close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

లెక్కలు.. చిక్కులు  

సందిగ్ధంలో గతంలో బరిలో నిలిచిన అభ్యర్థులు

‘పుర’ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బరిలో నిలిచేందుకు ఆశావహులు ఎదురు చూస్తున్నారు.. ఇందులో కొందరికి ఎన్నికల సంఘం ఈసారి చేదు గుళిక వేసింది. 2014 ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని అభ్యర్థులను మూడేళ్లపాటు పోటీకి అనర్హులుగా ప్రకటించింది. ఆ గడువు ఈ ఏడాది చివరి వరకు ఉండటంతో వేటు పడినవారు తలలు బాదుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఉభయ జిల్లాల్లో చాలా మంది అనర్హత జాబితాలో ఉన్నారు. వారిలో కనీసం 20 శాతం మంది మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎదురుచూస్తున్న వారే. ఎన్నికలు ముగిశాక ఒక్కరోజు కూర్చుని ఖర్చు వివరాలు సమర్పిస్తే పోయేది.. అని ఇప్పుడు కలవరపడుతున్నారు. మరికొందరేమో అనర్హత గడువు తీరాకనే ఎన్నికలు వస్తాయన్న ధీమాతో ఉండగా ఈ హఠాత్పరిణామంతో కంగుతింటున్నారు.

ఇదీ నేపథ్యం...

ఎన్నికల నియమావళిని అనుసరించి పోటీ చేసే అభ్యర్థులు నామపత్రాలు సమర్పించే సమయంలో బ్యాంకు ఖాతాను సమర్పించాలి. ఈ ఖాతా ద్వారానే ఎన్నికల వ్యయం చేయాలి. ఈ ఖర్చు నిబంధనలకు లోబడి ఉండాలి. మున్సిపాలిటీల్లో 2013 ఆగస్టు 20న జారీ చేసిన ఉత్తర్వు మేరకు నగరపాలక సంస్థ కార్పొరేటర్‌ అభ్యర్థి రూ.1.50 లక్షలు, మున్సిపల్‌లో కౌన్సిలర్‌ అభ్యర్థి రూ.లక్ష వరకు ఖర్చు చేయొచ్ఛు ఫలితాలు వెల్లడైన నాటి నుంచి 45 రోజుల్లోగా సంబంధిత ఖర్చు వివరాలను అధికారులకు అందజేయాలి. వ్యయంలో ఉల్లంఘనకు పాల్పడినా, వివరాలు సమర్పించడంలో నిర్లక్ష్యం వహించినా అనర్హత వేటు పడుతుందని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి.

ఇప్పుడేం జరిగింది?

మున్సిపాలిటీలకు 2014 ఏప్రిల్‌ 30న పోలింగ్‌ జరిగింది. మే 12న ఫలితాలు వెలువడ్డాయి. గెలిచిన అభ్యర్థులతో సహా ఓడిపోయిన వారిలో చాలా మంది ఖర్చు వివరాలు సమర్పించకుండా తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ఈసీ తదుపరి చర్యలు చేపట్టింది. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2017 జనవరి 16 నుంచి 2019 డిసెంబరు 30 వరకు ఈ నిషేధం ఉండనుంది. కొందరికి 2020 ఏప్రిల్‌ వరకు కొనసాగనుంది.

ఉభయ జిల్లాల్లో 298 మంది అనర్హులు

ఉభయ జిల్లాల్లోని నాలుగు పురపాలికల్లో 298 మందిపై అనర్హత వేటు పడింది. జాబితాలో ఉన్న వారిలో కొందరు మృతి చెందగా... చాలా మంది పోటీకి దూరంగా ఉండే అవకాశముంది. జాబితాలో ఎక్కువ మంది బోధన్‌ మున్సిపాలిటీకి చెందిన వారే ఉన్నారు.

అభ్యర్థులకిచ్చే పుస్తకంలోనే నిబంధనలు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామపత్రాలు సమర్పించాక నియమావళి పుస్తకాన్ని అందజేస్తారు. అందులో ఏ చట్టం ఏం చెబుతుందని స్పష్టంగా వివరాలు ఉంటాయి.

● సెక్షన్‌ 343 జడ్‌.సీ. ఆధారంగా పోటీలో ఉండే అభ్యర్థి లేదా ఏజెంటు ఫలితాల వెల్లడైనప్పటి నుంచి 45 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారికి ఖర్చు వివరాలు సమర్పించాలి.

● సెక్షన్‌ 15బీ... అభ్యర్థులు వివరాలు సమర్పించడంలో విఫలమయ్యారని, లేదా సరైన హేతువు ఏదైనా వివరించలేని పక్షంలో రెండు చర్యలు చేపట్టడానికి ఎన్నికల సంఘానికి అవకాశం కల్పిస్తుంది.

1. మూడేళ్లపాటు పోటీకి అనర్హులుగా ప్రకటించడం.

2. ఒకవేళ ఎన్నికైతే అభ్యర్థి పదవీచ్యుతుడిని చేయడం.

సమాచారం ఇచ్చాం

- స్వామినాయక్‌, కమిషనర్‌, బోధన్‌

జాబితా ఆధారంగా ఖర్చు వివరాలు సమర్పించని వారికి నోటీసులిచ్చాం. బోధన్‌లో 121 మంది అభ్యర్థులు వివరాలు సమర్పించలేదు. వీరు ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఉత్తర్వులో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.