close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

‘పెళ్లి’ మాటలతో టోకరా?

 వివాహ సంబంధాల్లో బురిడీ బాబాలు 
మ్యాట్రిమోనియల్‌ సైట్లలో సైబర్‌ నేరస్థుల చొరబాటు 
మహిళలతో సంభాషించి నగదు స్వాహా 
ఈనాడు, హైదరాబాద్‌

పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు తెలుసుకోవాలంటారు పెద్దలు. అది ఒకప్పటి మాట. ఇప్పుడు అంత ఆరా తీసే ఓపిక, తీరిక ఎవరికీ ఉండటంలేదు. తమకు తెలిసిన సన్నిహితులెవరైనా చెబితే వీలైనంత మేరకు ఆరా తీసి పెళ్లి కుదిర్చేసుకుంటున్నారు. కొందరైతే మ్యారేజి బ్యూరోలను సంప్రదిస్తున్నారు. ఇంకొందరు ఆన్‌లైన్‌లోనే పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. ఇలా తెర పైకి వస్తున్నవాటిలో విశ్వసనీయత ఎంత అనే విషయంపై మాత్రం స్పష్టత కరవవుతోంది. సైబర్‌ నేరగాళ్ల దృష్టి ‘మ్యాట్రిమోనియల్‌’ సైట్లపై పడింది. వరుడి మాదిరిగా వాటిలో పేరు నమోదు చేసుకుంటున్న మోసగాళ్లు.. వధువుగా నమోదైన యువతితో చరవాణిలో మాట్లాడి బహుమతులు పంపించే పేరుతో మోసగిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇటీవల పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 
నమోదుతో మొదలై 
ఒకప్పుడు ఆర్థికపరమైన నేరాలు అంటే గుర్తుకొచ్చేవి దొంగతనాలు, దోపిడీలే. ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు చెమటచుక్క చిందించకుండా ఏసీ గదుల్లో కూర్చొని ఫోన్లు చేస్తూ, చాటింగ్‌లతో రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ తరహా నేరాల పరంపర పెళ్లి సంబంధాల వ్యవహారంలోకి చొరబడింది. మ్యాట్రిమోనియల్‌ సైట్లలో వధువులుగా నమోదు చేసుకుంటున్న మహిళలను లక్ష్యం చేసుకుంటున్నారు. వివాహమై భర్తను కోల్పోయిన వితంతువులు.. వయసు పైబడినా పెళ్లి కాకుండా ఉన్నవారికి వల విసురుతున్నారు. వారి ప్రొఫైల్‌ను(పూర్తి వివరాలు) ఓకే చేస్తున్నారు. అలా మ్యారేజి బ్యూరో నిర్వాహకుల నుంచి వివరాలు కనుక్కొని చరవాణిలోనే మాట కలిపేస్తున్నారు. తాము విదేశాల్లో స్థిరపడిన భారతీయులమని.. వైద్యులుగా, ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఉన్నామని నమ్మబలుకుతున్నారు. భారతీయ స్త్రీలను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంచుకున్నామని చెబుతున్నారు. ఇదంతా వాట్సాప్‌ చాటింగ్‌ లేదా ఫోన్‌ సంభాషణల్లోనే కానిచ్చేస్తున్నారు. అవసరమైతే మహిళ కుటుంబసభ్యులతోనూ మాట్లాడేస్తున్నారు. 
వరుడి నేపథ్యంపై ఆరా కరవు 
