close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

అసంపూర్తి గదులు.. ఆరుబయట వంటలు

నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ●

అధికారుల పర్యవేక్షణ కరవు

న్యూస్‌టుడే, కామారెడ్డి గ్రామీణం

సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న వంటగది

సర్కారు బడుల్లో వంట గదులు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధిహామీ పథకం కింద ఒక్కో గది నిర్మాణానికి రూ. 2 లక్షల నిధులు కేటాయించింది. పనులు మాత్రం క్షేత్రస్థాయిలో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఆరు బయటే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిపివేశారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, భిక్కనూరు మండలాలకు మంజూరైన వంట గదుల పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ముత్యంపేట పాఠశాలలో ఆరుబయట వండుతున్న నిర్వాహకురాలు

నిరుడు ఉపాధిహామీ పథకం ద్వారా అవసరమైన ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గ్రామాల వారీగా సిబ్బంది ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపడంతో నిధులు కేటాయించారు. ఐదు అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పుతో గది నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. నిర్మాణాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కరవయ్యాయి.

తరగతి గదుల్లోకి పొగ

వంట గదులు అందుబాటులో లేని బడుల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు వరండా, ఆరు బయటే వండుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వంట ఆలస్యమవుతోందని, భోజనం సమయానికి అందించలేకపోతున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. తరగతి గదుల్లో వంట చేయడం వల్ల మిగతా గదుల్లోకి పొగ వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్మాణాలు సకాలంలో పూర్తిచేయించి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

మంజూరుకాని బిల్లులు

వంట గదుల నిర్మాణానికి అనుగుణంగా విడతల వారీగా బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు పనులు చేపట్టడం లేదు. ఆర్నెల్లు గడుస్తున్నా చెల్లింపుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారని గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. దీంతో కొత్తగా నిర్మాణాలు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పెండింగులో ఉన్న బిల్లులు విడుదల చేస్తేనే పనులు పూర్తి చేస్తామని గుత్తేదారులు చెబుతున్నారు.


బిల్లుల మంజూరుకు నివేదించాం

- సాయిబాబా, ఏపీవో, కామారెడ్డి

వంట గదుల బిల్లుల మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదించాం. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. అయితే గుత్తేదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.