సామాన్యుల అసామాన్య విజయం - Kurnool - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

సామాన్యుల అసామాన్య విజయం

వేంపెంట ర్యాంక్‌ విద్యుత్తు కేంద్రం అనుమతులు రద్దు 
1567 రోజుల రిలే దీక్షల విరమణ 
ఐకమత్యంతో గ్రామీణుల పోరాటం 
ఉద్యమ చరిత్రలో సుదీర్ఘ నిరసన దీక్ష

విద్యుత్తు కేంద్ర నిర్మాణంపై ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామస్థులు (పాతచిత్రం)

పాములపాడు మండలం వేంపెంట గ్రామం ఉద్యమాలకు పుట్టినిల్లు. ప్రజా సమస్యలను సమష్టిగా ఎదుర్కోవడంలో నాటి నాయకులు ఇచ్చిన స్ఫూర్తి నేటికీ కొనసాగిందని నిరూపితమైంది.

* గ్రామం మధ్యలో నుంచి ప్రవహించే నిప్పుల వాగుపై 7.2 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్ర నిర్మాణానికి 2011లో అప్పటి ప్రభుత్వం ర్యాంక్‌ సంస్థకు అనుమతించింది. ఇందుకు ఆ సంస్థ రూ. 47 కోట్ల పెట్టుబడితో నిప్పుల వాగుకు అనుసంధానంగా పక్కన 5.07 కి.మీ. నుంచి 8 కి.మీ. వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. పనులు మొదలు పెట్టి 25 శాతం పూర్తి చేసింది. గ్రామస్థులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. అధికార బలంతో పనులు చేయదల్చినా గ్రామస్థుల నిరసనలతో ముందుకు సాగలేదు. ఈ పోరాటాలు 9 ఏళ్లు సుదీర్ఘంగా సాగాయి.

ఉద్యమం ఎందుకంటే.. గ్రామస్థుల మాటల్లో..

* గ్రామం మధ్యలో విద్యుత్తు కేంద్రం నిర్మిస్తే ఊరి ఉనికికే ప్రమాదం. 2009 వరదలో గ్రామానికి తీవ్రనష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం.

* గ్రామానికి తరచూ వరదలు వస్తుంటాయి. అదనంగా విద్యుత్తు కేంద్ర నిర్మాణంతో అదనపు నష్టాలు వస్తాయి.

* గ్రామానికి దగ్గర్లోనే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ ఎస్కేప్‌ కాల్వలు సుమారు 80 అడుగుల లోతులో ఉండడం వల్ల సమీప బావులు, బోర్లలో నీరు అడుగంటి పోయింది. కొత్తగా విద్యుత్తు కేంద్రం నిర్మిస్తే పంట పొలాలు బీడువారి పోతాయి.

* బ్లాస్టింగ్‌తో ఇళ్లకు బీటలు వస్తున్నాయి. కూలిపోయే ప్రమాదం ఉంది.

* గ్రామానికి సమీపంలోని మూడు కాల్వల నిర్మాణంతో వ్యవసాయ భూమి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగిలిన అరకొర భూమి విద్యుత్తు కేంద్రం పాలవుతుంది.

* విద్యుత్తు కేంద్రంలోని నిల్వ జలంతో అనేక ప్రమాదాలు, కాలుష్యం పొంచి ఉన్నాయి.

* గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలను ఇతర ప్రాంతాలకు తరలించి అన్ని సౌకర్యాలతో కాలనీలు నిర్మించాలి. లేదంటే ప్రాజెక్టును గ్రామానికి సుమారు 8 కి.మీ. ఆవల నిర్మించుకోవాలి.

దీక్షలో కూర్చున్న మహిళలు

సంస్థ యాజమాన్యం సమర్థన...

* ఇక్కడ నిర్మాణం చేస్తే తక్కువ ఖర్చు వస్తుంది. విద్యుత్తు ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

పోరాటం సాగిందిలా....

* 2011 ఆగస్టు 5 తేదీన ర్యాంక్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్ర నిర్మాణం భూమి పూజను గ్రామస్థులు అడ్డుకున్నారు.

* 2012 ఏడాదిలో రాష్ట్ర మానవ హక్కులకు ఆశ్రయించారు.

* 2013లో అప్పటి కలెక్టరు సుదర్శన్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి తాత్కాలికంగా పనులు నిలిపి వేయించారు.

* 2013లో న్యాయశాఖ మంత్రి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.

* 2013-14లో పోలీస్‌ బలగాలతో పనులు ప్రారంభించారు.

* 2014 జూన్‌ 9వ తేదీన వెయ్యిమందితో కలెక్టరేట్‌ ముట్టడి. నిర్మాణం రద్దు చేస్తున్నట్లు హామీ. కలెక్టరు బదిలీ.

* 2015లో పోలీస్‌ బలగాలతో పనులు మళ్లీ మొదలు పెట్టారు. ప్రజలను గ్రామంలో నిర్బంధించారు.

* 2015 మార్చి 6న నిర్మాణ పనుల్లో బ్లాస్టింగ్‌తో ఇళ్లు కూలిపోయాయి. గ్రామస్థులు ప్రతిఘటించి పనులు నిలిపివేయించారు. 7వ తేదీన పని చేస్తున్న యంత్రాలను ఊరి బయటకు దాటించారు.

అలుపెరగని దీక్షలకు 1567 రోజులు

గ్రామస్థులు చేస్తున్న పోరాటాలకు ప్రభుత్వం స్పందించక పోవడంతో గాంధీ మార్గంలో శాంతియుతంగా దీక్షలకు దిగారు.

