గురువారం, డిసెంబర్ 12, 2019
గన్నీ సంచులపై డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు
ఒక్కో దానికి రూ.16 చొప్పున ధర
- న్యూస్‌టుడే - ఇందూరు సిటీ
గన్నీల కొరతను అధిగమించేందుకు పౌర సరఫరాల సంస్థ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొంది. పీడీఎస్ బియ్యం రూపంలో డీలర్లకు అందజేసే సంచులను తిరిగి తీసుకోనుంది. ఇక మీదట ప్రతి డీలరు తప్పకుండా గన్నీలను లెక్కగట్టి తమకు ఇవ్వాల్సిందేనని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఒక్కోదానికి రూ.16 చొప్పున చెల్లించనున్నారు.
నిజామాబాద్‌లో 8 వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 5,500 మెట్రిక్ టన్నుల చొప్పున నెలవారీ కోటా పంపిణీ అవుతోంది. ప్రతి 50 కిలోలకు ఒక బస్తా చొప్పున 13,500 మెట్రిక్ టన్నులకు కలిపి 2.70 లక్షల బస్తాలు డీలర్ల వద్దకు చేరుతున్నాయి. ఇదివరకు వీటికి సంబంధించి ఎలాంటి లెక్కా ఉండేది కాదు. కోటా పంపిణీ పూర్తి కాగానే ఖాళీ సంచులను డీలర్లు ప్రైవేటుగా విక్రయించుకొనేవారు.
ఇకపై పక్కా లెక్క
ప్రస్తుతం గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉంది. ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఒక్కో సంచికి రూ.30-50 వరకు చెల్లిస్తున్నారు. డిమాండు ఉన్న సమయంలో ప్రభుత్వంపై వీటి భారం తడిసి మోపెడవుతోంది. కేవలం వీటి కారణంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతున్న దాఖలాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెలవారీ కోటా కింద అందే ప్రతి సంచికి ఇక మీదట లెక్కగట్టనున్నారు.
అవసరం ఎక్కువే..
రాష్ట్రం మొత్తంతో పోలిస్తే ఉభయ జిల్లాల్లో గన్నీల అవసరం ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉంటుండటంతో కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. ఒక్కో సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోళ్లు జరిగితే సుమారు కోటి మేర సంచుల అవసరం ఉంటుంది. ఇలా ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి సుమారు 2 కోట్ల వరకు అవసరం ఉంది.
ప్రతిపాదన నేపథ్యంలో..
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో గన్నీలకు బాగానే డిమాండు ఉంది. ఇటీవల నిజామాబాద్‌లోని ఓ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 7 లక్షల సంచులు కాలిబూడిదయ్యాయి. ఇప్పటికే వీటి కొరత ఉండగా ఉన్నవి కాలిపోవటంతో కొత్తవి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీలర్ల నుంచి గన్నీలను తిరిగి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వంపై కొంతమేర భారం తగ్గనుంది.
డీలర్లు ఖాళీ గన్నీ సంచులు ఇవ్వాలి
ఇందూరు సిటీ: రేషన్ డీలర్లు ఖాళీ గన్నీ సంచులను తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని జేసీ వెంకటేశ్వర్లు సూచించారు. పౌర సరఫరాల అధికారులు, రేషన్ డీలర్ల సంఘాల నాయకులతో మంగళవారం తన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలనెలా కోటా పంపిణీ పూర్తవగానే ఖాళీ సంచులు పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలన్నారు. ప్రతి నెలా డీలర్లకు కమీషన్ డబ్బులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. పెరిగిన కమీషన్ ప్రకారం తమకు డబ్బులు ఇవ్వాలని డీలర్ల సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా జేసీని కోరారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు