close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

సర్కారు బడి.. సమస్యల ఒడి!

సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక
అత్యవసర పనులకు విద్యాశాఖ ప్రతిపాదనలు
కలెక్టర్‌ చొరవతో రూ.2.27 కోట్లు నిధులు
ఈనాడు, హైదరాబాద్‌

విద్యాసంవత్సరం ప్రారంభంకాగానే పాఠశాలల్లో సమస్యలు గుర్తుకు వస్తాయి. నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతుంటారు. ఏటా ఈ తంతు కొనసాగుతూనే ఉంటుందని అధికార యంత్రాంగం విమర్శలు చవిచూడాల్సి వస్తోంది. ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయి వసతులు కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు నివేదిక తయారు చేసి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరో వారం రోజుల్లో విద్యాశాఖకు నిధులు అందుతాయని సమాచారం. ముషీరాబాద్‌ ఉన్నత పాఠశాలలో తాగునీటి ఇబ్బందులు.. మాసబ్‌ట్యాంక్‌ వద్ద పాఠశాలల్లో చాలీచాలని గదులు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో పిల్లల్ని సర్కారు పాఠశాలల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించలేకపోతున్నారు.

నిధుల లేమి..
తాగునీటి కోసం ఎదురుచూపులు.. కరవైన మరుగుదొడ్లు.. చాలీచాలని గదులు.. నెలరోజులు దాటినా విద్యార్థులకు అందని ఏకరూప దుస్తులు.. వెరసి సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏళ్లతరబడి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. నిధుల లేమి కారణంతో విద్యాశాఖ మౌనంగా చూస్తోంది. ఏటా సమస్యలు అలాగే ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పట్ల తరచూ చిన్నచూపు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించలేక వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు అడుగులు వేస్తున్నారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయల కల్పన నేతిబీర చందంగా మారింది. అధికారుల నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. కుల్సుంపుర ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో నూతన భవన పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీరామ్‌నగర్‌ ఉన్నత పాఠశాలలో భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. ఇద్దరు గుత్తేదార్లు మారినా పరిస్థితి మారలేదు. సుమారు 10-15 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కేవలం అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఆగిపోయాయి.

పరిశీలనతో పరిష్కారం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అద్వాన పరిస్థితులను చక్కదిద్దేందుకు కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కన్నన్‌ సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మండలస్థాయిలో బడుల పరిస్థితులను పరిశీలించామని విద్యాశాఖను ఆదేశించారు. ఎంఈవో, డీవైఈవోల ద్వారా మౌలిక సౌకర్యాలు లేని వాటి వివరాలను సేకరించారు. పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు సుమారు రూ.63 కోట్లు ఖర్చవుతాయని గుర్తించినట్లు సమాచారం. వాటిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పాఠశాలల వివరాలను వేరు చేశారు. పాఠశాలల మరమ్మతులు, మరుగుదొడ్లు, అదనపు గదులు, తాగునీటి వసతి కల్పనకు రూ.8.75కోట్లు అవసరమవుతాయని తేల్చారు. ఈ మేరకు సర్వశిక్ష అభియాన్‌ ఇంజనీర్లు నివేదిక తయారు చేశారు. నిధుల కేటాయింపు కోరుతూ కలెక్టర్‌ ప్రతిపాదనలు పంపారు. అక్కడ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో నిధులు విద్యాశాఖకు అందుతాయని వారు వెల్లడిస్తున్నారు.

త్వరలో నిధులు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు అన్నిచోట్ల మరుగుదొడ్లు ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.వెంకటనర్సమ్మ తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా బాలికల ఉన్నతపాఠశాలల్లో 18 యూనిట్లు, పాత భవనాల మరమ్మతులు, 76 చోట్ల బోర్లు ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. తాగునీటి ఇబ్బందులు ఉన్నచోట్ల సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నెల చివరికల్లా నిధులు మంజూరవుతాయని స్పష్టంచేశారు. ఈ విషయంలో కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కన్నన్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారని వివరించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.