close

శనివారం, అక్టోబర్ 19, 2019

ప్రధానాంశాలు

రోజుకో రంగు పిలుపు.. మిగిలింది తెలుపు! 

ఆసుపత్రుల్లో అటకెక్కిన సప్తవర్ణాల దుప్పట్లు 
తెలుపు దుప్పట్లతోనే సరిపెడుతున్న వైనం 
తరచూ మార్చకపోవడంతో ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తి 
ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి

ఎంతో సదుద్దేశంతో ఆసుపత్రుల్లో ప్రారంభించిన సప్తవర్ణాల దుప్పట్ల ఏర్పాటు మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. రంగురంగు దుప్పట్లు పోయి ఆ స్థానంలో తిరిగి తెలుపు దుప్పట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అవి కూడా ఎప్పుడు మార్చేది అక్కడ సిబ్బందికే ఎరుక. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. శస్త్ర చికిత్సలు, ఇతర క్లిష్టమైన చికిత్సలు అనంతరం రోగులు త్వరగా కోలుకోవాలంటే ఆసుపత్రి వాతావరణమే ఎంతో కీలకం. పూర్తిస్థాయిలో పరిశుభ్రత ఉండాలి.. లేదంటే ఇన్‌ఫెక్షన్ల దాడి పెరుగుతుంది. తాజాగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు దుప్పట్లు మార్చక పోవడంతో ఇన్‌ఫెక్షన్లు పెరిగి రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. సర్కారు ఆసుపత్రుల్లో పడకలపై రోజుకు ఒక రంగు దుప్పటి ఉండేలా చూడాలని ఆదేశించింది. తొలుత గాంధీ, నీలోఫర్‌, పేట్లబుర్జు తదితర ఆసుపత్రుల్లో ఈ విధానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తొలుత తెలుపుతోపాటు మరో రెండు రంగుల దుప్పట్లను అందుబాటులోకి తెచ్చింది. మిగతా రంగులను విడతల వారీగా ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు. తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారు. చివరికి ఆ రెండు రంగులు రాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తిరిగి తెలుపు రంగు దుప్పట్లతోనే సర్దుబాటు చేస్తున్నారు. వాస్తవానికి 24 గంటల తర్వాత దుప్పటి మార్చాలి. కొన్ని ఆసుపత్రుల్లో రోగి చేరిన నుంచి మళ్లీ ఆ వ్యక్తి డిశ్చార్జి అయ్యే వరకు ఒకటి రెండు దుప్పట్లతోనే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడి ఒకవైపు...పడకల కొరత మరోవైపు ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రోజుకు ఒక రంగు దుప్పటి విధానం వల్ల నిత్యం కొత్తవి ఉండేలా చేయడానికి నూతన విధానాన్ని ప్రవేశపెట్టినా అమల్లోకి రాకపోవడంతో రోగులు నిట్టూరుస్తున్నారు. 
ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం 1200-1500 మంది రోగులు వస్తుంటారు. సోమ, మంగళవారాల్లో ఈ సంఖ్య 2 వేలు దాటుతుంది. భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో 168 పడకలు ఉన్నాయి. అనధికారంగా మరో 800 నిర్వహిస్తున్నారు. జనరల్‌ సర్జన్‌, ఆర్థోపెడిక్‌, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, న్యూరోసర్జన్‌ తదితర కీలక విభాగాల్లో ప్రస్తుతం ఉన్న పడకలు చాలడం లేదు. కొత్తగా ఆయా విభాగాల్లో కనీసం 200 పడకల అవసరం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పడకలతో సర్దుబాటు చేయక తప్పనిసరి పరిస్థితి. దీంతో పడకలు, దుప్పట్లకు పాట్లు తప్పడం లేదు. తరచూ దుప్పట్లు మార్చడానికి వీలు కావడం లేదు. కొందరు రోగులు ఇంటి నుంచే దుప్పట్లు, మెత్త(దిండ్లు)లు తెచ్చుకుంటున్నారు. పడకలపై కూడా సకాలంలో దుప్పట్లు మార్చక పోవడంతో ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. 
గాంధీ ఆసుపత్రికి నిత్యం 1500 మంది రోగులు వస్తుంటారు. సోమవారం, మంగళవారాల్లో రోగుల తాకిడి ఎక్కువే. నెలకు దాదాపు 10 వేల మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతుంటారు. ప్రస్తుతం అధికారంగా 1050 పడకలు ఉన్నాయి. అనధికారింగా మరో 800-900 పడకలు నిర్వహిస్తున్నారు. గైనకాలజీ, జనరల్‌ సర్జన్‌, పీడియాట్రిక్‌, ఆర్థోపెడిక్‌, కార్డియాలజీ, కార్డియోథోరోసిక్‌, జనరల్‌ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జన్‌ లాంటి కీలక విభాగాల్లో పడకల కొరత వేధిస్తోంది. గైనకాలజీలో 100 పడకలు ఉన్నాయి. నిత్యం 200 మంది వరకు గర్భిణులు వస్తుంటారు. ఒకే పడకపై ఇద్దరు ముగ్గురికి సర్దుబాటు చేస్తుంటారు. ఆయా విభాగాల్లో పరిశుభ్రత చాలా అవసరం. నిత్యం పడకలపై దుప్పట్లు మార్చాల్సిందే. ఇక్కడ రోజుకు ఒక రంగు అమలు చేయడం వల్ల రోగులకు ఎంతో ఉపయోగం ఉంది. తొలుత తెలుపు, గులాబి, ఊదారంగు దుప్పట్లు, మెత్తలు అందించారు. గత కొన్నిరోజులుగా పంపిణీ అటకెక్కింది. యథావిధిగా తెలుపురంగు దుప్పట్లతో సరిపెడుతున్నారు. అవికూడా తరచూ మార్చక పోవడం వల్ల దురదలు వస్తున్నాయి. ఒక దుప్పటితోనే రెండు, మూడు రోజులపాటు గడుపుతున్నారు. నీలోఫర్‌, పేట్లబుర్జు ఇతర ఆసుపత్రుల్లో ఇదే విధానం ఉంది. అధికారులు స్పందించి రంగుల దుప్పట్ల విధానాన్ని కొనసాగించాలని రోగులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.