close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

పది దాటితే ప్రయాణ నరకం! 

రాత్రి వేళ  నడిరోడ్డుపై నిత్యం ప్రయాణికుల అవస్థలు 
ప్రధాన మార్గాల్లోనూ బస్సులు ఉండని పరిస్థితి 
శివార్లకు వెళ్లాలంటే అంతే సంగతి 
మెట్రో, ఎంఎంటీఎస్‌ల సేవలూ 10.30 వరకే పరిమితం 
ఈనాడు, హైదరాబాద్‌

మహా నగరం నిద్ర ఎరుగదు. 24 శ్రీ 7 పనిచేసే ఉద్యోగులతో ఒకటే సందడి. రహదారులు పగలు, రాత్రి తేడా లేకుండా జనసంచారంతో కనిపిస్తూనే ఉంటాయి. వేలాది ప్రైవేట్‌ సంస్థల్లో విధులు నిర్వహించేవారు,  పనులపై వివిధ ప్రాంతాలకు వచ్చి తిరుగుముఖం పట్టేవారు కూడళ్లలో అర్ధరాత్రయినా వాహనాల కోసం పడిగాపులు కాస్తూనే ఉంటారు. ఇక కొంతమంది ఉద్యోగులైతే అర్ధరాత్రి వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ సౌలభ్యంగా ఏ సమయంలోనైనా ప్రయాణించేందుకు ప్రజా రవాణా అందుబాటులో ఉందా?  ఊహు.. లేనే లేదు..  రాత్రి 10 గంటలకే ఆర్టీసీ బస్సులు పడకేస్తున్నాయి. 


మెట్రోతో ప్రయాణ కష్టాలు కొంతైనా తీరుతాయనుకుంటే.. అవీ రాత్రి 10.30కు చివరి ట్రిప్పులు ముగిస్తున్నాయి. అతి తక్కువ టిక్కెట్‌ ధరతో సేవలందించే 
ఎంఎంటీఎస్‌ రైళ్లు ఇదే సమయానికి పరుగులాపేస్తున్నాయి.\ 


వెరసి ప్రయాణికులు ఈసురోమంటున్నారు. కనీసం రాత్రి 12 వరకైనా కొన్ని కీలక రూట్లలో రవాణా సౌకర్యం ఉండాలని కోరుకుంటున్నారు.  వీరి డిమాండ్‌ ఆర్టీసీకి కనిపిస్తుందా? మెట్రో చెవిన పడుతుందా? ఎంఎంటీఎస్‌కు వినిపిస్తుందా? 


నగర వ్యాప్తంగా అత్యధికమంది ప్రయాణించే కూడళ్ల  వద్ద పరిస్థితి ఎలా ఉందో ‘న్యూస్‌టుడే’ బృందాలు రాత్రి 9 నుంచి 12 వరకు గత రెండురోజులపాటు పరిశీలించాయి. అంతటా ప్రయాణ అవస్థలే. 

రాత్రి పది తర్వాత వస్తాయో రావో తెలియని బస్సుల కోసం రోడ్లపై వేచి ఉండడం ఎంత నరకప్రాయమో నగరవాసులు నిత్యం చవిచూస్తున్నారు. చూసి చూసి ప్రైవేట్‌ వాహనదారులు అడిగినంత చేతిలో పెట్టి ప్రయాణిస్తే తప్ప ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి. 9 నుంచి 10 గంటల మధ్య విధులు ముగించుకొని డిపోలకు పరుగులుతీసే బస్సులు తప్ప వేరేవీ కనిపించడంలేదని వాపోతున్నారు. నగరం ఎటు చూసినా 50 కిలోమీటర్ల మేర విస్తరించిన వేళ లక్షలాది మంది శివారు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఇటీవల ఆర్టీసీ శివార్లను కలుపుతూ బస్సులు వేయడం బాగానే ఉన్నా ఇవి రాత్రి 9 దాటితే ఉండడంలేదు. చివరివరకూ వెళ్తాయిలే అనుకున్న బస్సులు మధ్యలోనే  వెనక్కి వచ్చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌ వరకైనా రాత్రి 12 వరకు మెట్రో రైళ్లు పరుగులు పెడతాయని భావిస్తే అన్ని ప్రజారవాణా వ్యవస్థలకంటే ముందే ఆగిపోతున్నాయి. చివరి ట్రిప్పులు 10.30కి ప్రారంభమవుతున్నాయి. అవి గమ్యస్థానానికి చేరేసరికి 11 గంటలైనా అవి లెక్కలోకి రావు. ఇక ఎంఎంటీఎస్‌ సేవలు దీనికి ఏమాత్రం తక్కువ ఉండడంలేదు. ఏదైనా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆ మార్గంలో వెళ్తే ఆలస్యం కావడం తప్ప ఈ రైలు సేవలూ ఠంఛనుగా పదిన్నర గంటల ప్రాంతంలోనే సమాప్తి అవుతున్నాయి. 
ప్రయాణికుల సూచనలివీ 
నగర శివార్లను కలుపుతూ కనీసం రాత్రి 11 గంటలవరకైనా బస్సులు నడపాలి. 
వేకువ జామున 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బస్సులుండేలా చూడాలి. 
కనీసం ఆటోలు అందుబాటులో ఉన్న ప్రాంతం వరకైనా ఆర్టీసీ నడపాలి. 
ఉదయం, మధ్యాహ్నం అనే రెండు షిఫ్టులు కాకుండా.. మూడు షిఫ్టుల పద్ధతిని  అనుసరించాలి 
రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ప్రధానమైన మార్గాల్లో ప్రతీ 15 నిమిషాలకు.. లేదంటే అరగంటకో బస్సయినా ఉంచాలి. ఇదే సమయంలో ఎంఎంటీఎస్‌, మెట్రో సేవలూ ఉండాలి.

ఆటోవాలాల దోపిడీ 

రాత్రి వేళ అటు బస్సులు, ఇటు మెట్రో, ఎంఎంటీఎస్‌లు ఉండని వేళ ఆటోవాలాలు ధరలు పెంచేసి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. ఖైరతాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లడానికి రూ.100లు చెల్లిస్తే సరిపోతుంది. రాత్రి 10 దాటిన తర్వాత రూ.200-300 డిమాండ్‌ చేస్తున్నారు. ఇక క్యాబ్‌లైతే సమయం చూసుకొని ప్రయాణికులకు వడ్డిస్తున్నాయి. సాధారణంగా రూ.150తో పూర్తికావాల్సిన ప్రయాణానికి రూ.300 వరకు గుంజుతున్నారు. వర్షం పడితే క్యాబ్‌లు దొరకవు.. ఆటోలూ అదృశ్యమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రిపూట ప్రయాణమంటే నగర జీవి భయపడిపోతున్నాడు. నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్‌ వెళ్లేందుకే పరిస్థితే ఇలా ఉంటే లింగంపల్లి, ఎల్‌బీనగర్‌, ఆరాంఘర్‌ చౌరస్తా, మెహిదీపట్నం, గచ్చిబౌలి, లంగర్‌హౌస్‌.. బాచుపల్లి, మియాపూర్‌, నిజాంపేట, ప్రగతినగర్‌ వంటి ప్రాంతాల నుంచి నగరంలోకి రావాలంటే ఎంత వ్యయప్రయాసో చెప్పనవసరంలేదు.

ఇతర వాహనాలే దిక్కు 

బన్సీలాల్‌పేట్‌: సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌, ప్యాట్నీ సీటీఓ కూడలి, ఎస్పీరోడ్డులోని ఈత కొలను బస్టాప్‌ వద్ద రాత్రి పదిన్నర దాటితే ప్రయాణికులు ఆటోలు, ట్రావెల్స్‌ కార్లపై ఆధారపడాలి. బస్సు టికెట్టుకు రూ.15 వెచ్చించే చోట ఆటోకు రూ.120 ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినవారు తప్పని పరిస్థితుల్లో ఆ ధరే చెల్లించాల్సి వస్తోంది.

