శుక్రవారం, డిసెంబర్ 06, 2019
న్యూస్టుడే, నిజామాబాద్ వ్యవసాయం
జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా సాగు చేసేది సోయాబీన్, మొక్కజొన్న. వీటి సాగుకు గడువు ముగిసింది. జూన్ 15 దాటితే ఆశించిన దిగుబడులు రావనేది వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన. వాస్తవానికి జూన్ నెలాఖరు దాటిన తర్వాత వేసిన పంటకే ప్రతికూలమైన ఫలితాలొస్తాయని గతంలో రుద్రూర్ పరిశోధన కేంద్రంలో తేలింది. ఇప్పుడు ఆ గడువు, ఈ గడువు రెండు దాటిపోతున్నాయి. ఇక సోయా వేయకపోవడమే శ్రేయస్కరమని చెబుతున్నారు. మొక్కజొన్న పంట కూడా జులై 15 లోపు వేసుకుంటేనే దిగుబడులొచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పంటలు వేసేలోపే కాలం కరిగిపోవడంతో అన్నదాతలు నిట్టూరుస్తున్నారు.
90 వేల ఎకరాల్లో మాత్రమే..
జిల్లావ్యాప్తంగా 4,42,915 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో ఇప్పటివరకు అన్ని పంటలు కలిపి సుమారు 90 వేల ఎకరాల్లో మాత్రమే వేశారు. అయితే ఆరుతడి పంటల్లో ప్రధానమైన సోయాబీన్, మొక్కజొన్న పంటలే 59 వేల ఎకరాలకు పైగా ఉంటుంది. అయితే ఈ రెండు వర్షాధారంగా, బోర్ల కింద సాగు చేస్తున్నారు. ఇందులో ఈ ఏడు సోయా సాగు పరిస్థితి దయనీయంగా ఉంది. వ్యవసాయశాఖ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 8 వరకు కేవలం 33,992 ఎకరాల్లో మాత్రమే వేశారు. అంటే కేవలం 13 శాతానికే పరిమితమైంది. మహా అంటే 40 వేల నుంచి 50 వేల ఎకరాలకు మించి సాగయ్యే పరిస్థితి లేదు. కనీసం సాధారణ విస్తీర్ణంలో సగం కూడా విత్తు వేయలేని పరిస్థితి. మొక్కజొన్న ఈ ఏడాది 48,763 ఎకరాల్లో (సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగానే) వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతారని భావించింది. కానీ తాజా సమాచారం ప్రకారం 30 వేల ఎకరాల్లోపే పరిమితమైంది. 30 శాతానికి పైగా లోటుతో సరి పెట్టుకోవాల్సి వస్తోంది.
వర్షాభావమే కారణం..
సకాలంలో వానలు కురవకపోవడం సాగుపై ప్రభావం చూపింది. వాస్తవానికి జిల్లా రైతులకు జూన్ రెండో వారానికల్లా విత్తనం వేసేస్తారు. అందుకోసం ముందుగానే విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటారు. వర్షం పడితే వేసుకోవచ్చనే ఆశతో ఎదురుచూశారు. చాలా చోట్ల కనీసం దుక్కులకు సరిపడే వాన కూడా పడలేదు. మూడో వారంలో వచ్చిన తొలకరికి ఆదరాబాదరాగా వేసిన విత్తనంలో సగమే మొలిచింది. తర్వాత వరికి సాగుకు కూడా అనుకూల పరిస్థితులు లేవని గ్రహించిన అన్నదాతలు బోర్ల కింద సోయాబీన్, మొక్కజొన్నకు వేశారు. అయినా ఆశించినంత మేర సేద్యం సాధ్యం కాలేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. కానీ, పంట వేయాల్సిన గడువు పూర్తయింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపే చూడాలని రైతులు పునరాలోచనలో పడ్డారు.
అంత అనుకూలం కాదు
సోయాబీన్ జూన్ 5 లోపే వేసుకోవాలి. 15వ తేదీ దాటిన తర్వాత విత్తు వేయడం శ్రేయస్కరం కాదు. గతంలో రుద్రూర్ పరిశోధన కేంద్రంలో ఈ విషయం రుజువైంది. మొక్కజొన్న సాగు సమయం కూడా దాటి పోతోంది. ఆలస్యంగా వేస్తే పుప్పొడి జరగదు. పూత, కాయ సరిగా పట్టక దిగుబడులు తగ్గుతాయి. వంగడాలను బట్టి, వ్యవసాయశాఖ సూచన మేరకు సాగుకు సిద్ధం కావాలి. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు.
- డా.కిషన్రెడ్డి, విశ్రాంత ఏరువాక శాస్త్రవేత్త
తాజా వార్తలు
జిల్లా వార్తలు