close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

మార్పు కోరుతూ ముందుకు..!

నగరంలో తొలిసారి ప్రారంభమైన ‘ఫ్లాగ్‌ షిప్‌’
ఎంపికైన 35 మంది యువత
సామాజిక అంశాలపై అవగాహన పెంచడమే లక్ష్యం
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

‘నేడు యువత ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిపై అధ్యయనం చేసి విశ్లేషణ చేసి ఆయా వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపాలి. ఇందుకు రకరకాల మాధ్యమాల ద్వారా చేరువ కావాలి. ఇదంతా చేయాల్సింది ఎవరో కాదు తోటి యుక్తవయసు పిల్లలే.’ ఇదే భావనతో ముందుకెళ్తోంది యంగ్‌లీడర్స్‌ ఫర్‌ యాక్టివ్‌ సిటిజన్‌ షిప్‌ ఇండియా(వైఎల్‌ఏసీ). ఇన్‌స్టాగ్రామ్‌ సహకారంతో యువతీ, యువకుల్లో సామాజిక స్పృహ పెంచేందుకు ‘ఫ్లాగ్‌ షిప్‌’ కార్యక్రమాన్ని నగరంలోని మైండ్‌స్పేస్‌ ఫేస్‌బుక్‌ కార్యాలయం వద్ద సోమవారం ప్రారంభించింది. 2017 ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికే దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతాలో కొనసాగుతుండగా హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి.

ఏం చేస్తారంటే..
వివిధ సమస్యల గురించి ఆలోచించి, స్పందించి, తమ భావాలను యథేచ్ఛగా వ్యక్తపరిచే యువతీ, యువకులను ఉద్దేశించినదే యూత్‌ ఫెలోషిప్‌ కార్యక్రమం. ఒక దీపం వెలిగిస్తే అది మరో వెయ్యి దీపాలను వెలిగిస్తుందన్న భావనతో దీనికి రూపకల్పన చేసింది వైఎల్‌ఏసీ ఇండియా. సామాజిక అంశాలపై అవగాహన పెంచడంతో పాటు వాటిపై స్పందించే విధానంలో నైపుణ్యాలు పెంపొందించి ఇతరులలో చైతన్యం కల్పించే ఉద్దేశంతో ముందుకెళ్తోంది. 13-18 సంవత్సరాల యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించి మౌఖిక పరీక్ష, బృంద చర్చల ద్వారా ఓ బృందాన్ని ఏర్పాటుచేస్తారు. వీరు మరికొన్ని బృందాలుగా విడిపోతారు. మానసిక స్థైర్యం, లింగ సమానత, చేసే పనిలో వైవిధ్యం, స్థిరత్వం, ఇతరుల బెదిరింపుల నుంచి రక్షణ తదితర అంశాలపై భావాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక ఖాతా ద్వారా యువత వ్యక్తపరచాల్సి ఉంది. కళలు, రచనలు, గీతాలాపన తదితరాల ద్వారా ఇతరుల్లో చైతన్యం కల్పించడంతో పాటు బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపనున్నారు.

35 మంది ఎంపిక...
ఫెలోషిప్‌లో పాల్గొనేందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా అర్హతల ప్రకారం 60 మందిని గుర్తించారు. బృంద చర్చలు, ముఖాముఖి నిర్వహించి అంతిమంగా 35 మందిని ఎంపిక చేశారు. రెండు నెలలపాటు వీరంతా వైఎల్‌ఏసీ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. అనంతరం నిర్దేశించిన ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, బస్తీల్లో సామాజిక అంశాలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఒకేలా ఆలోచన ఉన్నవారంతా
- వంశిక దేవుని, 9వ తరగతి, లిటిల్‌ఫ్లవర్‌ హైస్కూల్‌

ఒకే ఆలోచన ఉన్నవారు ఒకే వేదికపై కలుసుకోవడం గొప్ప విషయం. సామాజిక అంశాలపై కవితలు, శీర్షికలు, చిత్రాల ద్వారా మా లక్ష్యాన్ని సాధించనున్నాం. మాతో పాటు సమాజంలోనూ మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.

 వైవిధ్యంగా భావాల వ్యక్తీకరణ
- ద్రిష్టి మంగార్‌, గ్లెండల్‌ అకాడమీ

తొలిసారి నా స్నేహితురాలి ద్వారా ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్నాను. ఎదుటివారికి త్వరగా అంశం అర్థమయ్యేలా ఫొటోలు, రాతలు, దృశ్య కళ ద్వారా ముందుకెళ్తా. అనేక కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ దేశ పౌరురాలిగా మరింత బాధ్యతతో నడుచుకునేందుకు దోహదపడుతుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.