close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

ఊరికి పోయాలి ఊపిరి

అంపశయ్యపై పెద్దగుజ్జుల్‌తండా వాసులు

అర్ధాయుష్షుతో అసువులు బాస్తున్న వైనం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి - న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్‌


పెద్దగుజ్జుల్‌ గ్రామ ముఖచిత్రం

చుట్టూ ఎత్తైన కొండలు.. అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండే ఆవాసాలు.. పచ్చదనం నడుమ జలజలా పారే సెలయేళ్లు.. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే అందాలు.. వీటి మధ్య పండ్లు, ఫలాలు, అటవీలో దుంపలు తింటూ నిండు నూరేళ్లు బతకాల్సిన గిరిపుత్రులు అర్ధాయుష్కులుగా మారి అసువులు బాస్తున్నారు. వీరి గురించి అయ్యో అని ఓదార్పునిచ్చేవారు లేరు. బాధపడేవారు అంతకన్నా లేరు. అసలు మాకే ఎందుకీ శిక్ష చెప్పాలంటూ అధికారులు, పాలకుల కాళ్లావేళ్లా పడ్డా కనికరం చూపని దయనీయ బతుకులు వారివి. ఇదంతా ఎక్కడో మారుమూలనున్న మన్యంలో పరిస్థితి అనుకొనేరు. 44వ జాతీయ రహదారికి కేవలం 15 కిలోమీటర్లు.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధారి మండలం పెద్దగుజ్జుల్‌లోని గిరిజనుల దుర్భర జీవితాలివి. వీరి అనారోగ్యాలకు కారణాలేమిటనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.

‘అమ్మతనం తెలిసే నాటికే అమ్మ దూరమైంది. నేను డిగ్రీ చదువుతున్నాను. హాస్టల్‌లో వసతి పొందుతున్నా. అక్కడికి తోటి విద్యార్థుల తల్లులు వస్తుంటారు. వారు తమ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తుంటే.. నాకోసం రాని, లేని అమ్మను గుర్తుచేసుకొంటూ తపించిపోతున్నా. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే అర్ధరాత్రుళ్లు నిద్ర పోని రోజులెన్నో ఉన్నాయి...’ కేన్సర్‌ బారిన పడి బానోత్‌ అనుబాయి(2012 డిసెంబరు 9న) మరణించగా ఏడేళ్లుగా వేదన పడుతున్న ఆమె కన్న కూతురు మంగీ కన్నీటి గాథ ఇది.

మృత్యువుతో పోరాడుతున్న ఈమె పేరు జరుపుల చావిలి. వయసు యాభై ఆరేళ్లు. ప్రస్తుతం మృత్యువు ముంగిట నిలిచి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. శ్వాస ఎప్పుడాగుతుందో తెలియక.. కుటుంబ సభ్యులతో పాటు ఊరి జనం కళ్లల్లో వత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. ఇంతటి దయనీయత ఎందుకు దాపురించిందని అక్కడి వారిని ఆరా తీస్తే.. మూత్రపిండాల సంబంధిత వ్యాధి కబలిస్తోందని తెలిపారు.

వీరి కుటుంబంలో మొత్తం ఎనిమిది సభ్యులుండగా ముగ్గురికి మూత్రపిండాల సంబంధిత వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ఇంటి పెద్ద అమర్‌సింగ్‌ నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ భార్యాభర్తలిద్దరి(గణేష్‌-సవిత)లో.. సవితకు రెండు మూత్రపిండాల్లో రాళ్లు తీసేందుకు ఇప్పటికే శస్త్రచికిత్సలు చేయించారు. గణేష్‌కు సైతం నెలలో పలుమార్లు ఆసుపత్రి గడప తొక్కందే ప్రాణాలు నిలిచే పరిస్థితి లేదు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని కష్టిస్తే వచ్చే డబ్బులు ఆసుపత్రుల ఖర్చులకు హారతి కర్పూరమవుతున్నాయి.

- కాట్రోత్‌ సవిత

లేవలేని స్థితిలో పడుకొని ఉన్న ఈమె పేరు బదావత్‌ చాంగీబాయి. కేన్సర్‌ బారిన పడి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఇలా భూమికే పరిమితమయ్యారు. ఈమె భర్త రాములుకు మూత్రపిండాలు చెడిపోవడంతో.. మందులు వాడుతూ ప్రాణాలు నిలుపుకొంటున్నారు. వారి పెద్దకొడుకు ఇందల్‌రావునాయక్‌ బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవారు. తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో అవస్థలు పడుతుంటే తట్టుకోలేక కొలువు వదిలి ఇంటికి చేరారు.

తాగునీటిని పరీక్షిస్తాం

- అమూల్య, గ్రామీణ తాగునీటి సరఫరా అధికారిణి, గాంధారి

ప్రస్తుత పరిస్థితిపై గ్రామంలో తాగునీటి పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో పరీక్షలు నిర్వహించినా ఎలాంటి లోపం తేలలేదు. అక్కడ కేవలం మూడు గొట్టపు బావుల ద్వారా మాత్రమే తాగునీటి వసతిని కల్పిస్తున్నాం. మరో వారం రోజుల్లో మిషన్‌ భగీరథ నీటిని అందించే అవకాశం ఉంది.

శిబిరం ఏర్పాటు చేయమన్నాం

- చంద్రశేఖర్‌, జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఇన్‌ఛార్జి అధికారి, కామారెడ్డి

కలెక్టర్‌ ఆదేశాల మేరకు పెద్దగుజ్జుల్‌లో అనారోగ్య పరిస్థితులపై వైద్య శిబిరం ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని మండల వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశాం. వారు గ్రామంలో ఈ పరిస్థితులకు గల కారణాలను అన్వేషిస్తారు.

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?

- కాట్రోత్‌ రవి,

ఇక్కడ కేన్సర్‌తో ఇప్పటికే 12 మంది వరకు మరణించారు. మూత్రపిండాల వ్యాధులతో అనేక మంది మంచం పట్టారు. పలువురు మృత్యుఒడికి చేరారు. మా పల్లెజనం రోగాలతో అవస్థలు పడుతూ ఆర్థికంగా నష్టపోతున్నా.. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు.

తాత-నానమ్మ పోయారు

- చింటు,

మా తాత-నానమ్మలు కేన్సర్‌తో మరణించారు. ఇప్పుడు మా అమ్మానాన్నలూ అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

విన్నవించినా పట్టించుకోవడం లేదు

- ఇందల్‌రావు

మా ఊరి సమస్య గురించి గత నెల 24న ప్రజావాణిలో విన్నవించినా ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. కనీసం గ్రామంలోకి ఒక్క అధికారి కూడా వచ్చి మా అవస్థలపై ఆరా తీయలేదు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.