close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

పోటీ పడలేకున్నారు !

అలంకారప్రాయంగా బీసీ స్టడీ సర్కిల్‌

● నిరుద్యోగులకు మొక్కుబడి శిక్షణ

● నిధులు పక్కదారి పడుతున్న వైనం

● ఉపకార వేతనాలూ స్వాహా

గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు

న్యూస్‌టుడే-కర్నూలు వైద్యాలయం : నిరుద్యోగులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో 2003లో కర్నూలు నగరంలో బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటుచేశారు. ఏటా నిర్వహణకుగాను ప్రభుత్వం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ శిక్షణ తీసుకున్నవారిలో కనీసం 2 శాతం మందికి కూడా ఉద్యోగాలు రాకపోవడం గమనార్హం. స్టడీ సర్కిల్‌ను ఏర్పాటుచేసి 16 ఏళ్లైనా.. ఏటా నిధులు ఖర్చవుతున్నా ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. జిల్లా బీసీ సంక్షేమాధికారి నిర్వహణ బాధ్యతలు చూస్తుండగా పలువురు ఒప్పంద ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ కరవవడంతో దీని ప్రాధాన్యం సైతం తగ్గిపోతోంది.

శిక్షణ కార్యక్రమం ఇలా..

బీసీ స్టడీ సర్కిల్‌లో వివిధ పరీక్షలకు సంబంధించి శిక్షణల నిమిత్తం ప్రకటన ఇచ్చి అర్హత పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం వంద మందిని తీర్చిదిద్దేందుకుగాను ఎంపిక చేస్తారు. ప్రభుతం నుంచి వచ్చిన నిధులతో ఫ్యాకల్టీని నియమించడం, స్టడీ మెటీరియల్‌ ఇవ్వడంతోపాటు విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తారు. ఏడాదికి కనీసం మూడు నుంచి నాలుగు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుంటారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేలోగా ఉపకార వేతనాలు తదితరాలన్నీ చెల్లించాలి. మంచి నైపుణ్యమున్న బోధకుల చేత శిక్షణ ఇప్పించాల్సి ఉంది.

స్టడీ సర్కిల్‌లో విద్యార్థులకు శిక్షణతోపాటు స్టడీ సర్కిల్‌కు అనుసంధానంగా గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రధాన పత్రికలు, మ్యాగజైన్లతోపాటు గ్రూపు-1, గ్రూపు-2 వంటి పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో పలు విషయాలు తెలుసుకునేందుకుగాను కంప్యూటర్లను సైతం సిద్ధం చేశారు.

జరుగుతున్న తీరిది

బీసీ స్టడీ సర్కిల్‌ మొత్తం కాంట్రాక్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఫ్యాకల్టీ, ఎంపిక, స్టడీ మెటీరియల్‌ తదితరాలను వీరే చూస్తున్నారు. ఇక్కడే సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారిని ఎంపిక చేయడం లేదు. మరోవైపు ఎవరు ఎక్కువగా పర్సంటేజీ ఇస్తే వారి వద్ద మెటీరియల్‌ తీసుకొస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత ప్రమాణాలు కరవవడంతో చివరికి చాలామంది ఇక్కడ శిక్షణ తీసుకొనేందుకు మొగ్గు చూపడం లేదు. ఫలితంగా 30 మందికి మించి రావడం లేదు. కానీ 50 మందికిపైగా హాజరవుతున్నట్లు లెక్కలు చూపి నిధులు కాజేస్తున్నారన్న విమర్శలున్నాయి. శిక్షణ పూర్తైనా మెటీరియల్‌ అందించడం లేదు. చివరికి చాలామంది విద్యార్థులు తమ స్వప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇదే అవకాశంగా తీసుకొని మెటీరియల్‌ ఇచ్చినట్లు చూపి నిధులు మింగేస్తుండడం గమనార్హం. ప్రభుత్వ సొమ్ము స్వాహా - ఆనంద్‌, కర్నూలు

నేను గ్రూప్‌-1కు సన్నద్ధమవుతున్నా. గత రెండేళ్లుగా ఇక్కడికి వస్తున్నా. ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది శిక్షణ పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఫ్యాకల్టీ సైతం బాగా లేదు. తమకు రావాల్సిన ఉపకార వేతనాలను అడిగితేగానీ ఇవ్వడం లేదు. ఇక్కడి సిబ్బంది తీరుపై ఫిర్యాదు చేసినందుకుగాను గ్రంథాలయంలో పుస్తకాలు చదవనీయకుండా చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

మొక్కుబడి కేంద్రమే - రాకేష్‌, నిరుద్యోగి

జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌ వందలాది మందికి ఉపయోగపడాల్సి ఉంది. కానీ ఇది మొక్కుబడి కేంద్రంగా మారింది. ఇక్కడ గత్యంతరం లేక శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. నిరుద్యోగులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. చివరికి పది మంది కూడా శిక్షణకు రావడం లేదు. దీని నిర్వహణను అనుభవమున్న వారికి ఇవ్వాల్సి ఉంది. అప్పుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.

ఉపకార వేతనాలు ఇవ్వలేదు

గోపాల్‌ అనే నిరుద్యోగి ఈ ఏడాది కానిస్టేబుల్‌ కోచింగ్‌ తీసుకొన్నారు. ఆ బ్యాచ్‌లో 54 మందికి కోచింగ్‌ ఇచ్చినట్లు చూపారు. దీనికిగాను రూ.92,366 ఖర్చు చూపారు. విద్యార్థులకు మాత్రం ఇటు ఉపకార వేతనాలు ఇవ్వకపోగా అటు ఉద్యోగాలూ రాలేదు. శిక్షణలో 54 మంది వచ్చినట్లు నిర్వాహకులు చూపగా వాస్తవానికి 30 మందికన్నా ఎక్కువ లేదు. ఇలా నిధులను పక్కదారి పట్టించారు.

ఉపకార వేతనం మింగేశారు

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఆంజనేయులు. ఇతను బీటెక్‌ పూర్తి చేశారు. బయట ప్రైవేటు కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లాలంటే వేలాది రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండడంతో ఆ స్థోమత లేక బీసీ స్టడీ సర్కిల్‌లో బ్యాంకు పరీక్షల కోసం శిక్షణ తీసుకున్నారు. ఇతనితోపాటు సుమారు 50 మందికి రెండు నెలలపాటు మెలకువలు నేర్పించారు. దీనికిగాను రూ.1.40 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. కానీ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. మరోవైపు ఒక్కో విద్యార్థికి రూ.750 ఉపకార వేతనం కింద చెల్లించాల్సి ఉండగా ఇవ్వకపోవడం గమనార్హం.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.