మంగళవారం, డిసెంబర్ 10, 2019
నిలదీస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులు
డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో సీటు దొరికేనా?
మంచి కళాశాల, విభాగం దక్కదంటూ ఆందోళన
* దోస్త్ మొదటి, రెండో ఫేజ్‌ల్లో 1,53,238 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో లక్ష మందికిపైగా అభ్యర్థులు గ్రేటర్ పరిధిలోని వారే.
* జూన్ 20 నుంచి 25వ తేదీల్లో దోస్త్ మూడో ఫేజ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తికానుంది.
* డిగ్రీ విద్యార్థులకు జులై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు ఫలితాలు ఇచ్చేటప్పటికి డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన ప్రారంభంకానుంది.
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు ఇప్పటికీ వెలువడ లేదు. కారణాలు ఏమైనా ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఆలస్యంగా జరిగింది. ఫలితాల్లోను తప్పులు జరిగాయంటూ లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు చాలామంది మళ్లీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు ఇప్పటికీ రాలేదు. ఇవి రాకుండానే ఈలోపు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు భర్తీ ప్రక్రియలు వేగంగా నిర్వహించడంపై విద్యార్థులు నిలదీస్తున్నారు. గ్రేటర్ పరిధిలోనే వందలాది ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే చాలా డిగ్రీ కళాశాలల్లో సీట్లు నిండిపోతున్నాయి. కోఠి మహిళా కళాశాల, సిటీ కళాశాల వంటి వాటిల్లో సీట్లు చాలా విభాగాల్లో లేవు. సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యేవరకు డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రవేశాలు నిలిపివేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. మంచి కళాశాలల్లో కోరుకున్న విభాగంలో సీటు అనుమానమేనంటూ వేలాదిమంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై త్వరగా నిర్ణయం వెల్లడించాలని అభ్యర్థిస్తున్నారు.
రెండు విడతలు పూర్తి..
దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ చేస్తున్నారు. నగరంలో ప్రముఖ కళాశాలల్లో చేరేందుకు తెలంగాణ వ్యాప్తంగా వేలాది విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే దోస్త్ రెండు విడతల్లో ఐచ్ఛికాలు వారంతా ఇచ్చేసుకున్నారు. వీరందరూ ఆయా కళాశాలల్లో చేరిపోతే.. మిగిలేవి కొన్ని సీట్లు అంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సులకు దోస్త్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వీటిల్లో ముఖ్య కళాశాలల్లో సీట్లు నిండాయి. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్‌లో చేరే అభ్యర్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకొనే ప్రక్రియ ప్రారంభమైంది.
మొదటి వారంలో ఫలితాలు..
జులై మొదటి వారంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి లక్షా4వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి ఏడాది వారే 50వేల వరకు ఉన్నారు. మిగతా వారు రెండో ఏడాది విద్యార్థులు. వీరిలో ఎంతమంది ఉత్తీర్ణత అయినా.. వారంతా నచ్చిన కళాశాలలో ఇష్టమైన కోర్సుల్లో చేరేందుకు అవకాశాలు దాదాపు లేనట్లే. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ వేగంగా సాగిపోతుండటమే దీనికి కారణం. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సమయం ఏడాదిపాటు వృథా కానుందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు నిలపాల్సిందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు