close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

జీహెచ్‌ఎంసీకి కేంద్రం నుంచి మరో రూ.26 కోట్లు!

బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు ప్రోత్సాహకం
ఈనాడు, హైదరాబాద్‌

కేంద్ర సర్కారు నుంచి జీహెచ్‌ఎంసీకి మరోమారు రూ.26 కోట్లు రాబోతున్నాయి. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ) పనుల కోసం బల్దియా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) ద్వారా 2017-18లో రూ.200 కోట్లను, 2018-19లో రూ.195 కోట్లను రాబట్టింది. మొదటి విడత నిధుల సమీకరణ జరిపిన సమయానికి దేశంలో మరే ఇతర నగరపాలక సంస్థ ఆ స్థాయిలో సాహసం చేయలేదు. బల్దియా తర్వాతి స్థానంలో పుణె నగరపాలక సంస్థ నిలిచింది. బాండ్ల జారీతో నిధులు సమీకరించేందుకు స్థానిక సంస్థలు పోటీ పడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పటికే పిలుపు ఇచ్చారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాము ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి బాండ్ల రూపంలో రుణానికి వెళ్లామని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు జీహెచ్‌ఎంసీ లేఖ రాసింది. రూ.200 కోట్లను పదేళ్ల కాలపరిమితికి ఏడాదికి 8.9 శాతం వడ్డీతో తీసుకున్నామని, కనీసం వడ్డీలో 2 శాతం భరించాలని కోరింది. అంటే రూ.36 కోట్ల సాయం చేయాలని అడిగింది. అభ్యర్థనను ఆలకించిన కేంద్ర సర్కారు తన వంతుగా ప్రోత్సాహకం కింద మార్చి, 2018లో రూ.26 కోట్లు ప్రకటించింది. ఇవి ఇప్పటికే వడ్డీ కింద జమవుతున్నాయి.

వేగం పుంజుకోనున్న ఎస్సార్డీపీ..
పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ఎస్సార్డీపీ ప్రాజెక్టు పనులు కొంతకాలంగా నెమ్మదిగా సాగుతున్నాయి. నిధుల కొరతతో సుమారు రూ.100 కోట్ల బిల్లులు ఆగిపోయాయి. త్వరలో బాండ్ల జారీతో నిధులు ఖాతాలో జమ అవుతాయని, నత్తనడకన సాగుతున్న  పనులు వేగం పుంజుకుంటాయని ఇంజినీర్లు చెబుతున్నారు.

మరోమారు రూ.200 కోట్లకు...
ఎస్సార్డీపీ పనుల కోసం రెండో విడతలోనూ బాండ్ల జారీతో రుణం తీసుకుని ప్రోత్సాహకం కోసం లేఖ రాస్తే కేంద్రం నుంచి స్పందన రాలేదు. తాజాగా మూడో విడత నిధుల సమీకరణకు ఆర్థిక విభాగం కసరత్తు ప్రారంభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు బాంకర్లతో సమావేశాలు నిర్వహించింది. ఇదే సమయంలో దేశంలోని పలు స్థానిక సంస్థలు బాండ్ల జారీతో నిధుల సేకరణకు సిద్ధమయ్యాయి. అవన్నీ కేంద్రానికి ఆర్థిక సాయం కోసం ఇటీవల లేఖలు పంపాయి. పరిశీలించిన సంబంధిత మంత్రిత్వశాఖ బాండ్లు జారీ చేసే తేదీల ఆధారంగా మొదటి 12 స్థానిక సంస్థలకు ప్రోత్సాహకం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గరిష్ఠంగా రూ.26 కోట్లు (ప్రతి రూ.100కోట్ల సమీకరణకు రూ.13 కోట్ల ప్రోత్సాహకం) ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన రెండోమారు జీహెచ్‌ఎంసీకి రూ.26 కోట్లు అందడం ఖాయమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాత్సారం చేయకుండా వీలైనంత త్వరగా బీఎస్‌ఈ ద్వారా బాండ్లు జారీ చేస్తామంటున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.