close

సోమవారం, ఆగస్టు 26, 2019

ప్రధానాంశాలు

ఖాళీ స్థలం.. రోగాల భయం

దోమలకు ఆవాసంగా మారుతున్న వైనం
 పట్టించుకోని యజమానులు, పురపాలికలు
 వానాకాలంలో పట్టణ ప్రాంతాల్లో అవస్థలు
వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే:

జిల్లాలో నాలుగు పట్టణాల్లో అనేక కాలనీలు ఉన్నాయి. శివారుల్లో కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం గ్రామాల ప్రాంతాలకు చెందిన ప్రజలు పట్టణాల బాట పడుతున్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఇక్కడి జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. తాండూరు, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లోనూ కొత్త ఆవాసాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని అలాగే వదిలేశారు. దీంతో అవి వీధుల్లో చెత్త దిబ్బలను తలపిస్తున్నాయి. దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. మున్సిపాల్టీలకు చెందిన ఖాళీ స్థలాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్సిన పురపాలక సంఘం, యజమానులు కనీసం అటువైపు చూడటం లేదు. ఈ పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.
* వికారాబాద్‌... వీధుల్లో దుర్గంధం
వికారాబాద్‌ జిల్లా కేంద్రంగా 2016లో ఏర్పడింది. పట్టణంలో ఇటీవల ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. దక్షిణం వైపు మద్గుల్‌చిట్టెంపల్లి, గుడుపల్లి, బూర్గుపల్లి, తూర్పువైపు ధన్నారం, పశ్చిమం వైపు గిరిగిట్‌పల్లి, కొంపల్లి గ్రామాలు పురపాలికలో కలిశాయి. దీంతో పట్ణణం విస్తీర్ణం 46 చదరపు కిలోమీటర్ల నుంచి 56 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. పరిసర గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్‌కు చెందిన వారు వికారాబాద్‌లో స్థలాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా కొన్న వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అంతేకాకుండా పలు పురపాలక స్థలాలు సైతం మురుగుతో నిండిపోయి పట్టణంలో దోమల బెడద పెరిగిపోతోంది.
నిబంధనలు ఇలా..
నిబంధనల ప్రకారం ఖాళీ స్థలాలను లేఅవుట్‌ వేసి ప్లాట్లుగా మార్చినప్పుడు పార్కుల కోసం 5 శాతం ఖాళీ స్థలం వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఈ స్థలం పురపాలక సంఘం స్వాధీనం చేసుకొని ఉద్యానం అభివృద్ధి చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. పురపాలక సంఘం గణాంకాల ప్రకారం పట్టణంలో 131 పైగా ఖాళీ స్థలాలున్నాయి. నిధుల కొరత కారణంగా వీటి వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వర్షం కురిసినప్పుడు మురికి కూపాలుగా మారుతున్నాయి. పరిసరాల్లో నివాసం ఉంటున్న వారు ఇళ్లలోని వ్యర్థాలను ఈ స్థలాల్లో పారేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో దుర్వాసన ముక్కుపుటాలు అదరగొడుతోంది. పాములు, విషకీటకాలు సమీపంలోని ఇళ్లలోకి వస్తున్నాయి.
పన్ను ఏదీ:
పట్టణంలో ఖాళీ స్థలాలకు పన్ను వేయాలని పురపాలక సంఘం అధికారులు ప్రయత్నిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. స్థలం నలుగురైదుగురు చేతులు మారటంతో పన్ను తాఖీదులు ఎవరికి ఇవ్వాలో అర్ధం కావడం లేదని పురపాలక సంఘం అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ఆ స్థలంలో నిర్మాణం అనుమతి కోసం వచ్చినపుడు కొంత పన్ను విధిస్తున్నామని పేర్కొంటున్నారు.
చర్యలు తీసుకుంటాం
- బోగేశ్వర్లు, కమిషనర్‌, పురపాలక సంఘం, వికారాబాద్‌
పట్టణంలోని ఖాళీ స్థలాల్లో నీరు నిలుస్తోంది. ఈ విషయంపై కొందరి యజమానులకు గతంలో తాఖీదులు జారీ చేశాం. శుభ్రంగా ఉంచుకోవాలని సూచించాం. పురపాలక సంఘం స్థలాల్లోనూ నీరు నిలువకుండా చర్యలు తీసుకుంటాం.
పట్టణంలో 131 ఖాళీ స్థలాలు
- టి.శ్రీనివాస్‌ పట్టణ ప్రణాళికాధికారి, పురపాలక సంఘం, వికారాబాద్‌
పురపాలక సంఘానికి సంబంధించిన 131 ఖాళీ స్థలాలున్నాయి. ఖాళీ స్థలాలంటూ బోర్డులను ఏర్పాటు చేశాం. ఈ ఖాళీ స్థలాలను పార్కుల అభివృద్ధి చేయాల్సి ఉంది. నిధులు మంజూరు కాగానే పార్కులుగా అభివృద్ధి చేస్తాం.
తాండూరు.. మురుగు కుంటలు!
న్యూస్‌టుడే, తాండూరు:
జిల్లాలో అధిక జనాభా ఉన్న తాండూరు పట్టణంలో ఖాళీ స్థలాలన్నీ మురుగు కుంటలను తపిస్తున్నాయి. పట్టణంలో 31 వార్డులో 14000 గృహాలు ఉండగా 71,008 మంది జనాభా నివాసం ఉంటోంది. గృహాల్లో వినియోగించిన నీరు పట్టణంలోని 144 కిలోమీటర్ల పొడవున ఉన్న కాలువల ద్వారా పాతకుంట, మల్‌రెడ్డిపల్లి చెరువు, గొల్లచెరువు, కాగ్నానదిలోకి వెళ్తున్నాయి. కాల్వలు సక్రమంగా లేనిచోట్ల మురుగు ఖాళీ స్థలాల్లో చేరుతోంది. దీనికి అడపా దడపా కురుస్తున్న వర్షం తోడుకావడంతో ఆయా ప్రాంతాలు కంపు కొడుతున్నాయి.
వ్యాధులతో సతమతం..
పట్టణంలోని తులసీనగర్‌, ఆదర్శనగర్‌, పాత తాండూరు, గ్రీన్‌సిటీ, భవానీ నగర్‌, ఇందిరానగర్‌, మల్‌రెడ్డిపల్లి, వాల్మీకినగర్‌, సాయిపూరు తదితర కాలనీల్లో మురుగు కుంటలు ఎక్కువగా ఉన్నాయి. పగలు ఈగలు, సాయంత్రం దోమల మోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు దోమకాటుకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో అయిదుగురు చిన్నారులు డెంగీ బారిన పడ్డారు.
ఆస్తి పన్ను రూ.2.60 కోట్లు
పట్టణంలోని ఇళ్ల యజమానుల నుంచి ఏటా మున్సిపాలిటీ అధికారులు రూ.2.60 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో వృథా నీరు ఖాళీస్థలాల్లో చేరి మడుగుకడుతోంది. అంతేకాకుండా ముళ్లపొదలు పెరిగి పాములు, తేళ్లు సంచరిస్తున్నాయి. పట్టణంలో వృథా నీరు ఖాళీ స్థలాల్లోకి వెళ్లకుండా దిగువకు ప్రవహించడానికి 30 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
లేఅవుట్‌ సరిగ్గా లేకపోవడం వల్లే
- వేణుమాధవరావు, ఇన్‌ఛార్జి కమిషనర్‌
స్థలాలను కొనుగోలు చేసిన యజమానులు ఖాళీగా వదిలేయకుండా శుభ్రంగా ఉంచాలి. చుట్టూ ప్రహరీ నిర్మించుకోవాలి. తాఖీదులు చేసి చర్యలు తీసుకుంటాం. పట్టణ పరిశుభ్రతకు కృషి చేస్తాం.
పరిగి.. స్వచ్ఛత ఏదీ?
న్యూస్‌టుడే, పరిగి:
పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు ఖాళీ స్థలాలు ప్రజారోగ్యానికి చేటు చేస్తున్నాయి. ఆయా స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి పందులు, దోమలకు నిలయంగా మారుతున్నాయి. పరిగి పురపాలక సంఘం పరిధిలో 18,241 మంది జనాభా నివసిస్తోంది. పెరిగిన జనాభాతో పట్టణాన్ని 15 వార్డులుగా విభజించారు. 4437 మొత్తంగా ఆవాస ప్రాంతాలున్నాయి. ప్రైవేట్‌ స్థలాలకు చెందిన యజమానులు స్థలం చుట్టూ కంచె వేయకుండా వదిలేయడంతో వరాహాలు ఇక్కడ తిష్ఠవేస్తున్నాయి. పట్టణంలోని శాంతినగర్‌ కాలనీలో ఇళ్ల మధ్య మురుగు కుంటతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు అన్నీ కాలనీల్లో నెలకొన్నాయి.
కునుకు లేకుండా పోతోంది
- బి.మణెమ్మ, శాంతినగర్‌, పరిగి
ఇళ్ల మధ్య మురుగు గుంతతో ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నాం. చినుకు పడితే చాలు మురుగు అంతా అక్కడే వచ్చి చేరుతుంది. పరిసర ఇళ్ల వాసులు ఇళ్ల నుంచి వ్యర్థ జలాలు  అందులోకి వదిలి పెట్టడంతో దోమల సమస్య తీవ్రంగా ఉంటోంది. రాత్రి వేళ దోమలతో కునుకు లేకుండాపోతోంది. అధికారులు గుంతను పూడ్చి సమస్య తీర్చాలి
యజమానులదే బాధ్యత
- జి.తేజిరెడ్డి, కమిషనర్‌, పురపాలక సంఘం, పరిగి
నిర్మాణాలు చేపట్టకుండా వదిలేసిన స్థలాలకు యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కనీసం పందులు సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేము ప్రైవేట్‌, ఖాళీ స్థలాల్లో పని చేయకూడదు. ఎక్కడా బోర్డులు కూడా లేకపోవడంతో స్థలాల యజమానులు ఎవరో తెలియడం లేదు.
కొడంగల్‌: ఇంకెన్నేళ్లు ఎదురు చూడాలో..!
న్యూస్‌టుడే, కొడంగల్‌:
పురపాలక సంఘం పరిధిలోని పలు కాలనీల్లో ఇళ్ల మధ్య మురుగు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని కార్గిల్‌ కాలనీ, సన్‌సిటీ కాలనీ, శాంతినగర్‌ కాలనీ, గాంధీనగర్‌ కాలనీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇళ్లు నిర్మించుకున్న వారు పక్కన ఖాళీ స్థలాల్లోకి నీటిని వదులుతున్నారు. దీంతో ఖాళీ స్థలాలు మురుగు కుంటలను తలపిస్తున్నాయి.
* తాండూరు రోడ్డులోని మార్కెట్‌ యార్డు ముందు పేద ప్రజలకు ఇచ్చిన ప్లాట్లలో కొందరు ఇళ్లు నిర్మించుకోగా, కొందరు స్థలాలు ఖాళీగా వదిలేశారు. ఈ కాలనీలో 30 సంవత్సరాలుగా మురుగు కాలువలు నిర్మించలేదు. దీంతో ఇళ్లు నిర్మించుకున్న వారు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లోకి మురుగు వదిలేస్తున్నారు.
* శాంతినగర్‌ కాలనీ బస్టాండ్‌ సమీపంలో ఉండటంతో పలువురు ప్లాట్లు కొని వదిలేశారు. ఈ కాలనీలో 35 సంవత్సరాలుగా మురుగు కాలువలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మురుగు కాలువల నిర్మాణం చేస్తామని నాయకులు హామీ ఇవ్వడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు.
* గాంధీనగర్‌ కాలనీలో నిరుపేదలు, దళితులు ఎక్కువగా ఉంటారు. ఇటీవల సీసీ రోడ్లు వేశారు. మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
మోహన్‌లాల్‌, ఇన్‌ఛార్జి కమిషనర్‌, కొడంగల్‌
పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మురుగు సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలి. ఖాళీ స్థలాల యజమానులకు తాఖీదులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.