ఎర్రగడ్డ ప్రధాన బస్టాప్‌.. ఆటోలే 

అమీర్‌పేట: జాతీయ రహదారిపై గల ఎర్రగడ్డలోని ప్రధాన బస్టాప్‌లో పటాన్‌చెరు, సనత్‌నగర్‌, జీడిమెట్ల ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షించాల్సి వస్తోంది. రాత్రి 10 గంటల నుంచి 10.45 వరకు ఈ బస్టాప్‌నకు కేవలం 5 బస్సులు మాత్రమే వచ్చి ఆగాయి. అందులో పటాన్‌చెరు-కోఠి దిల్‌సుఖ్‌నగర్‌ రూట్‌(218 నం) బస్సులే 3 ఉన్నాయి. మరొకటి మెహిదీపట్నం కాగా, ఇంకోటి సికింద్రాబాద్‌ వెళ్లేది. సరిగ్గా 10 గంటలకు సికింద్రాబాద్‌ బస్సు వెళ్లగానే ఎక్కువ మంది రైల్వేస్టేషన్‌ వెళ్లడం కోసం 10.45 వరకు నిరీక్షించారు. ఎంజీబీఎస్‌ వెళ్లాల్సిన ప్రయాణికులవీ ఎదురుచూపులే. ఇదే అదనుగా ఆటోవాలాలు ప్రయాణికులతో బేరమాడుతూ కనిపించారు. ఓ కుటుంబం సికింద్రాబాద్‌ వెళ్లడం కోసం ఆటో మాట్లాడగా రూ.300 ఇవ్వాలని చెప్పడంతో నిరాకరించారు. ఇక సెవెన్‌ సీటర్‌ ఆటోవాలా మెహిదీపట్నం వెళ్లేందుకు ప్రయాణికులను ఎక్కించుకుని మొత్తం ఆటో నిండేవరకు అరగంటపాటు అక్కడే ఉన్నాడు.

ఎల్బీనగర్‌.. నలువైపులా అదే పరిస్థితి 

ఎల్బీనగర్‌: ఎల్బీనగర్‌ చౌరస్తాలో రాత్రి 10.30 దాటితే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఆ సమయంలో హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌ పలు బస్సు డిపోలకు వెళ్లాల్సిన బస్సులు తప్ప మిగతా ప్రాంతాలకు ఉండటంలేదు. అటు నాగోల్‌, ఉప్పల్‌ వైపు, ఇటు సాగర్‌ రింగ్‌రోడ్డు, సీసీలబండ్‌, ఒవైసీ ఆసుపత్రి వైపు.. ఇటు హయత్‌నగర్‌, వనస్థలిపురం.. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు చెప్పనలవికానివి. మెట్రో దిగిన ప్రయాణికులతో పాటు పలువురు బస్సులు దొరక్క ఆటోలను, ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. భార్యాభర్తలు మెట్రో దిగి వనస్థలిపురం ఎన్‌జీఓస్‌కాలనీకి ఆటో బేరమాడగా రూ.150 చెప్పారు.

మెహిదీపట్నం.. సెట్విన్‌ ఆధారం 

మెహిదీపట్నం: నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు మెహిదీపట్నం బస్‌స్టాప్‌ కీలకం. ఇక్కడికి చేరుకుంటే చాలు ఇంటికి చేరినట్లేనని ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. నగరంలోని 24 డిపోలకు చెందిన దాదాపు 475కి పైగా బస్సులు 3500 ట్రిప్పుల్లో ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి 10 తర్వాత మాత్రం ప్రధాన ప్రాంతాలకు బస్సులు అందుబాటుటో ఉండడం లేదు. దీంతో ప్రజలు ఆటోలు, సెట్విన్‌ బస్సులపై ఆధారపడుతున్నారు. మెహిదీపట్నం-నుంచి సికింద్రాబాద్‌కు రాత్రి 11 గంటలకు చివరి బస్సు ఉంటుంది. అరాంఘర్‌, లింగంపల్లి రూట్‌లో 10 గంటలకే బంద్‌. మిగతా ప్రాంతాలకూ ఇదే పరిస్థితి. రాత్రి 10 తర్వాత సెట్విన్‌ బస్సులు సికింద్రాబాద్‌, కోఠి మార్గంలో మాత్రమే ఉంటాయి. ఆర్టీసీ బస్సు పాసులు ఉన్నవారు గత్యంతరం లేక వీటిలో డబ్బులు చెల్లించి ప్రయాణించక తప్పడంలేదు. లంగర్‌హౌస్‌, ఆరాంఘర్‌, టోలీచౌకి ప్రాంతాలకు షటిల్‌ ఆటోలలో ప్రయాణాలు చేసేవారిని ఆటోవాలాలు దోచుకున్న సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి.

