close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

వసతి గృహాలెంత భద్రం

ప్రమాదకరంగా స్విచ్‌బోర్డులు

● ఖమ్మం ఘటనతోనైనా మేల్కొనాలి

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

కామారెడ్డి ఎస్సీ బాలుర వసతిగృహంలో వేలాడుతున్న విద్యుత్తు తీగలు

ఖమ్మం ఎస్సీ బాలికల వసతిగృహంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఒక బాలిక మృతిచెందింది. మరో నలుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో విద్యుత్తు తీగలు సక్రమంగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. రాత్రిపూట జరిగిన ఈ ఘటనలో విద్యార్థినుల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. దీంతో హాస్టళ్లలో భద్రత ఏమిటన్నది ప్రశ్నార్థకమైంది. జిల్లాలో వివిధ వసతి గృహాల్లో వేలాడుతున్న తీగలు, పగిలిన స్విచ్‌బోర్డుల కారణంగా వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది.

*● లింగంపేట ఎస్సీ బాలుర హాస్టల్‌లో 60 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ విద్యుత్తు బోర్డులు పగిలిపోయి ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరింది. వర్షాలు కురిస్తే గోడలు తడిసి విద్యుత్తు సరఫరా అవుతోంది. ఏళ్ల నుంచి మరమ్మతులు చేయలేదు. ఇక్కడ విద్యుత్తు నిర్వహణ వ్యవస్థ అధ్వానంగా ఉంది.

*●● పిట్లంలో ఎస్సీ బాలుర వసతిగృహం కూలడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ 60 సీట్లకు గాను 30 మంది మాత్రమే ఉన్నారు. విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.

*● జుక్కల్‌ ఎస్సీ బాలుర హాస్టల్‌లో పైకప్పు కూలి పెచ్చులు కింద పడుతున్నాయి.

*● కామారెడ్డి బీసీ బాలుర, ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ భవనాల్లో విద్యుత్తు తీగలు, స్విచ్‌బోర్డుల నిర్వహణ సక్రమంగా లేదు.

వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులు

అసలే వర్షాకాలం. పైగా గదుల్లో వర్షం నీరు ఊరుస్తోంది. తీగలు గోడలకు ఆనుకొని ఉండటంతో విద్యుత్తు సరఫరా జరిగి ప్రమాదాలకు ఆస్కారముంది. ఏళ్ల నాటి భవనాల్లో మరమ్మతులు చేపట్టడకపోవడం, తీగలను సరి చేయకపోవడంతో సమస్య ఎదురవుతోంది. వార్డెన్లు సమస్యను గుర్తించి ఉన్నతాధికారులకు విన్నవించడం లేదు. గతంలో పలు చోట్ల వర్షాకాలంలో విద్యుదాఘాతానికి గురైన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో అన్ని హాస్టళ్లలో కలిపి 6500 మంది విద్యార్థులు చదువుతున్నారు. జుక్కల్‌, దోమకొండ, ఎల్లారెడ్డిలో ఎస్సీ వసతిగృహాలు శిథిలావస్థకు చేరాయి. వానకాలంలో గదుల్లో నీరు కారుతుండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రిపూట స్విచ్‌లు వేయాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది.

పాత భవనాల తీరు మారిస్తేనే..

జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన 69 హాస్టళ్లలో పాతిక భవనాల్లో సమస్యలున్నట్లు అధికారులు గుర్తించారు. భవనాల పైకప్పుల పెచ్చులు రాలుతున్నాయి. అదనపు భవనాల నిర్మాణాలను చేపట్టడంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రహరీలు సక్రమంగా లేవు. రాత్రి పూట రక్షణ కరవైంది. జిల్లా స్థాయి పర్యవేక్షణాధికారులు విద్యార్థుల బాగోగులపై అంతంగా శ్రద్ధ చూపడం లేదు.

అస్తవ్యస్తంగా విద్యుత్తు తీగలు

*● జిల్లాలో 30-40 భవనాల్లో విద్యుత్తు తీగలు వేలాడుతున్న పరిస్థితి ఉంది.

*● 25-35 వసతి గృహాల్లో స్విచ్‌ బోర్డులు సక్రమంగా పనిచేయడం లేదు.

*● వానకాలంలో భవనాల్లో నీరు కారితే విద్యుత్తు బోర్డులు తడిసి విద్యుదాఘాతానికి ఆస్కారముంది.

*● మరమ్మతులకు నిధులు లేక ఈ సమస్య తలెత్తుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

మరమ్మతులపై దృష్టి

- శ్రీనివాసబాబు, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి

అన్ని భవనాల్లో విద్యుత్తు తీగలు, స్విచ్‌బోర్డుల మరమ్మతులపై దృష్టి పెడతాం. నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు గోడలను తాకొద్ధు తీగలు వేలాడే చోట అప్రమత్తంగా ఉండాలి. వాటి నిర్వహణ బాధ్యత పూర్తిగా వార్డెన్లే చూడాలి.

వాన కురిస్తే సమస్య

- ఆజాద్‌, బహుజన విద్యార్థి సమాఖ్య ప్రతినిధి

సంక్షేమ వసతి గృహాల్లో వర్షాలు కురిస్తే విద్యార్థులకు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గోడల నుంచి విద్యుత్తు బోర్డులకు నీరు కారి సమస్య ఎదురవుతోంది. స్విచ్‌ వేయాలంటే విద్యార్థులు జంకే పరిస్థితి నెలకొంది. వసతి గృహాల్లో విద్యార్థుల రక్షణపై చర్యలు ఉండడం లేదు.

ఏళ్ల నాటి వ్యవస్థతో ఇక్కట్లు

- గణేశ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి

జిల్లాలో చాలా భవనాల్లో ఏళ్ల నాటి విద్యుత్తు సరఫరా వ్యవస్థతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లింగంపేట, జుక్కల్‌లో సమస్య తీవ్రంగా ఉంది. పాత బోర్డులు, వేలాడే విద్యుత్తు తీగలు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేదు. విద్యార్థుల రక్షణకు చర్యలు కరవయ్యాయి. ప్రభుత్వం చొరవ చూపి ఏళ్ల నాటి భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలి.

వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులు

వివరాలు

*ఎస్సీ 30

*బీసీ 26

*ఎస్టీ 13

*మొత్తం విద్యార్థులు 6500

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.