close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

జల్సాల కోసం చోరీల బాట

ఆరుసార్లు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం
పట్టుబడ్డ ముగ్గురు నిందితులు, పరారీలో మరొకరు

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: ఇంటర్‌ పూర్తి చేసిన నలుగురు యువకులు జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించాలని చోరీల బాట పట్టారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగి, రాయదుర్గం, మొయినాబాద్‌ ఠాణాల పరిధిలో కాపలాదారు లేని ఆయా ఏటీఎం కేంద్రాలను ఎంచుకుని.. ఏకంగా ఆరుసార్లు చోరీకి విఫలయత్నం చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. సోమవారం మొయినాబాద్‌ ఠాణాలో శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. నగరంలోని గోల్కొండ పరిసరాలకు చెందిన మహ్మద్‌ సర్ఫరాజ్‌(20), మహమ్మద్‌ అమీర్‌ రయీస్‌(20), మొయినాబాద్‌ మండలం ముర్తుజగూడ ప్రాంతంలో ఉండే రాజేంద్రనగర్‌ కిషన్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ ఫర్దీన్‌(19), అబ్దుల్‌ రహీం(20) స్నేహితులు. ఇంటర్‌ వరకు చదువుకుని జులాయిగా తిరుగుతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టారు. ఉదయం వేళల్లో చోరీ చేయాలనుకునే ఏటీఎం కేంద్రాల వద్ద తచ్చాడటం.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏటీఎంలను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నాలు చేశారు. ఇలా నెల రోజుల వ్యవధిలో ఆరు ఏటీఎం కేంద్రాల్లో చోరీకి ప్రయత్నించారు. ఒకరు లోపలికి వెళ్తే.. మిగితా ముగ్గురు బయటే ఉండి చుట్టుపక్కల గమనించేవారు. ఇదే క్రమంలో ఈ నెల 11న మొయినాబాద్‌ కేంద్రంలోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో చోరీకి ప్రయత్నించారు. ఏటీఎం యంత్రం ధ్వంసం కాకపోవడం.. చోరీకి యత్నం జరుగుతున్నట్లు ముంబయి కేంద్రంగా ఉండే ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి సమాచారం చేరడంతో బ్యాంకు అధికారులు ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అప్రమత్తం చేశారు. కానీ.. దుండగులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుపోయారు.

పోలీసులకు చిక్కారిలా..
సోమవారం హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయమార్గం గండిపేట కూడలిలో మొయినాబాద్‌ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న మహ్మద్‌ సర్ఫరాజ్‌, మహమ్మద్‌ అమీర్‌ రయీస్‌, మహ్మద్‌ ఫర్దీన్‌ను ఆపారు. వాహన పత్రాలు చూపకపోవడం.. వారి కదలికలపై అనుమానం రావడంతో ఠాణాకు తరలించి విచారించగా.. ఏటీఎం కేంద్రాల్లో చోరీకి ప్రయత్నం చేస్తున్న దుండగులుగా తేలారు. అబ్దుల్‌ రహీం పరారీలో ఉన్నాడు. ముగ్గురినీ రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం కనబర్చిన మొయినాబాద్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్సై జగదీశ్వర్‌ను డీసీపీ అభినందించారు. రివార్డు కోసం సైబరాబాద్‌ కమిషనర్‌కు నివేదించనున్నట్లు వెల్లడించారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద ఆయా శాఖలకు చెందిన బ్యాంకు అధికారులు తప్పనిసరిగా భద్రతను ఏర్పాటు చేయాలని డీసీపీ సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.