* 2015 మార్చి 15 వతేదీన రిలే నిరసన దీక్షలకు శ్రీకారం చుట్టారు. దీక్షలు చేస్తూనే పోరాటాలు కొనసాగించారు.

* 2015 ఏప్రిల్‌ 24తేదీన వంద మందితో జాతీయ మానవహక్కుల కమిషన్‌ను హైదరాబాద్‌లో కలిశారు.

* 2015లో 50 మందితో దిల్లీలోని జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ను కలిశారు.

* 2015లో పాములపాడు మండలం బానకచెర్ల నీటిసముదాయం ను సందర్శించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు.

* 2015 ఏప్రిల్‌ 8న బానకచెర్ల నీటి సముదాయానికి వచ్చిన నాటి ప్రతిపక్ష నాయకులు, నేటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విద్యుత్తు కేంద్రం రద్దుకు హామీ పొందారు.

* 2015లో పుట్టపర్తిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని, చిరంజీవిని కలిశారు.

* 2015 మేలో నాటి కలెక్టరు విజయమోహన్‌ శిబిరాన్ని సందర్శించారు.

* 2016లో హైదరాబాద్‌ సచివాలయంలో షెడ్యూల్డ్‌ కమిషన్‌తో చర్చలు జరిపారు.

* 2016లో దీక్షలను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సందర్శించారు.

* 2016లో ఆత్మకూరుకు వచ్చిన సీపీఎం నాయకులు రాఘవులను కలిశారు.

* 2016లో రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల కమిషనర్‌ కమలమ్మను విజయవాడ లో కలిసి సానుకూల మద్దతు పొందారు.

* 2017లో నర్మదా బచావో ఆందోళన్‌ కమిటీ అధ్యక్షురాలు మేధాపాట్కర్‌ను కలిశారు.

* 2018లో సీపీఐ నాయకులు రామకృష్ణ, నారాయణను కలిసి మద్దతు పొందారు.

* 2016 నుంచి 18 వరకు దీక్షా శిబిరానికి స్థానికంగా ప్రజాసంఘాల మద్దతు తెలిపారు.

సుదీర్ఘ దీక్ష పోరాటంలో పాల్గొన్న 11 మంది మహిళలు

* సామ్రాజ్యమ్మ, అన్నమ్మ, దాసరి మేరమ్మ, రొక్కల సుశీలమ్మ, బోనాల కాశమ్మ, బోనాల చిన్నక్క, లక్షమ్మ, బోనాల భారతీ, దరగ సుశీలమ్మ, దాసరి పుష్పలత, రూతమ్మ.

గ్రామం బాగుండాలని దీక్షలు చేశాం

- బోనాల భారతీ, దీక్షాదారులు, వేంపెంట

గ్రామం బాగుండాలని సుదీర్ఘంగా 1567 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు శిబిరంలో కూర్చున్నాం. ఈ సమయంలో మంచినీళ్లు తప్ప మరేమీ ముట్టేవాళ్లం కాదు.

ఒత్తిళ్లతో నెగ్గుకొచ్చాం - సామేలు,

ఉద్యమకారుడు, వేంపెంట

అనేక ఒత్తిళ్లతో పోరాటాలు చేశాం. మానాన్న దివంగత సంజన్న పోరాటాలను మొదలు పెట్టారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అధికారులు, కమిషన్లను, ప్రజాప్రతినిధులను కలిశాం. మాకు గట్టి మద్దుతు పలికింది మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామి. మా బాధ]లను తెలిపాం.

ఆరోగ్యాలు చెడిపోయాయి

- రొక్కం సుశీలమ్మ, దీక్షాదారులు, వేంపెంట

దీక్షలు ఇన్ని రోజులు కూర్చోవటంతో అందని ఆరోగ్యాలు చెడిపోయాయి. ప్రతి ఒక్కరికి చక్కెర, బీపీ వ్యాధులు వచ్చాయి. కొందరికి కిడ్నీలు దెబ్బతిన్నాయి. ప్రతిరోజు దీక్షలో కూర్చోవడమే మా పని. స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నాం. కంపెనీ లాభాపేక్ష కోసం గ్రామానికి హాని తలపెట్టాలని వచ్చారు. దీక్షలతో భంగపడ్డారు.

ప్రభుత్వ నిర్ణయం అమలు పరుస్తాం

- వీరపాండియన్, కలెక్టరు, కర్నూలు

వేంపెంట విద్యుత్తు ఉత్పత్తి కేంద్ర నిర్మాణంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు పరుస్తాం. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన కల్టెకర్ల్ల సమావేశంలో ఈ విషయం ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాను. సీఎం స్పందిస్తూ రద్దు చేయమని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పద్ధతి ప్రకారం అమలు చేయాలి. అందుకు మార్గదర్శకాలు తీసుకుని అమలు చేస్తాం. జీవో అంటే ఒక్కరోజులో ఇచ్చేది కాదు. త్వరలో జీవో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాం.

సామాన్యుల అసామాన్య విజయం ఇది.. పెట్టుబడిదారీ వ్యవస్థను ఓడించిన నిరుపేదల పోరాటం ఇది.. గ్రామీణుల సమష్టి పోరుతో ప్రభుత్వం దిగివచ్చింది. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న మార్క్స్‌ నినాదమే స్ఫూర్తిమంత్రమయ్యింది. ఊరి బాగు కోసం సుదీర్ఘ పోరాట పటిమతో విజయం సాధించిన తీరు ఉద్యమాల చరిత్రలో నిలిచిపోతుందనడంతో సందేహం లేదు. సోంపేట ఉద్యమానికి మించిన విజయం వేంపెంటది

- న్యూస్‌టుడే, పాములపాడు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.