close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

ప్రయోగం.. ‘జీవ’నాధారం!

బయో ఉత్పత్తుల తయారీ దిశగా ఓయూ అడుగులు
రూ.3.6 కోట్లతో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు

ప్లాస్టిక్‌భూతం ప్రపంచాన్ని వణికిస్తోంది.. పర్యావరణాన్ని నాశనం చేస్తోంది.. దాని వాడకం తగ్గించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవు. ప్లాస్టిక్‌కు సరైన  ప్రత్యామ్నాయం ఏమిటి..?
నైలాన్‌ తయారీతో ప్రాణాంతక బెంజిన్‌ వంటి రసాయనాలు విడుదలవుతాయి.. ఇప్పటికే పరిశ్రమలు పెద్దఎత్తున వీటిని విడుదల చేస్తుండటంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ఈ దశలో నైలాన్‌ను నియంత్రించి దానికి తగ్గ ప్రత్యామ్నాయం తీసుకురాగలమా..?
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల వాడకం పెరిగిపోయి గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ప్రమాదకరంగా కార్బన్‌మోనాక్సైడ్‌ వంటి వాయువులు చేరుతున్నాయి. వీటిని తగ్గించే చర్యలు చేపట్టగలమా?

ఈనాడు, హైదరాబాద్‌

ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తూ పరిశోధనలకు పదును పెట్టనుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ప్లాస్టిక్‌, నైలాన్‌లకు బదులుగా బయో పాలీమర్స్‌, పెట్రోల్‌తో కలిపి వాడేందుకు జీవ ఇంధనం వంటివి ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసింది. సూక్ష్మజీవశాస్త్రం(మైక్రోబయోలజీ) విభాగం ఆధ్వర్యంలో మైక్రోబియల్‌, ఫెర్మంటేషన్‌ ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తరఫున రుసా కార్యక్రమంలో భాగంగా పరిశోధన, అభివృద్ధి కోసం వచ్చిన నిధులలో రూ.3.6 కోట్లను వెచ్చించి ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. మైక్రోబయోలజీ విభాగాధిపతి ప్రొ.బి.భీమా ఆధ్వర్యంలో జీవ ఇంధన ఉత్పత్తులపై పరిశోధనలు చేపట్టనున్నారు. ఇందుకు వర్సిటీలోని మొక్క పరమాణు జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, సాంకేతిక విభాగం సహకారం అందించనున్నాయి.

పరిశోధన ఇలా..
మనిషి జీవితంలో ప్లాస్టిక్‌, నైలాన్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటివి కీలకంగా మారాయి. వీటి కారణంగా ప్రమాదకర రసాయనాలు వాతావరణంలోకి చేరుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధన ఉత్పత్తులు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దేశంలో ఈ తరహా ప్రయోగాలు ఊపందుకున్నాయి. దీనిని ఉస్మానియా వర్సిటీ అందిపుచ్చుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా పంట వ్యర్థాలు(ఉదాహరణకు గడ్డి, పత్తి మొక్కల కాండాలు) సేకరిస్తారు. వీటిని ఫెర్మంటేషన్‌, మైక్రోబియల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిన్నపాటి రేణువులుగా మార్చుతారు. వీటికి ఈస్ట్‌, ఇతర బ్యాక్టీరియా సాయంతో రెండు, మూడు రోజులు మురగబెడతారు. దీనివల్ల ఆ మొక్కల్లో ఉండే గ్లూకోజ్‌, లిగ్నోసెల్యూలోజ్‌ బయటకు వస్తాయి.

ఏడాదిలోగా ఫలితాలు
ఈ ప్రయోగశాల ద్వారా చేపట్టిన ప్రయోగాలు ఏడాదిలోగా కొలిక్కి తీసుకువచ్చేలా కృషి చేయనున్నట్లు ప్రొఫెసర్‌ భీమా వివరించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా లీటరు నుంచి పది లీటర్ల వరకు బయో ఇంధన ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రారంభించినా అవసరమైన పరికరాలు అందుబాటులోకి రాలేదు. మరో నెల లేదా నెలన్నర రోజుల్లో వర్సిటీకి అందే అవకాశం ఉందన్నారు.

కాలుష్యాన్ని తగ్గించేలా..
లిగ్నోసెల్యూలోజ్‌ సాయంతో బయోపాలీమర్స్‌ తయారీకి ఎంతో ఉపయోగపడతాయి. బయోపాలీమర్స్‌ సాయంతో జీవప్లాస్టిక్‌ వంటివి తయారుచేయవచ్చు. నైలాన్‌కు ప్రత్యామ్నాయంగానూ వీటిని ఉపయోగించే వీలుంది. బయోపాలీమర్స్‌ అనేవి భూమిలో ఇట్టే కలిసిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు. అలాగే గ్లూకోజ్‌ సాయంతో ఇథనాల్‌కు ప్రత్యామ్నాయంగా బయోఇథనాల్‌ తయారుచేయవచ్చు. దీనిని పెట్రోల్‌, డీజిల్‌లలో కలిపి వాడితే వాతావరణ కాలుష్యాన్ని చాలావరకు నియంత్రించే వీలుందని ప్రొఫెసర్‌ భీమా వివరించారు. వీటికితోడు జీవావసర బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్‌)ను ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రయోగశాలలో పరిశోధనలు చేయనున్నారు. బ్యాక్టీరియాలో జన్యుపరమైన మార్పులు చేయడం ద్వారా మనిషికి అవసరమైన విధంగా మలిచేలా చేయనున్నారు. దీనివల్ల వివిధ రకాల జబ్బులను తగ్గించే వీలు ఏర్పడుతుంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.