close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

ఆర్‌యూకు డెబ్‌ దెబ్బ

దూరవిద్యకు గుర్తింపు నిరాకరణ

●2017 మార్గదర్శకాల అమలులో వైఫల్యం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ విభాగానికి చుక్కెదురైంది. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) గుర్తింపు సాధించడంలో అధికారులు విఫలమయ్యారు. వర్సిటీలో సింహభాగం ఆర్థిక వనరులను సమీకరించే ఈ విభాగం కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. గత అధికారులు బోధనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోవడం, ప్రత్యేక విభాగానికి సౌకర్యాలు కల్పించకపోవడం, నిర్దేశిత నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈమేరకు అనుమతిని నిరాకరిస్తూ అధికారికంగా యూజీసీ ఉత్తర్వులు అందాయి.

రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధంగా 2013లో గ్రాడ్యుయేట్‌ (డిగ్రీ) దూరవిద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 కళాశాలల కేంద్రంగా దూరవిద్య ప్రవేశాలు జరుగుతున్నాయి. యూజీసీలో అంతర్భాగమైన డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) ఆర్‌యూకు 2017-18 నుంచి అనుమతులు నిరాకరించింది. వర్సిటీలకు ఏ-గ్రేడ్‌ ఉన్నవాటికి మాత్రమే డెబ్‌ అనుమతులు ఇస్తామని ముందుగా చెప్పింది.. తదనంతరం గతంలో కొనసాగుతున్న వర్సిటీలకు గ్రేడ్‌ లేకపోయినా ఇస్తామంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. చివరగా రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. డెబ్‌ అనుమతుల కోసం ఇక్కడి అధికారులు పలుమార్లు దిల్లీకి వెళ్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే ప్రథమ సంవత్సరం ప్రవేశాలు నిలిపివేశారు. 2017-18 ప్రవేశాలకు ఇటీవల దూరవిద్య పరీక్షలు నిర్వహించారు.

నిబంధనలు ఇవే

2017లో యూజీసీ దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు చెందిన దూరవిద్య కేంద్రాలపై ఉక్కుపాదం మోపింది. దూరవిద్య విభాగాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, వర్సిటీలు విద్యా వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయంటా తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గెజిట్‌ ఆఫ్‌ ఇండియా-2017 నిబంధనలను కచ్చితంగా పాటించాలంటూ స్పష్టం చేసింది. తదతనంతర పరిణామాల నేపథ్యంలో కొన్ని వర్సిటీలు నిబంధనల ప్రకారం దూరవిద్య కేంద్రాలు నడుపుతామంటూ యూజీసీకి రాతపూర్వకంగా హామీ ఇచ్చాయి. ఆర్‌యూ మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేకపోయింది. గత గెజిట్‌ ప్రకారం దేశవ్యాప్తంగా సార్వత్రిక విశ్వవిద్యాలయాలు (దూరవిద్య వర్సిటీలు), సాధారణ విశ్వవిద్యాలయాల్లోని దూరవిద్య విభాగాలకు సంబంధించి అధ్యయన కేంద్రాల నిర్వహణ, పరీక్ష కేంద్రాల కేటాయింపు, పరీక్ష నిర్వహణపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి.

ఆర్‌యూకు 2017-18 నుంచి ప్రవేశాలకు అనుమతి నిరాకరించడంతో పరీక్షల నిర్వహణలో అసాధారణ జాప్యం జరిగింది. 2019-2020 విద్యా సంవత్సరానికి సంబంధించి అనుమతి ఇచ్చే విషయమై యూజీసీ నిపుణుల కమిటీ మూడునెలల క్రితం ఆర్‌యూను సందర్శించింది. అందులో ముఖ్యంగా శాశ్వత ఆచార్యుల భర్తీ విషయం ప్రస్తావించినట్లు తెలిసింది. దూరవిద్యకు సాంకేతికతతో కూడిన ప్రత్యేక విభాగం లేకపోవడం, గదులు, పరీక్షలను పర్యవేక్షించే నిపుణులు అందుబాటులో లేరని గుర్తించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.