close

శనివారం, ఆగస్టు 24, 2019

ప్రధానాంశాలు

974 ఆవాసాలకు ‘భగీరథ’ నీరు

జిల్లా పాలనాధికారిణి అయేషా

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని 18 మండలాల్లో 974 ఆవాసాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారిణి అయేషా మస్రత్‌ ఖనమ్‌  తెలిపారు. మంగళవారం జిల్లా పరిపాలనా కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో మిషన్‌ భగీరథ ఇంట్రా విలేజ్‌ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటి వరకు 1,98,162 ఇళ్లకుగాను 1,95,407 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. మరో 21,380 నల్లా కనెక్షన్లు ఇచ్చే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 874 ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులకు 619 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన 255 ట్యాంకుల  పనులు జరుగుతున్నాయని వివరించారు. పరిగి, కొడంగల్‌లో పెండింగ్‌లో ఉన్న పైపులైను పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. క్లోరినేషన్‌ వంటివి గ్రామ పంచాయతీలు చూసుకుంటాయని తెలిపారు. ఐదు సంవత్సరాల వరకు పైపులైన్‌ పగిలిపోయినా, ఇతర సమస్యలు తలెత్తినా గుత్తేదారులే పరిష్కరించాలన్నారు. సమావేశంలో మిషన్‌ భగీరథ ఈఈ బాబూ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్‌ సదుపాయం కల్పించండి
జిల్లాలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు స్టాల్స్‌ ఏర్పాటు చేసి మార్కెట్‌ సదుపాయం కల్పించాలని జిల్లా పాలనాధికారిణి అయేషా మస్రత్‌ ఖనమ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిపాలనా కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీ పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం 2018-19లో ఆత్మ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 2019-20 వార్షిక ప్రణాళిక ఆమోదించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌, సీనియర్‌ శాస్త్రవేత్తలు ప్రవీణ్‌, మత్స్యశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, ఉద్యాన అధికారిణి వైజయంతి తదితరులు పాల్గొన్నారు.
మట్టి వినాయకులనే  వినియోగించాలి..
వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కలెక్టర్‌ అయేషా సూచించారు. కుమ్మరి సంఘం శిక్షకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాకు ఈసారి అవసరమైన రెండు లక్షల మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసి ఆగస్టు 15 లోగా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతిమల తయారీకి అవసరమైతే రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. తాండూరు, వికారాబాద్‌ పట్టణాలతో పాటు జిల్లా అంతటా విక్రయించేందుకు సౌకర్యం కల్పిస్తామన్నారు. మట్టితో చేసిన వస్తువులను వినియోగించేలా మహిళా సంఘాలు, కళాశాల విద్యార్థులకు అవగాహన  కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతగిరిని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు మట్టితో చేసిన టీ కప్పులు, గ్లాసులు విక్రయించే స్టాల్‌ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి పుష్పలత, కుమ్మరి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.