరిహారం అందించే అవకాశం ఉంది. పత్తి, వరి పాడైందని మనం ఎంత మొరపెట్టుకున్నా... వర్షపాతం ప్రకారం నమోదులో తేడా ఉంటే పరిహారం వచ్చే అవకాశం లేదు. మిగిలిన పంటలకు గ్రామ యూనిట్‌గా బీమాను చెల్లిస్తారు. ఉదాహరణకు గ్రామంలో అందరి పంటలు 60 శాతానికిపైగా పాడైతేనే పరిహారం అందే అవకాశం ఉంది. అందరితో సమానంగా పరిహారం చెల్లిస్తారు. తన పంట పాడైంది.. తనకు పరిహారం ఇవ్వాలని కోరితే పరిహారం అందే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. పంటలు పాడైన వెంటనే అధికారులకు టోల్‌ఫ్రీ సంఖ్య ద్వారా సమాచారం అందించాల్సి ఉంటుంది.

రుణం తీసుకుంటేనే ప్రీమియం
జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా రైతులు రుణాలు తీసుకుంటేనే ప్రీమియం మినహాయించుకుంటారు. లేకపోతే చాలామంది రైతులు వ్యక్తిగతంగా పంట బీమా చేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మూడేళ్ల క్రితం రైతులు డీడీలు తీసి వ్యవసాయాధికారులకు అందజేశారు. పంట పాడైందని.. గ్రామానికి వచ్చి పరిశీలించాలని వారిని కోరితే స్పందన లేకపోవడంతో నాటి నుంచి బీమా చెల్లించడమే మానేశారు. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 1.72 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాధారణ సాగు ఉంటుంది. అయితే సుమారు 1.55 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.90 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రతి ఏడాది బ్యాంకుల ద్వారా 1.30 లక్షల మంది వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏ మండలంలోనూ వ్యక్తిగతంగా పంట బీమా డీడీలు ఇవ్వలేదని ఆయా మండలాల వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

 

బీమా చేయించుకోవాలని వివరిస్తున్నాం

 

-నాగం కృష్ణ, వ్యవసాయాధికారి, బషీరాబాద్‌
ప్రతి రైతు తప్పకుండా పంట బీమా చేయించుకోవాలని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. బ్యాంకుల్లో రుణం తీసుకుంటే బ్యాంకు అధికారులే ప్రీమియం మినహాయించుకుంటారు. రుణం తీసుకోలేని వారు వ్యక్తిగతంగా ‘అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’ పేరిట డీడీ తీసి ఏఈఓలకు లేదా వ్యవసాయశాఖ కార్యాలయంలో అందించాలి. ఏదైనా సందేహాలుంటే గ్రామ ఏఈఓలను సంప్రదించాలి.

ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు
-సుమలత, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజరు
జిల్లాలో ఇప్పటి వరకు ఈఏడాదికి సంబంధించి పంట బీమా పరిహారం ఎవరికీ అందలేదు. బ్యాంకుల ద్వారా ప్రీమియం చెల్లించిన వారి వివరాలు ఎప్పటికప్పుడు సంబంధత బీమా కంపెనీకి చేరుతాయి. నిబంధనల ప్రకారం పంట పాడైతే బీమా వర్తిస్తుంది. వాతావరణ ఆధారిత బీమా, ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన అమల్లో ఉన్నాయి. రైతులకు సంబంధించిన పరిహారం వస్తే వారి ఖాతాల్లో జమ చేస్తాం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.