సిబ్బంది లేరు.. బస్సులూ లేవు 

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ కష్టాలు చెప్పనలవికానివి. గతంలో అర్థరాత్రి 1 గంట వరకూ బస్సులు ఉండేవి. ఇప్పుడూ అలా నడుపుదామంటే సిబ్బందితో పాటు బస్సుల కొరత ఉంది. ఉన్న డ్రైవర్లనే వచ్చినవారికి వచ్చినట్టు విధులు అప్పజెప్పడంతో రాత్రిపూట ఆలస్యంగా తిప్పాలనుకునే బస్సులకు ఎవరూ దొరకడంలేదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉన్న సిబ్బందికి ఓటీలు(అదనపు సమయం చేస్తే ఇచ్చే భత్యం) ఇవ్వడంలేదు. దీంతో అదనపు గంటలు విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది ఇష్టపడడంలేదు. తమ విధుల సమయం అయిపోయిన పరిస్థితి ఉంటే.. బస్సును అమాంతం ఆపేసి వెనక్కి తిప్పేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ‘మా డ్యూటీ రాత్రి 9.30 గంటలకే ముగియాలి. ఇప్పుడు 9గంటలైంది. బస్సు చివరివరకు వెళ్లి రావాలంటే అర్ధరాత్రి అవుతుంది. గతంలో అదనపు సమయం పనిచేస్తే లెక్కగట్టి ఆ మేరకు నగదు చెల్లించేవారు. ఇప్పుడవన్నీ రద్దయ్యాయి. మేమేమీ చేయలేం’ అన్న సమాధానం వస్తుంది. రోజు మొత్తంలో 44 వేల ట్రిప్పుల్లో.. నగర వ్యాప్తంగా ఐదారువేల ట్రిప్పులు రద్దవుతున్నాయి. రాత్రి 9, 10 గంటలు దాటితే వివిధ కూడళ్ల వద్ద కంట్రోలర్లూ కనిపించడంలేదు. దీంతో పర్యవేక్షణ లోపిస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు అర్ధరాత్రి దాటేవరకు దూర ప్రాంతాల నుంచి రైళ్లు వస్తుంటాయి. ఈ ప్రయాణికులు వెళ్లేందుకు బస్సులు కరవై క్యాబ్‌లను ఆశ్రయించక తప్పడంలేదు.

సికింద్రాబాద్‌.. ఒక్క బస్సొస్తే వందలమంది పోటీ 

రెజిమెంటల్‌ బజార్‌, సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ఒక్క రైలు వచ్చి ఆగితే వందలాదిమంది దిగుతారు. రాత్రి 11 కు వచ్చే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు బస్సు అందని పరిస్థితి.. ప్రధానంగా రైల్వేస్టేషన్‌ ముందు స్టేషన్‌ బస్టాండ్‌, రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌, ఉప్పల్‌ బస్టాండ్‌, హయత్‌నగర్‌ బస్టాప్‌లు.. అలాగే మేడ్చల్‌ (హస్మత్‌పేట్‌), బాలానగర్‌(31 బస్టాప్‌) ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు వీటి వద్దనుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి 9 దాటిన తర్వాత 20 నిమిషాలకు ఒకటి.. 10 దాటితే అరగంటకు ఓ బస్సు ఉంటుంది. 11 దాటిన తర్వాత అసలు బస్సులే దొరకవు. ఉప్పల్‌, ఈసీఐఎల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, బోయిన్‌పల్లి, శామీర్‌పేట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్‌, మెహిదీపట్నం, కోఠి, సోమాజిగూడకు రాత్రి వేళ వెళ్లాలంటే ఇబ్బందులే. ఈసీఐఎల్‌కు చెందిన బ్రహ్మం, ఉప్పల్‌ వాసి బాల్‌రెడ్డి రాత్రి పది గంటలకు ఉప్పల్‌ బస్టాప్‌ వద్దకు వచ్చారు. ముప్పావుగంట ఎదురుచూసినా ఒక్క బస్సూ రాలేదనీ, ఆటోల్లో వెళ్దామంటే రెండింతల ఛార్జీలు ఇవ్వమంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

పగలే సరిగా ఉండవు: ప్రకాష్‌, వారాసిగూడ 
ప్రధానంగా వారాసిగూడ, పాటిగడ్డ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ప్రాంతాలకు పగలే బస్సులు తక్కువ. రాత్రి సమయంలో అవి వచ్చిన దాఖలాలుండవు. దీంతో నిత్యం ఆటోల్లోనే వెళ్తున్నాం. ఎప్పుడు ఆర్టీసీ అధికారుల్లో మార్పు వస్తుందో అప్పుడే మా ప్రాంతానికి మోక్షం కలుగుతుంది.
రోజూ ఇవే ఇబ్బందులు: సుధాకర్‌, లాలాపేట 
రోజూ రాత్రి 10గంటలు దాటితే లాలాపేట వైపు సక్రమంగా బస్సులు ఉండవు. నేను డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. రాత్రి 10.30గంటల సమయంలో సికింద్రాబాద్‌ బస్టాండ్‌కు వచ్చి గంటైనా వేచి ఉండాల్సిన పరిస్థితి. అవసరం లేని రూట్‌లో ఎక్కువగా బస్సులను నడిపే అధికారులు ప్రయాణికులుండే ప్రాంతాలకు మాత్రం నడపడంలేదు.
ఆర్థికంగా నష్టం: శ్రీనివాస్‌, మహబూబాబాద్‌ 
వ్యాపార కార్యకలాపాల కోసం వారానికోసారి నగరానికి వస్తుంటా. ఒక్కోసారి రాత్రి ఆలస్యమైతే ఇబ్బందులు తప్పవు. నాంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు 5సీ, 8ఏ బస్సులు రాకపోవడంతో సుమారు 40 నిమిషాలు వేచిచూసి ఆటోలో వచ్చేశా. బస్సులు లేక నగరవాసులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీటి సమయ వేళలు పెంచాలి.
ప్రయాణికుల అవసరాలను గుర్తించాలి 
కె.సుబ్బారావు, ప్రైవేటు ఉద్యోగి, ఎస్‌ఆర్‌నగర్‌ 
ప్రయాణికుల అవసరాలను గుర్తించాల్సి  ఉంది. ప్రైవేటు కంపెనీల్లో ఒక్కోసారి రోజంతా కష్టపడి వస్తుంటాం. రాత్రి ఆలస్యమైతే కనీసం 40 నిమిషాల నుంచి గంటసేపు రోడ్డుపై నిల్చోవాలి. తప్పని పరిస్ధితుల్లో ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నాం. రాత్రి 12వరకైనా సేవలను అందిస్తే సౌలభ్యంగా ఉంటుంది.

అధికారులేమంటున్నారంటే

‘‘ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని సమయాలు కేటాయించాం. ట్రిప్పులు ఎన్ని తిరగాలో నిర్దేశించాం. ఒక్కోసారి దారిలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. అయితే ట్రాఫిక్‌జామ్‌ల వల్ల సమయాలు తారుమారు కావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో శివారు ప్రాంతాలకు వెళ్లే వాటి విషయంలో గంట, అరగంట ఆలస్యమైనా ఆ ట్రిప్పు రద్దు కాకుండా.. మధ్యలో వెనక్కి వచ్చేయకుండా పూర్తి చేయాలని సూచిస్తున్నాం. ఇదే సమయంలో సిబ్బంది తగినంత లేరు. బస్సుల కొరత ఉంది. రాత్రి పది దాటిన తర్వాత కేవలం 20 శాతం బస్సులనే అందుబాటులో ఉంచుతున్నాం’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.