close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

అక్షరాలా.. లక్షలారా!

లావాదేవీలపై వాట్సాప్‌లో మెసేజ్‌లు
ఉపకులపతి తీరుపైనా విమర్శల వెల్లువ
పోస్టుల భర్తీలో చేతులు మారిన నగదు
భారీగా ఉర్దూ వర్సిటీ నిధులు పక్కదారి

జిల్లాలోని అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయంపై అవినీతి నీడలు కమ్ముకున్నాయి. వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే ఆ నిధులపై కొందరు కన్నేశారు. అందినకాడికి అక్రమంగా దోచుకుంటున్నారు. టీచింగ్‌ అసిస్టెంట్‌ కాంట్రాక్టు ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలోనూ రూ.లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం విశ్వవిద్యాలయ బోధన సిబ్బంది వాట్సాప్‌ గ్రూపులో సంక్షిప్త సమాచారాల ద్వారా బయటకు పొక్కింది. మరోవైపు ఇక్కడి ఉప కులపతి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈనాడు డిజిటల్‌-కర్నూలు, న్యూస్‌టుడే-కర్నూలు విద్య: కర్నూలులో మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండటంతో 2016లో అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసేలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నగరంలో అద్దె భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఓర్వకల్లులో 150 ఎకరాల్లో రూ.58 కోట్లతో శాశ్వత భవనాల నిర్మాణం, బాలబాలికలకు వసతిగృహాలు నిర్మిస్తున్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో మొత్తం 11 కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేశారు. ప్రతి విద్యా సంవత్సరం చివర్లో వీరి సేవలను పునరుద్ధరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 2019-20 విద్యా సంవత్సరానికి 22 మంది బోధన సిబ్బందిని భర్తీ చేసే క్రమంలో నూతన ప్రకటన జారీ చేస్తూ టీచింగ్‌ అసిస్టెంట్‌ కాంట్రాక్టు హోదాను చేర్చారు.

కౌజు పిట్టలు తిన్నామంటూ బిల్లులు

ఉర్దూ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేస్తున్న ముజఫర్‌ అలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఓ వ్యక్తి సహ చట్టం ద్వారా పలు వివరాలను వెలుగులోకి తీసుకొచ్చారు. 2017-18లో కారు ఖర్చుల పేరుతో రూ.7.80 లక్షల మేర బిల్లులు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతోపాటు భోజనంలో ఏకంగా కౌజు పిట్టలు తిన్నట్లు బిల్లులు పొందుపరచడం గమనార్హం. అవగాహన సదస్సులు, ఇతర ఖర్చుల పేరిట రూ.8 లక్షలకుపైగా చూపారు. వీసీ బయటకు ఎక్కడికి వెళ్లినా ఆరుగురు వెంట వస్తున్నట్లు, ప్రతిసారి ఒక్కొక్కరికి రూ.3 వేల ఖర్చు చొప్పున బిల్లుల్లో చూపించారు. యూజీసీ అనుమతికై దిల్లీలో తనకు తెలిసిన వ్యక్తి కష్టపడ్డారంటూ రూ.43 వేలు ఖర్చు చూపించారు. వర్సిటీలో విద్యార్థుల సౌలభ్యం కోసం బస్సు కొనుగోలు చేశారు. వాస్తవానికి బస్సు ధర రూ.39 లక్షలు కాగా బిల్లులో మాత్రం రూ.50 లక్షలు చూపారు. ఇలా ప్రభుత్వ నిధులను పెద్దఎత్తున పక్కదారి పట్టించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో జీతాలు, విద్యుత్తు బిల్లులు, అద్దె, స్టేషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్ల కొనుగోలు వంటి వాటికి రూ.1.22 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. ఇలా వర్సిటీ ఏర్పడిన 2016 నుంచి నేటి వరకు రూ.27.64 కోట్ల ఖర్చును లెక్కల్లో చూపడం గమనార్హం. ఇలా నిధులు నీళ్లలా కరిగిపోతున్నా అభివృద్ధి మాత్రం అడుగు పడలేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

రిజిస్ట్రార్‌ అభ్యంతరం చెప్పినా...

విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి పాలకమండలి సభ్యులు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇటీవల ఆర్థిక సలహాదారుగా నియమించిన వ్యక్తికి 72 ఏళ్లు. ఇతనికి రూ.70 వేల వేతనం చెల్లించాలంటూ ఉప కులపతి రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. వాస్తవానికి ఇతని నియామకానికి సంబంధించి పాలకమండలిలో ఎలాంటి ఆమోదం పొందలేదు. వర్సిటీలో లింగ్విస్టిక్‌ (ఉర్దూ) బోధించేందుకు నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ వీరిని కాదని మరో వ్యక్తిని రూ.30 వేల వేతనంతో నియమిస్తూ ఉప కులపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఒక నెల గడిచిన వెంటనే అతనికి రూ.68 వేలు జీతం ఇవ్వాలంటూ మరో ఉత్తర్వు ఇచ్చారు. వీటన్నింటికీ రిజిస్ట్రార్‌ అభ్యంతరం తెలిపారు. పైగా వీసీ ఒత్తిళ్లు తాళలేక కొన్నిరోజుల కిందట రిజిస్ట్రార్‌ రాజీనామా చేశారు.

కర్నూలు నగర శివారులో ఉన్న అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం

ఒక్కో పోస్టుకు రూ.4 లక్షలు

ఉద్యోగ ప్రకటనను సాకుగా చూపుతూ ఓ ఉన్నతాధికారి పోస్టులకు ధర నిర్ణయించారు. ఒక్కో పోస్టుకు రూ.4 లక్షల చొప్పున గతంలో పనిచేస్తూ వచ్చిన 11 మంది నుంచి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉర్దూ విశ్వవిద్యాలయంలో పనిచేసే బోధన సిబ్బందికి సంబంధించిన టీచింగ్‌ ఫ్యాకల్టీ వాట్సాప్‌ గ్రూపులో ఏకంగా దీనిపై బేరసారాలు జరిగాయి. ఎట్టకేలకు అందరూ ఒకే మాటపై నగదు చెల్లించినట్లు సమాచారం. ప్రకటన కేవలం నామమాత్రమే అని, గతంలో పనిచేసిన 11 మంది డబ్బులు చెల్లించడంతో పోస్టు తప్పనిసరిగా ఇస్తారని విశ్వవిద్యాలయ ఉన్నతాధికారి తెలపమన్నారంటూ ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా మిగిలిన వారికి వాట్సాప్‌ గ్రూపులో సమాచారం చేరవేశారు. అంతేకాక అసిస్టెంట్‌ ప్రొఫెసర్లగా ఎంపికైన వారికి ఎంటీఎస్‌ (మినిమం టైమ్‌ స్కేల్‌) ఇస్తామని వీసీ హామీ ఇచ్చారని గ్రూపులోని సభ్యులకు భరోసా ఇచ్చారు. ఇవన్నీ బయటకు పొక్కడంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.