close

మంగళవారం, ఆగస్టు 20, 2019

ప్రధానాంశాలు

వారిది వీరిది అడ్డదిడ్డం...

రహదారులపై వాహనదారుల ఇష్టారాజ్యం
చలానాలు రాయడంపైనే పోలీసుల దృష్టి
నానాటికీ తీవ్రమవుతున్న ట్రాఫిక్‌ సమస్య
ఈనాడు, హైదరాబాద్‌

‘సార్‌... జర అర్జెంటయింది... ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అందుకే ఈ దారిలో వెళ్తున్నా... చుట్టూ తిరిగి వెళ్లాలంటే పది నిమిషాలు ఆలస్యమవుతుంది... ఈ సారికి ఫైన్‌ వెయ్యకండి... బండి దిగి నెట్టుకుంటూ పోతా’..
‘మా చెల్లికి ఆరోగ్యం బాగాలేదు... మందుల కోసం దుకాణానికి వచ్చా.. రెండు నిమిషాల్లో మందులు కొనుక్కొని వెళ్దామనుకున్నా.. దుకాణం లోపల చాలామంది ఉన్నారు.. అందుకే ఆలస్యమైంది. మీరు చలానా రాయొద్దండి... మరోసారి ఇలా చేయను... ఇప్పటికి వదిలేయండి సార్‌...’

- అపసవ్య దిశలో(రాంగ్‌రూట్‌) వెళ్తూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన యువకుడు, పార్కింగ్‌ లేనిచోట ద్విచక్ర వాహనాన్ని నిలిపిన ఓ డిగ్రీ విద్యార్థి... పంజాగుట్ట, హిమాయత్‌నగర్‌లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులతో అన్నమాటలివి. నిబంధనల ప్రకారం... ఈ ఇద్దరు యువకులకూ పోలీసులు జరిమానాలు విధించారు. వేగంగా వెళ్లాలన్న తొందర, రహదారులపై వాహనాలను నిలిపినా పోలీసులు పట్టించుకోరన్న ధీమాతో మరికొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. చరవాణిలో మాట్లాడుతూ బైక్‌లను వేగంగా నడుపుతూ వెళ్తే ఆ మజాయే వేరని భావిస్తూ... కొందరు కుర్రాళ్లు హల్‌చల్‌ చేస్తున్నారు. పాతబస్తీ నుంచి హైటెక్‌ సిటీ వరకూ ప్రధాన ప్రాంతాలతో పాటు అనుసంధాన రహదారులపైనా నిబంధనల ఉల్లంఘన నిర్భయంగా సాగిపోతూనే ఉంది. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఫలితం అంతంత మాత్రమే.   జరిమానాలు, కౌన్సెలింగ్‌లతో దారికి వస్తారన్న భావనతో మోటారు వాహన చట్టం ప్రకారం వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

ఎవరూ లేరులే... వెళ్దాం పద

యువకులు, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నవారే ఎక్కువగా అపసవ్యదిశలో రాకపోకలు సాగిస్తున్నారు. ఒకవైపు వాహనాలు వస్తున్నా సరే వాటికి ఎదురుగా వెళ్తున్నారు. ఎడమవైపు నుంచి వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయడం, నో-ఎంట్రీ ప్రాంతాల్లో వాహనాలతో వెళ్లడం వంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి. కార్లు, భారీ వాహనాలు, స్కూల్‌ బస్సుల డ్రైవర్లదీ ఇదే తీరు. ఎదురుగా వాహనాలు వస్తుండటంతో కొందరు వాహనదారులు వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి. ఫలితంగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతోంది. ఈ సమస్య ఎక్కువగా మెహిదీపట్నం, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ప్యారడైజ్‌, జనరల్‌ బజార్‌, ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, ఆబిడ్స్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అంబర్‌పేటల్లో ఉంది. రాంగ్‌రూట్‌లో వెళ్తున్నవారిలో కొందరు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోతున్నారు. రెండు, మూడు నెలల నుంచి ఈ ప్రమాదాలు వరుసగా పెరుగుతుండటంతో పోలీసులు అపసవ్యదిశలో వెళ్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 1.05 లక్షల మందిపై కేసులు నమోదు చేశారు.

శిరస్త్రాణం పెట్టుకుంటే మంచిదేగా!

ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే శిరస్త్రాణాలు తప్పనిసరిగా ధరించాలని  ద్విచక్ర వాహన చోదకులకు పోలీసులు చెబుతున్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. శిరస్త్రాణం ధరించకుండా వాహనాలపై వెళ్తూ చిక్కిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇంత చేస్తున్నా... విద్యార్థులు, యువకులు, ఉదయాన్నే  వృత్తి, ఉద్యోగ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు శిరస్త్రాణం... మనకు అవసరమా? అనుకుంటూ  ధరించకుడానే వెళ్తున్నారు.  పోలీసులు పట్టుకున్నప్పుడు మాత్రం ఇప్పటికి వదిలేయండి... తర్వాత తప్పకుండా పెట్టుకుంటాం అని ప్రాధేయపడుతున్నారు. వివిధ సంస్థలకు చెందిన ఫుడ్‌ డెలివరీ చేసే సిబ్బంది శిరస్త్రాణాలు పెట్టుకోవడం లేదని గుర్తించిన అధికారులు... ఆయా సంస్థల యజమానులతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

బండి నిండుగా...

ఉదయం, రాత్రి వేళల్లో రహదారులపై పోలీసులు ఉండబోరన్న ధీమాతో కొందరు ముగ్గురు, నలుగురు చొప్పున ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. పాతబస్తీ, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, అబిడ్స్‌, కోఠి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈ తరహా ప్రయాణాలు ఎక్కువ. డిగ్రీ, ఇంటర్‌, ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న విద్యార్థుల్లో కొందరు ముగ్గురు కలిసి ఒకే వాహనంపై కళాశాలలు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్‌పై దృష్టి పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు.     గత మూడు నెలల్లో 24 వేల మంది వాహనచోదకులపై కేసులు నమోదు చేశారు. చోదక పత్రం లేనివారి వాహనాన్ని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులను పిలిపిస్తున్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

స్థలముంటే చాలు... బండి పెట్టేయడమే...

వాణిజ్య ప్రాంతాలు... షాపింగ్‌మాల్స్‌... మల్టీప్లెక్స్‌లు... హోటళ్లు... రెస్టారెంట్లు... నగరంలో నిత్యం ట్రాఫిక్‌జాంలు ఉత్పన్నమవుతున్న ప్రాంతాలివి.  ట్రాఫిక్‌ పోలీసులు ఆయా చోట్ల నో-పార్కింగ్‌ సూచికలను ఉంచుతున్నారు. ఎవరైనా వాహనాలను అక్కడ పార్కింగ్‌ చేస్తే... రాంగ్‌ పార్కింగ్‌ కింద జరిమానా విధిస్తున్నారు. అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, అబిడ్స్‌, కోఠి, మొజంజాహీ మార్కెట్‌, అఫ్జల్‌గంజ్‌, మదీనా, చార్మినార్‌, బహదూర్‌పురా వంటి ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ఛాయ్‌దుకాణాల దగ్గర ద్విచక్ర వాహనాలు, కార్లను రహదారులపైనే ఉంచుతున్నారు. ఫలితంగా అటుగా రాకపోకలు కొనసాగించే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. రెడ్‌ సిగ్నల్‌ పడితే ఇక అంతే... ట్రాఫిక్‌జాంలో చిక్కుకోవాల్సిందే. షాపింగ్‌, హోల్‌సేల్‌ దుకాణాలకు వచ్చేవారు సికింద్రాబాద్‌, అబిడ్స్‌, బేగంబజార్‌, గోషామహల్‌ ట్రూప్‌బజార్‌లలోని హోల్‌సేల్‌ దుకాణాల ముందే ఉంచుతున్నారు. సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ రోడ్‌, జనరల్‌బజార్‌, మహంకాళి పోలీస్‌ స్టేషన్‌రోడ్‌లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పార్కింగ్‌లేని ప్రాంతాల్లో నిలిపిన వాహనాలను సమీప పోలీస్‌ ఠాణాలకు తరలిస్తున్నారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ ఉండటం లేదు.

వంచేద్దాం... తప్పించుకుందాం

వాహన చోదకులు జరిమానాలను తప్పించుకునేందుకు కొత్తపంథాను ఎంచుకున్నారు. వాహనాల నంబరు ప్లేట్లను  చివరి అంకె కనిపించకుండా వంచేస్తున్నారు. పోలీసులు ఫొటోలు తీసినా ఫలితం ఉండటం లేదు. గతంలో నంబర్‌ప్లేట్‌పై ఉండే ఆంగ్ల అక్షరాలను మార్చడం, నంబర్లకు నల్లరంగు పూయడం వంటివి చేసేవారు. ఇలాంటి వాహనాల చిత్రాలను కొందరు గుర్తించి  సామాజిక మాధ్యమాల్లో పెడుతుండటంతో అవి విస్తృతం అవుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ తరహా ఉల్లంఘనలపై జూన్‌ ఆఖరు వరకూ 63,235 కేసులు నమోదయ్యాయి.

