close

ఆదివారం, ఆగస్టు 18, 2019

ప్రధానాంశాలు

మరపురాని... జ్ఞాపకం.. మధురాను బంధం! 

ఆకట్టుకునేలా ఆత్మీయ స్మృతి వనాల ఏర్పాటు 
దివంగతుల పేరిట మొక్కలు నాటేందుకు అవకాశం 
చిన్నారుల కోసం మినీ స్టేడియం 
న్యూస్‌టుడే, ధారూర్‌

ఆత్మీయుల జ్ఞాపకం కోసం స్మృతి వనాలు, హరితవనాలు నిలయాలుగా మారుతున్నాయి. గతంలో హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. అదే సమయంలో స్మృతి వనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కూడా హరిత వనాలుగా మారి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు పేర్కొంటున్నారు. అలాంటి ఒక స్మృతి వనం ధారూర్‌ సమీపంలో ఏర్పాటైంది. ఈ వనంలో ఎవరైనా తమ పూర్వీకుల జ్ఞాపకాలను చిరకాలం గుర్తుండేలా వారి పేరు మీద మొక్కలు నాటిస్తున్నారు. దీంతో వారు లేకున్నా వారి జ్ఞాపకాలతో నాటిన మొక్క మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందుకనే ఎంతో మంది మొక్కలు నాటేందుకు మక్కువ చూపుతున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టడం వలన మొక్కలు ఏపుగా పెరిగి వనాలుగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కథనం. 
ప్రధాన రహదారి పక్కనే... 
ధారూర్‌ మండల కేంద్రంలోని సోమశంకరప్ప దేవాలయం సమీపంలో తాండూర్‌- వికారాబాద్‌ ప్రధాన రహదారి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో  స్మృతి వనాన్ని ఏర్పాటుచేశారు. ఇందుకోసం గత పాలనాధికారి ఒమర్‌ జలీల్‌ రూ.12 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో స్మృతి వనంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేశారు. చిన్న పిల్లలు ఆడుకోవడం కోసం ఊయలలు, జారుడు బల్లలు, సేద తీరడం కోసం అందమైన కట్టడం, చెట్లకింద కూర్చోవడం కోసం రచ్చబండలు నిర్మించారు. అందరినీ ఆకట్టుకునేలా అందమైన ముఖ ద్వారం దానికి ఇరువైపులా వివిధ రకాల జంతు, ప్రకృతి  సౌందర్యాల చిత్రాలు వేయించారు. 
ధారూర్‌ మండల కేంద్రంలో విస్తరించి ఉన్న 1,380 ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో వివిధ రకాల వన్యప్రాణులు, రకరకాల పక్షులు కన్పిస్తుంటాయి. ఇక్కడకు వచ్చే యాత్రికులకు వినోదాన్ని కల్గించేందుకు గత ఆర్థిక సంవత్సరంలో చిట్టడవిని వృక్షాల అడవిగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. చిన్నిచిన్న పొదలు, ముళ్ల కంపలను తొలగించారు. దీంతో ముళ్ల పొదలకు బదులుగా చక్కగా పెంచిన  వృక్షాలు కనిపిస్తాయి. అడవిలో వివిధ రకాల వన్యప్రాణుల ఆహారం కోసం 5 హెక్టార్‌లలో గడ్డి వనాలు పెంపకంకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. 
స్మృతి వనంలో పెంచేందుకు కావలసిన మొక్కల్ని ఉపాధి హామీ పథకం ద్వారా స్మృతి వనంలో ప్రత్యేకంగా వన నర్సరీని ఏర్పాటుచేసి అందులో సుమారు 1.15 లక్షల మొక్కలను పెంచుతున్నారు. అందులో వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉంచారు. ఆత్మీయుల పేరిట ఇక్కడ మొక్కలు నాటడమే కాకుండా తమకు ఇష్టమైన మొక్కలను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి తమ ఇంటి దగ్గర నాటుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. 
రూ.5 వేలు జమచేస్తే చాలు.. 
స్మృతి వనంలో ఆత్మీయుల పేరిట మొక్కలు నాటాలనుకునే వారు అటవీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే బ్యాంకు ఖాతాలో ఒక్కో మొక్కకు రూ.5 వేలు జమచేస్తే చాలు. మొక్క సంరక్షణ బాధ్యత అటవీ శాఖ తీసుకుంటుంది. సిబ్బందితో తనకు నచ్చిన మొక్కను నాటి వాటిని సంరక్షిస్తుంటారు. అందుకోసం స్మృతి వనంలోనే వివిధ రకాల మొక్కలను అందుబాటులో ఉంచుతున్నారు. తమ ఆత్మీయుల పేరున నాటిన మొక్క ఎలా ఉందో పరిశీలించుకునే అవకాశం వారికి కల్పించనున్నారు.  స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం ఏర్పాటుచేశారు. చల్లని వాతావరణంలో కుటుంబ సమేతంగా వచ్చి వారి జ్ఞాపకాలను తలుచుకుంటూ మొక్కల వద్ద గడపవచ్చు. 
ఎన్నటికీ మరువలేనివి 
- వెంకటయ్యగౌడ్‌, రేంజ్‌ అధికారి ధారూర్‌ 
కొందరు ఆత్మీయుల జ్ఞాపకాలు ఎన్నటికీ మరుపు రానివి. అలాంటి వారి పేరిట మొక్కలు నాటి ఆ చెట్టు నీడన సేద తీరితే ఆ అనుభూతి వేరు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఎవరైనా ఇక్కడ మొక్కలు నాటే అవకాశం ఉంది. వారు ఎంపిక చేసుకున్న చెట్టు సంరక్షణ ఎలా ఉందో తెలుసుకునే అవకాశం వారికి కల్పిస్తాం. మొక్కలు నాటేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశాం. మొక్కలు నాటేందుకు గుంతలు సైతం సిద్ధంగా ఉన్నాయి. 
ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది 
- జేసీ, అరుణకుమారి 
ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మనుషులు బతికున్నంత కాలం ఇతరులకు సహాయ పడగలం. అయితే చెట్టు బతికున్నపుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మానాన్న, అన్నయ్య జ్ఞాపకార్థం స్మృతి వనంలో మామిడి, నేరెడు మొక్కలను నాటాను. వారు మా మధ్య లేనప్పటికీ వారి రూపంలో మొక్కలను నాటాను. ప్రజలందరికీ ఉపయోగ పడాలనే ఉద్దేశంతో ఇక్కడ మొక్కలను నాటాను. నేరెడు మెక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. షుగర్‌ వ్యాధి నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మామిడి కూడా మంచి మొక్కలే. కాబట్టి వాటిని వారి జ్ఞాపకంగా నాటాను. వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. స్మృతి వనంలో ప్లాస్టిక్‌ వాడకూడదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.