close

బుధవారం, జులై 17, 2019

ప్రధానాంశాలు

కృత్రిమ తటాకాలు! 

వరద కట్టడికి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం 
నీటి నిల్వ ప్రాంతాల్లో మోటార్ల ఏర్పాటు 
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ 
ఈనాడు, హైదరాబాద్‌

ముంపు సమస్య నుంచి కాలనీలను గట్టెక్కించేందుకు జీహెచ్‌ఎంసీ కృత్రిమ తటాకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మూడు ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ పేర్కొన్నారు. దుర్గం చెరువు దిగువన నెక్టార్‌గార్డెన్‌ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. బయోడైవర్సిటీ కూడలి దగ్గర, మాదాపూర్‌లో మరో రెండు ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. జేఎన్‌టీయూ ఇంజినీర్లు అందుకు సంబంధించిన ప్రణాళిక ఇచ్చారని, దాని ప్రకారం యుద్ధప్రాతిపదికన కృత్రిమ తటాకాలను.. అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. తొలకరి వర్షాలతో నగరంలోని పలుచోట్ల వరద సృష్టించిన కల్లోలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి... కారణాలను అన్వేషించాక.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో దానకిషోర్‌, విపత్తు నిర్వహణ దళం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, ముఖ్య ఇంజినీరు జియాఉద్దీన్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హైటెక్‌సిటీలో ప్రస్తుతం ఉన్న వరద నాలాలు కేవలం 2సెం.మీ. వర్షాన్ని మాత్రమే తట్టుకుంటాయని, వాటి సామర్థ్యాన్ని 14సెం.మీలకు పెంచాల్సి ఉందన్నారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేస్తామన్నారు. వరద నీటిని ఎత్తిపోసేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో నీటి మోటార్ల ఏర్పాటు... వరద కాలువలు, నాలాల అభివృద్ధి.. కృత్రిమ తటాకాల నిర్మాణం అనే మూడు కార్యక్రమాలను అందుకు ఎంచుకున్నామని దానకిషోర్‌ స్పష్టం చేశారు. కృత్రిమ తటాకాలకు వేర్వేరు ప్రాంతాల నుంచి పైపులైన్ల ద్వారా వరదను తరలించే ఆలోచన చేస్తున్నామన్నారు. తరచుగా రహదారులపై నీరు నిలిచే 120 ప్రాంతాలను గుర్తించామని, వాటిని ఏ, బీ, సీ అని మూడు రకాలుగా విభజించినట్లు తెలిపారు. ‘ఏ’ రకం ప్రాంతాల్లో నీటి మోటార్లను, సిబ్బందిని 24 గంటలూ ఉంచుతామన్నారు. బీ, సీ కేటగిరి ప్రాంతాలకు సంబంధించిన సామగ్రిని దగ్గర్లోని ప్రభుత్వ కార్యాలయాలు లేదా భవనాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన వివరించారు. 
‘వర్షాకాలంలో ట్రాఫిక్‌ అతి పెద్ద సమస్యగా మారుతోంది. దీన్ని అధిగమించాలంటే ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు సహకరించాలి.  ఉద్యోగులను ఒకేసారి కాకుండా.. దశలవారీగా బయటకు పంపిస్తే చాలా మేలు జరుగుతుంది.  గ్రేటర్‌వ్యాప్తంగా 495 వర్షాకాల సన్నద్ధత బృందాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వాహనాలకు జీపీఎస్‌ను అమర్చబోతున్నాం. ఐటీకారిడార్‌, ఇతర చోట్ల వరదనీరు ఎక్కువగా నిలిచే 12 ప్రాంతాలను గుర్తించాం. అక్కడ రెండేసి మోటార్ల చొప్పున ఎప్పటికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాం.’ అని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లో రోడ్డుపై ఉండే ఇసుక, ఇతర వ్యర్థాలు వరదనీటిలో కొట్టుకుపోయి మ్యాన్‌హోళ్లను పూడ్చేస్తున్నాయి. ఆ సమస్యను అరికట్టేందుకు వార్డుకు ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి రహదారులపై ఉండే వ్యర్థాలను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. 
రహదారులపై నీరు నిలవకుండా చూడాలి 
కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: రహదారులపై వర్షపు నీరు నిలవకుండా యుద్ధప్రాతిపకదిన తగిన చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి మూసాపేట, కూకట్‌పల్లి సర్కిళ్లలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు.  ముందుగా ఆయన వై జంక్షన్‌ డీమార్ట్‌ వద్ద మెట్రోస్టేషన్‌ సర్వీసు రోడ్డులో నిలిచిన వర్షపు నీటి మడుగును చూశారు. అక్కడ నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూసాపేట ఆర్టీసీ డిపో ఎదురు నాలాను తనిఖీ చేశారు.  కూకట్‌పల్లి బస్టాపు, కేపీహెచ్‌బీకాలనీ హైటెక్‌సిటీకి వెళ్లేదారిలోని ఆర్‌యూబీ రోడ్డును పరిశీలించారు. అక్కడ ప్రతి వర్షాకాలంలో నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలుసుకొని,  సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అంతకుముందు కేపీహెచ్‌బీకాలనీ ఏడోఫేజ్‌లోని కుక్కల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శస్త్రచికిత్సలను పరిశీలించారు. జడ్సీ శంకరయ్య, సీసీపీ దేవేందర్‌రెడ్డి, మూసాపేట, కూకట్‌పల్లి ఉప కమిషనర్లు వి.మమత, సామ్రాట్‌అశోక్‌, తహసీల్దారు నిర్మల, ఈఈలు నాగేందర్‌యాదవ్‌, శ్రీధర్‌, డీఈలు, ఏఈలు, ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు. 
వరద చేరకుండా చర్యలు చేపట్టండి 
వెంగళ్‌రావునగర్‌: వర్షం కురిసినప్పుడు వరదనీరు రోడ్లపై చేరకుండా అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియాఉద్దీన్‌తో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌ పరిధి మెట్రోస్టేషన్‌ సమీప వరదనీటి నాలా పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.