మితిమీరిన వేగం... ప్రమాదాల మార్గం

వేగంగా వెళ్లాలన్న తాపత్రయంతో ద్విచక్రవాహన చోదకులు కొందరు ప్రమాదాలకు కారకులవుతున్నారు. కూకట్‌పల్లి నుంచి ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌-బేగంపేట, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.  ట్రాఫిక్‌ పోలీసులు కొన్ని కూడళ్ల దగ్గర లేకపోవడంతో ప్రమాదాలైనా వీరికి సమాచారం ఉండటం లేదు.  మితిమీరిన వేగానికి సంబంధించి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 25,852 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఆరు నెలలతో పోలిస్తే 65శాతం ఎక్కువ.

కాస్త పట్టించుకోండి...

ట్రాఫిక్‌ సజావుగా వెళ్లేందుకు ఈ-చలానాలు విధిస్తున్నాం... నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పోలీసులు   మాత్రం ట్రాఫిక్‌ జాంలను పట్టించుకోవడం లేదని వాహనచోదకులు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రధాన కూడళ్ల దగ్గర  ట్రాఫిక్‌ సమస్యలపై దృష్టి పెట్టకుండా శిరస్త్రాణం లేకుండా వెళ్తున్నవారిని, రోడ్డుపై ఉంచిన వాహనాలను పోలీసులు ఫొటోలు తీస్తున్నారని విమర్శిస్తున్నారు. చలానాల విధింపుపై చూపుతున్న శ్రద్ధ వాహనాలు నిలిచినప్పుడు చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* లక్డీకాపూల్‌ నుంచి మాసాబ్‌ట్యాంక్‌ కూడలి వరకూ ఆదివారం మినహా రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ ఒక్క ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ అయినా కనిపించరు.
* హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ నుంచి జగదీష్‌ మార్కెట్‌ మీదుగా చిరాగ్‌అలీలేన్‌ మార్గంలో ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 7 గంటల వరకూ వాహనాలు నిలిచిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
* అమీర్‌పేట కూడలి నుంచి ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ మీదుగా పంజాగుట్ట వరకూ, అమీర్‌పేట బిగ్‌బజార్‌ నుంచి మైత్రివనం దాకా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ రెండువైపులా ట్రాఫిక్‌జాంలు ఉత్పన్నమవుతున్నా నివారణ  చర్యలు లేవు.
* ఖైరతాబాద్‌ కూడలి నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకూ, సంత్‌ నిరంకారి భవన్‌ నుంచి ఖైరతాబాద్‌ కూడలి వరకూ  ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌జాంలు ఏర్పడుతున్నా పోలీసులకు సమాచారం ఉండదు.
* ఖైరతాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల, విద్యాసంస్థల విద్యార్థులు తరగతులు పూర్తయి రోడ్డుపైకి రాగానే వారికోసం వచ్చే ఆటోలు రహదారిని సగం ఆక్రమిస్తున్నాయి. ఈ సమస్యపై పోలీసులు దృష్టి సారించరు.

నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే
- అనిల్‌ కుమార్‌, అదనపు సీపీ(ట్రాఫిక్‌)

వాహనచోదకులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఎవరికీ మినహాయింపు లేదు. ఓ పదిమంది రాంగ్‌రూట్‌లో వెళితే మిగిలినవారూ అలాగే చేస్తారు. ఎడమవైపు వెళ్లేవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. చాలామంది వాహన చోదకులు ఎడమవైపు వెళ్లకున్నాసరే.. వెనుక వచ్చే వాహన చోదకులకు అడ్డుగా ఉంటున్నారు. 
* పార్కింగ్‌లేని ప్రాంతాల్లో వాహనాలను ఉంచడం వల్ల ట్రాఫిక్‌జాంలు ఉత్పన్నమవుతున్నాయి. నగరంలో సుమారు 300 ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్‌ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ కార్యాలయాల్లో స్థలం ఉంటే ఉచితంగా వాహనాలను పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలిపిన వారితో తొలుత సిబ్బంది మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి వాహనాలు తీయాలని కోరుతున్నారు. వారి నుంచి స్పందన లేకపోతేనే జరిమానా విధిస్తున్నారు. పోలీసు, ప్రభుత్వ వాహనాలకూ జరిమానా విధిస్తున్నాం. 
* సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ ఉల్లంఘనలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. వీటిపై అవగాహన సదస్సులను మరింత విస్తృతంగా నిర్వహిస్తాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.