మంగళవారం, డిసెంబర్ 10, 2019
వర్షాకాలంలో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కలిసి పనిచేయండి: నగర సీపీ
ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు వారాంతపు సెలవును వచ్చేవారం నుంచి అమలు చేయనున్నామని కొత్వాల్ అంజనీ కుమార్ సోమవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో అన్నారు. నగరంలోని శాంతిభద్రతలు, ట్రాఫిక్, వర్షాల్లో విధుల నిర్వహణ, డ్రగ్స్ ముఠాల నియంత్రణపై ఆయన సోమవారం కమిషనరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొన్ని విభాగాల్లో పోలీస్ అధికారులు ఇప్పటికే వారాంతపు సెలవులు తీసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రతి పోలీస్ ఠాణాలో పనిచేస్తున్న వారందరికీ వారంతపు సెలవు ఇవ్వాలన్నది తమ ఉద్దేశమని అధికారులు, సిబ్బందికి చెప్పారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వారంలో ఒకరోజు కుటుంబ సభ్యులతో గడిపితే పోలీస్ కుటుంబమంతా సంతోషిస్తుందన్నారు. శాంతిభద్రల పోలీసులు విధి నిర్వహణలో ఎలా కష్ట పడతారు? కుటుంబ సభ్యులతో గడిపేందుకు వారికి సమయం ఎలా అనుకూలించదు? అన్న అంశాలను స్వయంగా కుటుంబ సభ్యులు తెలుసుకునేందుకు ప్రతి పోలీస్ ఠాణాలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించామని వివరించారు. ఎవరికి ఏ రోజు సెలవు ఇవ్వాలి? ఎలా సెలవు తీసుకోవాలి? అన్న అంశాలపై కసరత్తు చేస్తున్నామని నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చాక ఆ నిర్ణయాన్ని అందరితోనూ పంచుకుంటామని తెలిపారు.
ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా...
రుతుపవనాలు మొదలైన నేపథ్యంలో సాయంత్రాల్లోనే భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సీపీ అంజనీకుమార్ అన్నారు. రహదారులు జలమయమైనా వెంటనే వాటిని డ్రైన్లు, లోతట్టు ప్రాంతాలకు పంపించేందుకు జీహెచ్ఎంసీ సహకారం తీసుకోవాలని, శాంతిభద్రతల పోలీసులు కలిసి పనిచేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే వాననీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. వర్షం పడుతున్నప్పుడు, రోడ్లపై నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు అప్రమత్తంగా ఉండి భారీ వాహనాలు, ఆటోలు ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలక్కుండా పర్యవేక్షించాలని, వర్షం వస్తుందన్న సమాచారం అందగానే ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించే అవకాశాలున్నాయో తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించాలన్నారు. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో వాణిజ్య ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ ఉంటే వాటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను వెంటనే తీసేయించాలన్నారు. నగరంలో మాదక ద్రవ్యాల విక్రయాన్ని కట్టడి చేసేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. అదృశ్యం, అపహరణ ఫిర్యాదులొస్తే వెంటనే అప్రమత్తమై కంట్రోల్‌రూంకు, ఉన్నతాధికారులకు విషయాన్ని వివరించాలని సూచించారు. అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్, సంయుక్త కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు