close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

‘స్పందన’కు తరలివచ్చారు

 వేలాదిగా హాజరు
వినతులు స్వీకరించిన కలెక్టర్, ఎమ్మెల్యే
 పింఛన్లు, ఇళ్ల స్థలాలు కోరుతూ అధిక దరఖాస్తులు

వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి, కలెక్టర్‌ వీరపాండియన్‌

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డలో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వేలాదిగా ప్రజలు హాజరైన తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అధికారులు కార్యక్రమానికి హాజరవుతుండడంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వినతులు అందించారు. గత కలెక్టర్‌ సత్యనారాయణ సైతం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్‌ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించే వారు. కొత్త కలెక్టర్‌ సైతం అదే ఒరవడిని కొనసాగిస్తూ ‘స్పందన’ పేరిట ఆళ్లగడ్డతోనే ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్నో ఆశలతో...

స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు అందుకున్న కలెక్టర్‌ వెంటనే సంబంధిత జిల్లా అధికారిని పిలిచి సమస్యను తెలుసుకుని.. వెంటనే దాన్ని పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి రావడంతో స్పందన వేదిక కిటకిటలాడింది. గతంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాక దాన్ని ఆన్‌లైన్‌ చేసి సంఖ్య ఇచ్చేవారు. ఈ మారు మొదట ఆన్‌లైన్‌ చేసిన వారే వినతి పత్రం ఇవ్వాలన్న నిబంధన పెట్టడంతో తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సరైన ఏర్పాట్లు లేకపోవడం, ఆన్‌లైన్‌ నమోదులో ఆలస్యం కావడంతో ప్రజలు గుంపులుగా తోసుకోవడం కన్పించింది. చాలా మంది వద్ద ముందుగానే పత్రాలు ఇప్పించుకోవడం, వందలాది పత్రాలు ఒక్కసారిగా రావడంతో ఎంతో మంది గందరగోళానికి గురయ్యారు. కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

* తాను అంధుడినని, కూతురుకు గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించాలని వీరన్న అనే దివ్యాంగుడు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. స్పందించిన కలెక్టర్‌ వెంటనే సంబంధిత ప్రధానాచార్యురాలిని పిలిచి బాలికకు సీటు ఇవ్వాలని ఆదేశించారు.

* తాను డిగ్రీ పూర్తిచేశానని తనకు ఉపాధి చూపించాలని రుద్రవరం గ్రామానికి చెందిన ఓబులేసు అనే దివ్యాంగుడు కలెక్టర్‌ను కోరారు.

* ఉయ్యాలవాడ మండలం పుచ్చకాయలపల్లె గ్రామానికి చెందిన బుడగ జంగాల ప్రజలు స్పందన వేదిక వద్ద నిరసన ప్రదర్శన చేశారు. తమ భూములు ఆక్రమణకు గురయ్యాయని వెంటనే వాటిని తమకు పంపిణీ చేయాలంటూ నిరసన చేపట్టారు.

జిల్లా అధికారులు రావడం సంతోషకరం

- జంబులయ్య, ఆళ్లగడ్డ

కలెక్టర్‌తోపాటు జిల్లాస్థాయి అధికారులు పెద్దసంఖ్యలో ప్రజల చెంతకు రావడం సంతోషకరం. వచ్చిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వేలాదిగా వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఈ లోపాన్ని వెంటనే సరిచేసుకోవాలని కోరుతున్నా.

భారీ సంఖ్యలో హాజరైన జనం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.