close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

మారని వ్యవస్థ.. తీరని అవస్థ!

రైతుబజారు ధరల్లో తకరారు
దశాబ్దాలు దాటినా పాత పద్ధతే
ఆధునికత అందిపుచ్చుకోని మార్కెటింగ్‌ శాఖ

నగరంలోని రైతుబజార్ల తీరు మారడంలేదు. దశాబ్దాలుగా వినియోగదారుడికి న్యాయం జరగడంలేదు. ధరల నిర్ణయంలో తకరారు కొనసాగుతూనే ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన వేళ అనేక వ్యవస్థలు మారాయి. అమ్మకాలు తీరు మారింది. ఇవేవీ రైతుబజార్ల దరిదాపులకు రావడంలేదు. ఒక్కో రైతు బజారులో ఒక్కో ధర అమలవుతోంది. అంతెందుకు అదే రైతు బజారులో ఒకరొకలా.. మరొకరు మరోలా ధరలు నిర్ణయించి అమ్ముకుంటున్నారు. ఆన్‌లైన్‌ ధరలతో దీనిని నియంత్రించడానికి వీలున్నా.. ఆ దిశగా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రయత్నించడంలేదు. ఆఖరుకు వినియోగదారులు ఒక సంఘంగా మారి వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదు. త్వరలో ఆన్‌లైన్లో ధరలు అన్ని రైతు బజార్లకూ వర్తించేలా చర్యలు తీసుకుంటామని గత మూడేళ్లుగా దాటవేస్తున్నారు. నమూనా కోసమైనా ఏ ఒక్క రైతు బజారుకూ వర్తించడంలేదు.

ఈనాడు, హైదరాబాద్‌

రైతుబజారు వ్యవస్థ 1999లో ప్రారంభమైంది. ఒకటొకటిగా విస్తరించి 11 బజార్లు నగరవ్యాప్తంగా ఏర్పడ్డాయి. వీటి సంఖ్య వందల్లో ఉండాల్సి ఉన్నా.. ఆ దిశగా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అడుగులు వేయలేదు. వీటిని ఆధునికీకరించడంలోనూ అదే అలసత్వం. రైతు బజార్లు ప్రారంభమైనప్పుడు ఎలాంటి వ్యవస్థ ఉందో.. అదే నేటికీ కొనసాగుతోంది. కొత్తగా డిజిటల్‌ తూకాలు వచ్చాయి కాని బిల్లులు రావడంలేదు. ఉత్పత్తి, డిమాండ్‌ ఆధారంగా అటు రైతులు నష్టపోకుండా.. ఇటు వినియోగదారుడికి లాభం జరిగేలా మార్కెటింగ్‌ శాఖ అధికారులు ధరలు నిర్ణయిస్తారు. అవే నగరంలోని అన్ని రైతు బజార్లకు వర్తిస్తాయి. విక్రయాలు ఆ ధరల ప్రకారమే జరగాలి. రైతు బజార్లలో అలా జరిగేలా చూడాల్సిన బాధ్యత అక్కడి ఎస్టేట్‌ అధికారులది. మార్కెటింగ్‌ శాఖ అధికారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు జరగడంలేదు. వినియోగదారుడికి ఎన్ని గ్రాములు కొంటున్నామో అన్నింటికి ఎలక్ట్రానిక్‌ బిల్లు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉన్నా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ చర్యలు తీసుకోవడంలేదు.

ఆన్‌లైన్లో బిల్లు రావాలి..
రైతు బజార్లు పెట్టిన 18 ఏళ్ల తర్వాత నగరంలో ‘మన కూరగాయలు’ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. రైతు బజార్లకు కావాల్సినంత స్థలం లేకపోవడంతో ఈ దుకాణాలను మార్కెటింగ్‌ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 60 వరకూ ఏర్పాటుచేశారు. సూపర్‌ మార్కెట్ల మాదిరే కూరగాయలను ఎంపిక చేసి శుభ్రంగా ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారు. వీటిలో ఎక్కడ కొన్నా మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిన ధరలే అమలవుతున్నాయి. ఇష్టానుసారం అమ్మకాలు చేపట్టడానికి లేదు. మరి ఈ వ్యవస్థను రైతుబజార్లకు ఎందుకు వర్తించడంలేదని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 600, 700 గ్రాముల కూరగాయలు కొనుక్కునే వీలే చిక్కడం లేదు. నాణ్యమైన కూరగాయలంటూ.. రైతు బజార్లు నిర్ణయించిన ధరలకు అమ్మలేమని వ్యాపారులు దబాయించడానికి వీలుండదు. మన కూరగాయల దుకాణాలకు ఆన్‌లైన్‌ బిల్లులు వర్తించేలా చేసిన మార్కెటింగ్‌ అధికారులు 20 ఏళ్లుగా కొనసాగుతున్న రైతు బజార్లను ఎందుకు పట్టించుకోవడంలేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు.

ఆధునికతకు పడని అడుగులు..
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన వేళ రైతు బజార్లు ఎందుకు ఆధునికత వైపు అడుగులేయడంలేదని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐటీ హబ్‌గా, విశ్వనగరంగా హైదరాబాద్‌ను కీర్తించడమే కాని ఆధునికతను సంతరించుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా అన్ని రైతు బజార్ల అనుసంధానం జరగాలి. ఏ రైతు బజార్లో ఎంతమంది రైతులున్నారు..? వారు ఏయే పంటలు పండిస్తున్నారు. ఏ రోజు ఎంత సరకు తీసుకొచ్చారు. నిత్యం ఎంతమంది కొనుగోలుదారులు వస్తున్నారు? ఇలా అన్ని వివరాలు ఆన్‌లైన్లో పెట్టాలి. రైతులు, వినియోగదారుల ఫోన్‌ నంబర్లను నమోదు చేసి.. అటు రైతులతోనూ.. ఇటు వినియోగదారులతోనూ ఎస్టేట్‌ అధికారి చర్చించి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ అవసరం. ఇవన్నీ అమలైతేనే మేలు జరిగేది.

ఫోనులో సమాచారం అందేనా..? 

రైతు బజార్లు ఉదయం నుంచే తెరుచుకుంటాయి. ఆ రోజు కూరగాయల దిగుమతులను బట్టి నిర్ణయించిన ధరలు అప్పటికే బజార్లకు చేరాలి. అందరూ ఆండ్రాయిడ్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు నిర్ణయించిన ధరల వివరాలు అటు రైతులకు.. ఇటు వినియోగదారులకు చేరిపోవాలి. ప్రస్తుతం రైతుబజార్లలో ధరల మార్పును అక్కడి ఎస్టేట్‌ అధికారి ప్రదర్శనకు ఉంచాలి. వివరాలను మార్చకపోతే.. నిన్నటి ధరలకే అమ్ముకొనే వ్యవస్థ పోవాలి. ప్రతి రైతు తన దుకాణంలో అధికారులు నిర్ణయించిన ధరలను ప్రదర్శనగా ఉంచాలి. చరవాణికి వచ్చిన ధరల వివరాలపైనే విక్రయాలు జరగాలి. అలాగే ఇంటికి కూరగాయలు అందించే వ్యవస్థ ఏర్పడాలి. చరవాణిలో ధరలను చూసుకొని.. కాస్త ఎక్కువ మొత్తంలో కూరగాయల వినియోగం ఉన్నవారు, హోటళ్లవారు.. ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేసి ఇంటికి తెప్పించుకునే వ్యవస్థ ఏర్పడాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇందుకు టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఆ దిశగా రైతుబజార్లు సేవలందిస్తాయా.. మార్కెటింగ్‌ అధికారులు చర్యలు తీసుకుంటారా అని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.