మోసాలు జరిగిన సందర్భాల్లో తమకెలాంటి సంబంధం లేదని మ్యారేజీ బ్యూరోలు చేతులెత్తేస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ సమయంలో వధువు, వరుడు వివరాలను మాత్రమే తమ సైట్లలో నిక్షిప్తం చేస్తామంటున్నారు. ఒకవేళ ఒకరి ప్రొఫైల్‌ మరొకరికి నచ్చితే మార్పిడి చేస్తామని చెబుతున్నారు. నేపథ్యాల గురించి పరస్పరం వారే తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. కనీసం ఆధార్‌ తరహా కీలక వివరాలతోపాటు వృత్తిపరమైన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తీసుకోవడంలో బ్యూరోలు విఫలమవుతున్నాయి. అలాంటి వివరాల గురించి అడిగితే ఎక్కడ రిజిస్ట్రేషన్‌ చేసుకోరోననే అనే అనుమానమే నిర్వాహకులను వెనకంజ వేసేలా చేస్తోంది. అరకొర వివరాలతో సరిపెడుతున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు తప్పుడు వివరాలను సమర్పిస్తూ మహిళలను మోసగిస్తున్నారు. 
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి 
మ్యాట్రిమోనియల్‌ సైట్లలో సంబంధాల విషయంలో వధువులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. 
వరుడిని నేరుగా కలవకుండా పెళ్లి సంబంధాల విషయం చర్చించొద్దు. సైట్లలో తమ వివరాలు నచ్చాయని ఎవరైనా ఫోన్‌ చేసినా ప్రత్యక్షంగా కలిసిన తర్వాతే మాట్లాడదామని స్పష్టం చేయాలి. 
పెళ్లి సంబంధం కుదరకముందే బహుమతులు పంపిస్తామంటే అనుమానించాల్సిందే. అలా ఎవరైనా ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించాలి. 
విమానాశ్రయంలో బహుమతుల పెట్టెను స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్‌ అధికారుల పేరుతో ఫోన్‌ వస్తే బూటకమే అని గుర్తించాలి. ఒకవేళ అలా స్వాధీనం చేసుకున్నా సుంకాలు, పన్నులు చెల్లించాలని అధికారులు ఫోన్‌ చేయరు. అలాగే సుంకాలు చెల్లించాలని బ్యాంకు ఖాతానంబర్లు సూచించారంటే కచ్చితంగా సైబర్‌ నేరగాళ్ల పనే అని నిర్ధారణకు రావొచ్చు. నగదు బదిలీ చేస్తే పోగొట్టుకున్నట్లే. 
విమానాశ్రయం నుంచి ఫోన్‌ అంటూ.. 
బాధితురాలు తనను నమ్ముతోందనే భరోసా వచ్చిన తర్వాత సైబర్‌ నేరగాళ్లు రెండో అంకానికి తెర లేపుతున్నారు. కొద్దిరోజుల్లోనే హైదరాబాద్‌ వచ్చేస్తున్నానని.. పెళ్లి చేసుకొని అక్కడే ఏదో వ్యాపారంలో స్థిరపడే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. పెళ్లికి ముందే తన గుర్తుగా ఓ ప్రతినిధి ద్వారా భారీ బహుమతులను పంపిస్తున్నట్లు చెబుతున్నారు. బాధితురాలి కుటుంబం నిజమేనని నమ్ముతోంది. ఆ కుటుంబానికి అనూహ్యంగా న్యూదిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోన్‌ వస్తోంది. విలువైన బహుమతుల పెట్టెను తీసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామంటూ కస్టమ్స్‌ అధికారుల పేరుతో సైబర్‌ నేరగాళ్లే ఫోన్‌ చేస్తున్నారు. వదిలిపెట్టాలంటే కొంత సుంకం కట్టాలని, తాము సూచించే బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయాలంటున్నారు. విలువైన బహుమతి సొంతం అవుతుందనే ఆశతో బాధిత కుటుంబం నగదు బదిలీ చేసేస్తోంది. ఆ వసూళ్ల పరంపర అంతటితో ఆగకుండా జీఎస్టీ, విదేశీ మారకద్రవ్యం, ఉగ్రవాద వ్యతిరేక ఫండ్‌, ఆర్‌బీఐ సుంకం.. తదితర పేర్లతో సాగిపోతోంది. అనుమానం వచ్చే వరకు వసూలుచేసి ఆ తర్వాత ఫోన్లను పక్కనపెడుతున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.